న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్ వాడి ఓట్లను తొలగించారంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తిప్పికొట్టింది. రాహుల్ చేసిన ఆరోపణలు నిరాధారం.. అవాస్తవమని పేర్కొంది. అన్‌లైన్ వేదికగా ఓట్లను తొలగించడం అసాధ్యమని వెల్లడించింది. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓట్లు తొలగించలేదని.. ఆన్‌లైన్‌లో మరెవరూ తొలగించలేరని స్పష్టం చేసింది.
‘‘2023లో అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపునకు విఫల ప్రయత్నాలు జరిగాయి. ఆ వ్యవహారంపై దర్యాప్తు కోసమే ఎన్నికల సంఘమే ఫిర్యాదు చేసింది. రికార్డుల ప్రకారం.. అలంద్ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి విజయం సాధించారు. 2023లో కాంగ్రెస్ నేత బిఆర్ పటేల్ గెలిచారు’’ అని ఇసి వెల్లడించింది.
ఇక రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపణలపై బిజెపి స్పందించింది. ఆయన బాంబులు పేలలేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. రాహుల్ గాంధీ బంగ్లాదేశ్, నేపాల్ వంటి పరిస్థితులు భారత్‌లో కూడా తీసుకురావాలి అని అనుకుంటున్నారని బిజెపి నేత అనురాగ్ ఠాకూర్ అన్నారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తూ.. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ దాదాపు 90 ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ వైరాగ్యంతోనే ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నారు. హైడ్రోజన్ బాంబు పేలుస్తానన్న రాహుల్ చివరకు పటాకులతోనే సరిపెట్టారు. ఆరోపణలే ఆయన రాజకీయ ఆభరణంగా మారాయి. కోర్టులకు క్షమాపణలు చెప్పడం.. కోర్టు మందలింపులు ఆయనకు పరిపాటిగా మారిపోయాయి’’ అని ఠాకూర్ అన్నారు.
Also Read : ఫేక్ అప్లికేషన్లు, ఫేక్ లాగిన్ ఐడిలతో ఓట్లను తొలగించారు: రాహుల్