Sunday, April 28, 2024

నా బొండిగె పిసికేందుకు వాళ్లిద్దరి మధ్య చీకటి బంధం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్, బిజెపిపై ముఖ్యమంత్రి ఫైర్

మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి/చేర్యాల : కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా కటకటాల పాలవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో శనివారం జరిగిన బిఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉన్న తెలంగాణను కాంగ్రెసోళ్లు ఆంధ్రాలో కలిసి 58 ఏళ్ల్లు ముంచారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో ఉద్యమించిన 450 ఉద్యమకారులను కాల్చిచంపిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. 2001లో బిఆర్‌ఎస్ చేపట్టిన ఉద్యమానికి 2004లో కాంగ్రెస్ మళ్ల్లీ తెలంగాణ ఇస్తామని పొత్తు పెట్టుకుందని ఎన్నికలలో గెలిచిన అనంతరం తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. అలాగే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీని విచ్ఛిన్నం చేయడానికి ఎన్నో కుట్రలు చేశారని గుర్తు చేశారు.

ప్రజలు పడుతున్న బాధలను చూడలేక తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అన్న నినాదం మరోవైపు తెలంగాణ శవయాత్రనా, లేక తెలంగాణ జైత్ర యాత్ర అని పట్టు వీడకుండా ఉద్యమాన్ని చేపట్టి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టామన్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ ఏర్పాటుకు 33 పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉండేది బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం ఏలా అభివృద్ధ్ది చెందిందని ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజల ఆశీర్వాదంతో పదేళ్లు బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధ్దిలో ముందుకు దూసుకపోతూ దేశానికే ఆదర్శంగా నిలించిందన్నారు.

కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో రాష్ట్రంలో వలసలు, కరువు కాటకాలు, రైతుల ఆత్మహత్యలే ఉండేవని అన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వచ్చే స్థ్ధాయికి తెలంగాణ చేరుకుందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో జీఆర్ రెడ్డి ఆర్ధిక విశ్లేషకుడితో ఓ కమిటీని ఏర్పాటు చేసి తానే స్వయంగా రాష్ట్ర స్ధితిగతులపై, పింఛన్ పెంచే విధానం, సంక్షేమంపై చర్చలు జరుపుకొని అప్పటికప్పుడే రూ. 200 ఉన్న పింఛన్ రూ. 1000లకు పెంచుకున్నామన్నారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో ఎక్కడైనా రూ. 2 వేల పింఛన్ ఇస్తున్నారా, ఒకవేళ ఇస్తున్నారని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయాన్ని స్ధిరీకరించాలన్న ఉద్దేశ్యంతో రైతులు ఆర్ధికంగా ఎదగాలని వ్యవసాయ రంగానికి నిరంతరమైన నాణ్యమైన విద్యుత్, రైతుబంధు, పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలాంటి అనేక సౌకర్యాలు కల్పించామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండిన ప్రతి గింజను కొనుగోలు చేశామన్నారు. కొన్న ధాన్యానికి సైతం మద్దతు ధరను అందించామన్నారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే రైతు బీమా ద్వారా రూ. 5 లక్షల సహాయం అందిస్తున్నామన్నారు. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో 24 గంటలు కరెంట్ ఇస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఐదు గంటలు సైతం కరంట్ సరఫరా చేయడం లేదన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మాట్లాడడం సిగ్గు చేటన్నారు. ధరణితో రైతుల భూములు రక్షణతో ఉంటాయన్నారు. ధరణిలో ఒక్కసారి భూమి ఎక్కితే సీఎం సైతం మార్చలేడని ఒక్క బోటన వేలు మార్చగలుగుతుందన్నారు. రైతుబంధు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అమవుతుంటే రైతుల సెల్ ఫోన్‌లు టింగ్ టింగ్‌మని మోగుతున్నాయన్నారు. ఇప్పుడిప్పుడే రైతుల ముఖాలు తెల్లబడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వెనకబడిన ప్రాంతంగా పేరుగాంచిందని అదే బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణను సస్యశ్యామలం చేసి అన్ని రంగాలలో అభివృద్ధి చేశామన్నారు.

నేడు పంజాబ్‌ను తలదన్నేలా రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యం పండిందన్నారు. కెసిఆర్‌కు పిండం పెడతామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడడం మరీ దారుణమని ఆ పార్టీకే ఎన్నికల్లో పిండం పెట్టాలని కెసిఆర్ కోరారు. ఎన్నికలలో పార్టీ చేసే సంక్షేమాలు చెప్పుకోవాలి తప్ప బూతులు తిట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎవ్వరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. రేవంత్ రెడ్డి కాదని రైఫిల్ రెడ్డి అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్‌లో రైఫిల్ తీసుకొని ఉద్యమ కారులపై చెలరేగింది రైఫిల్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆంధ్రోళ్ల బూట్లు మోశాడన్నారు. కుక్కలు మెరిగినంత మాత్రాన ఎవ్వరు భయపడే స్థ్ధితిలో లేరన్నారు. కష్టపడి సాధించిన తెలంగాణలో బిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధ్ది ప్రజల ముందే ఉందన్నారు. ఒకప్పుడు తానే స్వయంగా జనగాం పరిధిలోని బచ్చన్నపేటకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే పరిస్థితులను చూసి ఎంతో బాధపడ్డానని గుర్తు చేశారు. ఆ గ్రామంలో చెరువులో చుక్కనీరు ఉండేది కాదని ఆ గ్రామంలో ఉండే యువత అంతా వలసలు వెళితే కేవలం ఆ ప్రాంతంలో ఉండేది పెద్ద వయస్సు ఉన్న వారేనన్నారు. ప్రస్తుతం బిఆర్‌ఎస్ పాలనలో అక్కడి చెరువులన్నీ నిండుకుండల్లా నిండి ఉన్నాయని రైతులు, యువతకు చేతి నిండా పని దొరికిందన్నారు.

దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ 157 మెడికల్ కళాశాలలు ఇస్తే తెలంగాణకు ఏ ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వలేదని అలాగే నవోదయ విద్యాలయాలు సైతం దేశ వ్యాప్తంగా ఇచ్చిన తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదనిమండిపడ్డారు. భారత దేశంలో తెలంగాణ లేదా అని ప్రశ్నించారు. అదే బిఆర్‌ఎస్ సర్కార్ పాలనలో జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకొని సంవత్సరానికి 10వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నామన్నారు. వ్యవసాయ బోరు బావుల కాడ మీటర్లు పెట్టాలని కేంద్రంలోని బిజేపి సర్కార్ చెబితే తాను అంగీకరించలేదని స్పష్టం చేశారు. బావుల కాడ మీటర్లు పెట్టకపోవడంతోనే తెలంగాణకు హక్కుగా రావల్సిన 25వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందన్నారు.

కాంగ్రెస్, బిజేపి చీకటి ఓప్పందాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్, బిజేపోళ్లకు ఓటు వేస్తే తెలంగాణ మళ్లీ 10 ఎండ్ల వెనక్కి పోతుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజాస్వామ్య ప్రక్రియలో కావల్సినంత పరిణితి రాలేదన్నారు. ఆమెరికా లాంటి దేశాలలో ప్రచారాలు సభలు ఉండవని అలాంటి స్ధితులు దేశంలో రావల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని ప్రజలు వేసే ఓటే రాష్ట్ర భవిష్యత్తును ఐదేళ్లు నిర్ణయిస్తుందన్నారు. బిఆర్‌ఎస్‌ది తెలంగాణ జీవన బతుకు పోరాటమన్నారు. చేర్యాలతో తనకు అవినావభావ సంబంధం ఉందని సైకిల్ మీద వచ్చి హింది నేర్చుకున్నానని గుర్తు చేశారు. చేర్యాల చైతన్యమైన గడ్డ అని బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నెలలోపే రెవెన్యూ డివిజన్ చేస్తానన్నారు. అలాగే చేర్యాలను అన్ని రకాల అభివృద్ధి చేస్తానన్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News