Tuesday, June 18, 2024

ఆర్‌టిఒ కార్యాలయాల్లో ఎసిబి మెరుపు దాడులు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు అధికారులు, ఉద్యోగులు, దళారుల్లో
కలవరం అదుపులోకి పలువురు ఏజెంట్లు, ఉద్యోగులు అనధికారిక
నగదు, పత్రాలు స్వాధీనం డ్రైవర్ల వేషధారణలో వెళ్లిన ఎసిబి అధికారులు
ఆశ్వారావు చెక్‌పోస్టు వద్ద భారీగా అక్రమ వసూళ్లు గుర్తింపు

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలపై మంగళవారం ఏసిబి దాడులు చేపట్టింది. ఏసిబి అధికారుల మెరుపు దాడులతో అధికారులు, ఉద్యోగుల్లో కలకలం రేగింది.రవాణా శాఖపై ముఖ్యమంత్రికి వరుస ఫిర్యాదుల వస్తున్న నేపథ్యంలో ఏసిబి ఈ రైడ్స్ చేపట్టింది. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అనిశా అధికారులు భారీ స్థాయిలో సొత్తును, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏజెంట్లు, డ్రైవర్లు, అనధికార వ్యక్తులను ఏసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రవాణా కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు ఉండకూడదన్న నిబంధనలను చాలా ఆర్టీఓ కార్యాలయాలు అతిక్రమించాయని ప్రస్తుత ఏసిబి తనిఖీల్లో తేలింది. డిడిలు, చెక్కులే ఉండాలన్న నిబంధనలకు విరుద్ధంగా పలు ఆర్‌టిఓ కార్యాలయాల్లో నగదు లభ్యం కావడం విశేషం.

ఒక్కో కార్యాలయంలో మూడు టీంలుగా విడిపోయి….

అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిత్యం వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు మూడు నెలలుగా సిఎంఓకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతోపాటు ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్లు తమ హవా కొనసాగిస్తున్నారని, సామాన్యులు లంచం ఇవ్వనిదే పని కావడం లేదని పలువురు సిఎంకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏసిబి అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ పాటు పలు జిల్లాల్లో తనిఖీలు జరిపారు. 12 సంవత్సరాల తరువాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసిబి దాడులు కొనసాగించడం విశేషం. మెరుపుదాడులతో విరుచుకుపడిన ఏసిబి అధికారులు ప్రతి కార్యాలయంలో మూడు అంతకంటే ఎక్కువ టీమ్‌లుగా విడిపోయి ఈ తనిఖీలు చేపట్టారు. ఒక టీమ్ బయట ఉండి ఏజెంట్లను ఆరా తీయగా మరో టీం కార్యాలయాల్లో ఉన్న అధికారులను విచారించగా ఇక మూడో టీం ఆర్టీఏను అధికారులను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.

వేషధారణ మార్చుకొని డెకాయ్ ఆపరేషన్

ఆర్టీఏ ఆఫీసుల్లో, చెక్‌పోస్టుల్లో ఏసిబి ఈ డెకాయ్ ఆపరేషన్‌ను చేపట్టింది. వివిధ వేషధారణల్లో ఏసిబి అధికారులు వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ కోసం క్యూ కట్టినట్టుగా సమాచారం. కొందరు అధికారులు లారీ డ్రైవర్లుగా వేషధారణ మార్చుకొని చెక్ పోస్టుల వద్ద తనిఖీలకు వెళ్లారు. ఏక కాలంలో ఉమ్మడి పది జిల్లాల పరిధిలోని చెక్ పోస్టుల్లో ఏసిబి అధికారులు తనిఖీలను నిర్వహించడం విశేషం.

రాష్ట్రవ్యాప్తంగా రూ.2,70,720ల నగదు స్వాధీనం

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆర్‌టిఏ కార్యాలయాల్లో సుమారుగా రూ.2,70,720ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఏసిబి అధికారులు తెలిపారు. ఈ నగదును 12 ఆర్‌టిఏ కార్యాలయాలతో పాటు ఆర్‌టిఏ చెక్‌పోస్టుల్లోనూ జరిపినట్టు అధికారులు తెలిపారు.

బండ్లగూడ, టోలీచౌకి, మలక్‌పేట ఆఫీసుల్లో పలువురు అదుపులోకి….

హైదరాబాద్‌లోని మలక్‌పేట్ ఆర్టీఏ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించడంతో పోలీసులు దరఖాస్తుదారులను నిలిపివేశారు. పాతబస్తీలోని బండ్లగూడ, టోలీచౌకి, మలక్‌పేటలోని ఈస్ట్ జోన్ వద్ద ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసిబి అధికారులు తనిఖీలు నిర్వహించి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఆదిలాబాద్ చెక్‌పోస్టు వద్ద నగదు సీజ్

ఖమ్మం జిల్లా అశ్వరావుపేట చెక్‌పోస్ట్ దగ్గర ఏసిబి అధికారులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే లారీ డ్రైవర్ల వేషంలో వెళ్లిన అధికారులను ఆర్టీఏ చెక్‌పోస్ట్ సిబ్బంది లంచం డిమాండ్ చేశారు. ఒక్కో వాహనం నుంచి ఆర్‌టిఏ అధికారులు అనధికారికంగా వందల రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా ఏసిబి గుర్తించింది. దీంతోపాటు తెలంగాణ, -ఎపి సరిహద్దు ప్రధాన చెక్ పోస్ట్ కావడంతో అశ్వరావుపేట చెక్‌పోస్ట్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వచ్చిన ప్రతి వాహనం నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఏసిబి అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో భాగంగా సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న రూ.35 వేలను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చెక్ పోస్టులో అనధికారికంగా విధుల్లో ఉన్న ఏడుగురు వ్యక్తులను అధికారులు గుర్తించారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం బోరాజ్ చెక్ పోస్ట్ దగ్గర భారీ మొత్తంలో లెక్కల్లో లేని నగదును ఏసిబి అధికారులు సీజ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

బండ్లగూడ కార్యాలయంలో డబ్బుల గుర్తింపు

రంగారెడ్డి జిల్లాకు చెందిన మణికొండ కార్యాలయంలో (డిటిఓ ఆఫీసులో) 25 మంది అధికారులతో సోదాలు చేపట్టారు. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బండ్లగూడ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పలు పత్రాలును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఏసిబి అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పలు ఫైల్స్‌తో పాటు డబ్బులను గుర్తించారు. ఓ జూనియర్ అసిస్టెంట్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ వెస్ట్ జోన్ కార్యాలయంలోనూ ఏసిబి అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అటు టోలిచౌకీ ఆర్టీఓ ఆఫీస్‌లోనూ ఏసిబి తనిఖీలు కొనసాగాయి.

మహబూబాబాద్‌లో ఆరుగురు ఏజెంట్‌లు….

మహబూబాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసిబి అధికారుల సోదాలు జరిపారు. కొన్ని రోజులుగా ఈ రవాణా శాఖ కార్యాలయంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో అధికారులు ఈ దాడులను నిర్వహించారు. ఆ సమయంలో ఆరుగురు ఏజెంట్లు, రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావును ఏసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల నుంచి రూ.45,100, డ్రైవర్ నుంచి రూ.116,500 నగదుతో పాటు నూతన లైసెన్స్, రెన్యువల్స్, ఫిట్‌నెస్ సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నల్గొండలో దాడుల సమాచారం తెలుసుకొని….

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో ఏసిబి అధికారుల సోదాలు చేపట్టారు. ఏసిబి డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరగ్గా ఆర్టీఓ కార్యాలయంలో ఉన్న పలు రికార్డులను, ఫైళ్లను తనిఖీ చేశారు. కౌంటర్లలో పనిచేసే ఉద్యోగుల వద్ద డిక్లరేషన్ కన్నా ఎక్కువ నగదు లభ్యం అయ్యిందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఏసిబి అధికారులు తెలిపారు. అదేవిధంగా నల్గొండలో ఏసిబి తనిఖీల సమాచారం తెలుసుకున్న అధికారులు ముందుగానే ఆర్టీఓ కార్యాలయం నుంచి వెళ్లిపోయినట్లుగా సమాచారం.

కార్యాలయాలను మూసివేసిన ఏజెంట్‌లు

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలోనూ ఏసిబి అధికారులు దాడులు చేశారు. డీఎస్పీ రేంజ్ అధికారితో పాటు సుమారు 15 మంది అధికారులతో కూడిన బృందం ఈ దాడుల్లో పాల్గొంది. కార్యాలయంలోని కంప్యూటర్లను, రిజిస్ట్రర్‌లను, కీలక ఫైల్స్‌ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ దాడులతో రవాణా శాఖ కార్యాలయ సమీపంలో ఉన్న ఏజెంట్లు వారి కార్యాలయాలను మూసివేశారు.

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు రికార్డుల పరిశీలన

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలోనూ తనిఖీలు జరిగాయి. మహబూబ్‌గర్ ఏసిబి డీఎస్పీ కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉమ్మడి జిల్లా పర్యవేక్షణాధికారి కార్యాలయానికి చేరుకున్న అధికారులు, పలు రికార్డులను పరి శీలించారు. కార్యాలయంలో ఉండే సిబ్బంది, చేస్తున్న పనులు తదితర అంశాలను అడిగి తెలుసు కున్నారు. అయితే 12 ఏళ్ల తర్వాత రవాణాశాఖపై ఏసిబి రైడ్స్ చేపట్టింది.రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవలే భారీగా ఆర్టీఓ అధికారుల బదిలీలు కాగా, ప్రస్తుతం ఈ శాఖపై ఏసిబి దాడులు నిర్వహించడం విశేషం. రానున్న రోజుల్లో తహసీల్దార్ కార్యాలయాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఏసిబి దాడులు జరిగే అవకాశం ఉందని అధికారికవర్గాల సమాచారం. ఈ రెండు శాఖలపై కూడా భారీగా అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసిబి దృష్టి సారించినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News