Friday, April 19, 2024

జెపిసి కోసం బిఆర్‌ఎస్ పట్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఉభయసభలలో గురువారం ఆరవ రోజు కూడా అదానీ- హిండెన్ బర్గ్ నివేదిక అంశంపై విపక్షాల ఆందోళన కొనసాగింది. ఈ అంశంపై బిఆర్‌ఎస్ సహా విపక్షాలు చర్చ కోరుతూ ఉభయసభలలో వాయిదా తీర్మానం ఇచ్చి, చర్చకు పట్టుబడ్డాయి. అధికార పక్షం తీవ్ర నిర్లక్ష్యం చూపడంతో బిఆర్‌ఎస్ ఎంపిలు అదానీ – హిండెన్ బర్గ్ అంశం పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఉభయ సభల నుంచి వాకౌట్ చేశారు. మోడీ,- అదానీల కుంభకోణాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ద్వారా విచారణ జరిపించాలంటూ పెద్ద పెట్టున నినాదాలిస్తూ పార్లమెంట్ ఆవరణలో, మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. జెపిసి ద్వారా విచారణ జరపాలని, మోడీ అదానీలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఇతర ఎంపిలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్ష నేతలు కే. కేశవరావు, నామా నాగేశ్వరరావులు మీడియాతో మాట్లాడుతూ అదానీ- హిండెన్ బర్గ్ నివేదిక అంశంపై సమగ్ర చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలన్నీ కలిసి ఉభయసభలలో వాయిదా తీర్మానాలు ఇస్తుంటే ప్రభు త్వం పెడచెవిన పెడుతున్నదని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా బిఆర్‌ఎస్ ఎంపిలమంతా ఉభయ సభల నుంచి వాకౌట్ చేశామని చెప్పారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కీలకమైన ఈ అంశంపై చర్చకు అనుమతించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. దీనిపై జెపిసి వేసేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News