Wednesday, March 22, 2023

కౌమారాన్ని కాటేస్తున్న నగరవాసం

- Advertisement -

‘The world is increasingly urbanized. For the first time in human history, more than half of the global population lives in cities. This trend is prospected to continue and even accelerate. However, it would be inadequate to discuss urbanization only in terms of its biophysical effects for land cover. Perhaps even more important is the intangible socio-cultural dimension, where urbanization plays a role both as a driver for and as an expression of changes in people’s relationship to their environment’ Richard J. Jewitt

మానవ జీవితంలో కౌమారం (Adolescence) అత్యంత కీలకమైంది. బాలలుగా ఉన్నప్పుడు మగపిల్లలకైనా, ఆడపిల్లలకైనా కౌమారం గొప్ప పరివర్తనా కాలం (Great transition period). శారీరక, మానసిక, సామాజిక ఎదుగుదలకు సంబంధించి ఈ దశలో పెను మార్పులు సంభవిస్తాయి. నిర్ణయాలు తీసుకోవడం (Decision making), సాహస కృత్యాలకు దిగడం (Risk-taking), స్వాతంత్య్రేచ్ఛ (Independent thinking) అనే మూడు ప్రధానమైన గుణాలు కౌమార దశలోనే బాలబాలికల్లో అంకురిస్తాయి. లైంగికేచ్ఛ, శృంగార బాంధవ్యం ( sexual and romantic relationship) వంటి విషయాల్లో కౌమారపు స్పందన భిన్నంగానూ వుంటుంది.

కౌమారం నుండే పిల్లలందరూ తమకో ప్రత్యేక గుర్తింపును కోరుకోవడం ప్రారంభిస్తారు. ప్రతి పనిలో స్వీయ ప్రయత్నాన్ని దృక్పథాన్ని ప్రదర్శిస్తుంటారు. అంతేకాదు, సంప్రదాయాల పునాదులను పెకిలించే వైపుకీ పిల్లలు దృష్టి సారిస్తారు. వ్యక్తిగత జీవితంపై ఆసక్తి పెరుగుతుంది. సక్రియాత్మక వైఖరి, ప్రయోగాత్మక స్వభావం, అభిరుచుల స్థిరీకరణ ఏర్పడుతాయి. అంతక్రితం లేని హావభావాలు, ఉద్వేగాలు పిల్లల్లో బహిర్గతమవుతుంటాయి. కౌమారంలో వేళ్లూనుకున్న అలవాట్లు ఇష్టాయిష్టాలే జీవితకాలపు అలవాట్లు (Life habits)గా మారతాయి. వ్యక్తులుగా తదనంతర జీవితంలో రాణించేందుకు అవసరమైన నడవడిక, ప్రవర్తనకు కౌమారంలోనే అడుగులు పడతాయి. అందుకే కౌమారాన్ని ‘గేట్ వే ఆఫ్ లైఫ్’ అంటారు.

చెట్టు జీవితంలో చైత్రం లాంటిదే మనిషి జీవితంలో కౌమార దశ. అమెరికాలోని క్లేవ్ లాండ్ వైద్య నిపుణులు చెబుతున్నట్టు ‘Physical development in adolescence includes changes that occur through a process called puberty. During puberty, your child’s brain releases certain hormones. The hormones cause your child’s body to physically change and their sexual organs to mature’ కు సంబంధించిన మార్పులతో వయసు రాక మొదలవుతుంది. పిల్లలందరిలో ప్రాకృతికంగా కొన్నిటితో సహజ ఎడబాటు, మరికొన్నిటితో సహజ సామీప్యాలు సంఘటిస్తాయి. పైకి కనబడుతున్నట్టు కౌమార దశ కేవలం శారీరక మార్పుల ద్వారా మాత్రమే గుర్తించబడదు. ప్రధానంగా తమ అభిజ్ఞ, సామాజిక, భావోద్వేగపరమైన మార్పులను కూడా యువకులు విస్తారంగా అనుభవిస్తారు. అయితే కౌమార దశపరంగా పల్లీయ యుక్తవయస్కుల (Rural adolescents)కూ, పట్టణ యుక్తవయస్కుల ( Urban adolescents)కూ గతంలో స్పష్టమైన వ్యత్యాసం ఉండేది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కౌమార సమూహం అధికశారీరక శ్రమచేసేవాళ్లు. నిష్క్రియాత్మక విశ్రాంతి (Passive leisure)కి ఊళ్లల్లో తావుండేది కాదు.

నిశ్చల ప్రవర్తన (Sedentary behaviour)కు అంటే ఇంటికో స్కూలుకో పరిమితమయ్యే పరిస్థితి అనేది గ్రామీణ కౌమారంలో ఉండనే ఉండదు. సమిష్టి జీవనం, సామాజిక భావన జన్మతః అలవడేవి. పల్లీయ యుక్త వయస్కుల్లో ఉండే ఈ హితదాయక వ్యత్యాసాలన్నిటినీ ఇప్పుడు నగర కౌమారం (Urban adolescence) పూర్తిగా హరించేస్తోంది. పిల్లలు పెద్దవ్వడాన్ని నగర సంస్కృతి- ఆర్థికం, మతం, పాఠశాల, మీడియాతో పాటు ఇతరత్రా బయటి కారకాలు ప్రభావితం చేస్తున్నాయి. నగర జీవన శాస్త్ర విమర్శకులు లూయీస్ వర్త్, జార్జి సెమ్మెల్ వందేళ్ల క్రితమే చెప్పినట్టు ‘నగర పరిచయాలు వాస్తవానికి ఎదురెదురుగా ఉన్నట్టే అనిపిస్తాయి. అయితే ఆ పరిచయాలు వ్యక్తిత్వం లేనివి, బోలువి, ఉపరితలంలో చూడ్డానికి మాత్రమే కనిపించేవి, తాత్కాలికమైనవి, విభాగ పూర్వకమైనవి. నగరాల్లో సామాజిక జీవితం పెద్దదిగా, గుణవంత జీవితంగా (Quality of Life)గా కనిపిస్తున్నప్పటికీ పరాయీకరణ, వెలివేత, ఒంటరితనం వంటి భావనలు మనుషులను అశాంతికి గురిచేస్తాయి.

భయాందోళనలు వెంటాడతాయి. ప్రతి ఒక్కరిలో చాలా విచిత్రంగా భావశూన్యత, క్రియా శూన్యత, ఉదాసీనత, నిందాత్మక వైఖరి (Blase attitude) పేరుకుపోతుంది’. బ్లేస్ వైఖరి ఆవహించడం మూలంగా ఇంతకు ముందటి కలుపుగోలుతనం, కుటుంబ క్రమశిక్షణ, సాంఘిక విధేయత గ్రామీణ యుక్తవయస్కులల్లో కొరవడుతున్న పరిస్థితి. కొంచెం సాహసించి చెప్పాల్సి వస్తే పట్టణీయ యుక్తవయస్కుల అలవాట్లు, హావభావాలు, విశృంఖలత గ్రామీణ యువత మీద ముప్పేటగా దాడి చేస్తున్నాయి. ఒకప్పుడు గ్రామాల నుండి ఉన్నత విద్య కోసం నగరాలకు పట్టణాలకు వెళ్లిన యువత తమ నేపథ్యాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యమాల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఆశయాలతో, ఆదర్శాలతో వర్థిల్లేవారు. అందుకే సైద్ధాంతిక చర్చ, సామాజిక ముందడుగు అప్పట్లో సాధ్యమైంది. పట్టణాల్లోని మాల్సూ, మార్కెట్లూ వినోద మాధ్యమాలు, వినోద ప్రాంగణాలు, క్లబ్బులు, పబ్బులు, రిసార్ట్ యువతనిప్పుడు ప్రగతిశీల రహితంగా మార్చేస్తున్నాయి.

పక్కా కమర్షియల్, పూర్తిగా వ్యక్తిగతంగా ఉంచేస్తున్నాయి. కౌమార దశలో 10 నుండి 14 సంవత్సరాల మధ్య వారిని ‘చిరు కౌమార దశ (younger adolescents) అని, 15 నుండి 19 సంవత్సరాల మధ్య వారిని ‘పెద్ద యుక్త వయస్కులు (older adolescents) అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విభాగించింది. ఈ రెండు దశల్లోనూ సహజంగానే పిల్లల గుణగణాలు, పరిణతి, కమ్యూనికేషన్ (Behaviour, Change, Communi cation) లలో విలక్షణత చోటుచేసుకుంటాయి. పారిశ్రామికీకరణ ఆధునికత (Modernity) ని సృష్టించింది. ఆధునికత, ఆధునికానంతరత (Post Modernity)ని తెచ్చింది. ఆధునికానంతరత స్వయం చలనాన్ని (Automation) ను తెచ్చింది. తత్పర్యవసానంగా పాలనా వ్యవహారాలు, సంస్థాగత సేవలకే పరిమితమవ్వాల్సిందిపోయి మానవాళి జీవన వ్యవహారాలన్నిటిలోకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చొరబడింది. ఈ ఆధునికానంతరత, స్వయంచలనం చొరబాట్లు అన్ని వర్గాలనూ, అన్ని చోట్లనూ అతలాకుతలం చేస్తున్నవి. మరీ ముఖ్యంగా కౌమార దశలోని పిల్లలంతా అత్యంత ప్రభావిత వర్గంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

మనిషికి ప్రొటీన్లు అవసరమే. అవే కొవ్వుగా పరిణమిస్తే మొత్తంగా ప్రాణానికే ముప్పు అయినట్టు సమాచార సాంకేతిక విజ్ఞానం ద్వారా అందుబాటులోకొచ్చిన వివిధ యాంత్రిక సామాగ్రి, విద్యున్మాధ్యమ వ్యవస్థ ఇప్పుడు పిల్లలను నైపుణ్యాలతో పాటు దుర్వసనాల్లోనూ పడవేశాయి. మృదు నైపుణ్యాల మాట అటుంచితే, పట్టణీయ యుక్తవయస్కుల (Urban adolescents)కు సమాచార సాంకేతిక విప్లవం తాలూకు నెగెటివ్ స్పేస్ భారీగా చుట్టుముట్టింది. పది నుండి పంతొమ్మిది సంవత్సరాల బాలబాలికల మానసిక ప్రకృతి అసాధారణం (Abnormal) గానూ, అనుచితం (Unfair)గానూ మారింది. ఈ అసాధారణత, అనుచితం నగరాలు పట్టణాలకే కాకుండా గ్రామాలకూ వ్యాపిస్తుంది. అనుకరణ జీవులైన అల్పాదాయ వర్గాలు, మధ్యతరగతి కౌమార సమూహాలు అనియంత్రిత ఒత్తిళ్లకూ, నిస్సహాయతకూ గురవుతున్నారని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇతివృత్తంగా తీసికొని ముంబైకి చెందిన ప్రముఖ నవలా రచయిత జెర్రీ పింటో నగర కౌమారం పై ఇటీవల రాసిన నవలే The Education of Yuri. ఈ నవలలో జెర్రీపింటో కథానాయకుడు యూరీ గురించి ‘He had never thought about it but the feeling of not being in the right place, not being the right shape, not being the right anything, had followed him all his life’ మాదిరిగానే గ్రామీణ యువతను పెద్ద మొత్తంలో అర్బనిటీ అనిశ్చితిలోకి నెడుతుంది.

కౌమారంలోని సంఘటనలు సంఘర్షణల్లో నియంత్రణకు వీలున్నవి ఏవో, నియంత్రణకు వీలులేనివి ఏవో పెద్దలుగా మనకు తెలుసు. నియంత్రణ, అనియంత్రణ యుక్తవయస్కుల ప్రవర్తనతో సంఘటనలకు గల సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే తల్లిదండ్రుల వైపు నుంచి సమయోచిత సంరక్షణ, ఉపాధ్యాయుల వైపు నుండి వయోనుగుణ శిక్షణ యుక్త వయస్కులకు ఎంతో అవసరం. అర్బనిటీ తప్పించుకోలేనిదే అయివుండవచ్చుగాక! స్వయంగా యువతకు copying strategies తెలిసుండాలి. Personal journey mapలో ఉత్కంఠ (Ecstatic) స్థాయి నుండి (Cautious, Feeling positive, Raged, Shocked, Determined, Thrilled, Excited) విజయతీరం (Victorious) దాకాగల ప్రతి అంచెలో సమరం సౌశీల్యం రెండిటినీ నేర్పించాలి. లేదంటే ఇకముందు సామాజిక శ్రేయోవాదుల (Social well-beings) కోసం, ఆనందపు భూగోళ శాస్త్రం (Geography of happiness) కోసం గ్లోబును జల్లెడ పట్టాల్సిందే. ‘యూరీ’ నవలలో జెర్రీ పింటో సమాజంతో మొరపెట్టుకున్నదీ ఇదే.

డా. బెల్లియాదయ్య
9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News