Saturday, April 20, 2024

గ్రామీణ అనారోగ్యం నయం కాదా?

- Advertisement -
- Advertisement -

దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 6,064 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో తీవ్ర స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతతో ప్రజారోగ్యం పడకేస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీటిలో సర్జన్లు 83.2 శాతం, స్త్రీ వైద్య నిపుణులు 74.2 శాతం, ఫిజీసియన్స్ 79.1 శాతం, పెడియాట్రిక్స్ 81.6 శాతం కొరత ఉన్నట్లు తేలడమే కాకుండా పిహెచ్‌సి/ సబ్‌సెంటర్లలో కూడా మహిళ హెల్త్ వర్కర్లు, నర్సింగ్/ మిడ్‌వైఫ్స్ కొరత 14.4 శాతం వరకు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశాలు ముందున్నాయి. అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 46.9 శాతం స్పెషలిస్టులు, 14.7 శాతం జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్, 49.3 శాతం రేడియోగ్రాఫర్స్, 3.9 శాతం ఫార్మాసిస్టులు, 7.2 శాతం ల్యాబ్ టెక్నీషియన్లు, 5.3 శాతం స్టాఫ్ నర్సుల కొరత ఉన్నది.

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా ‘గ్రామీణ ఆరోగ్య గణాంకాల నివేదిక 2021-22 (రూరల్ హెల్త్ స్టాటిస్టిక్స్ 2021- 22)’ వివరాలు పలు ఆశ్చర్యకర, ఆందోళనకర అంశాలను వెల్లడించింది. ఈ నివేదికలో భారత దేశ గ్రామీణ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, వైద్య ఆరోగ్య రంగంలో మానవ వనరుల వివరాలను క్షుణ్ణంగా విశ్లేషించింది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ‘ఆరోగ్య నియంత్రణ సమాచార వ్యవస్థ (హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్‌మేషన్ సిస్టమ్స్)’ గణాంకాలను క్రోడీకరిస్తూ 1992 నుంచి ప్రతి ఏట ఈ నివేదికలను విడుదల చేయుట ఆనవాయితీగా మారింది.
గ్రామీణ ప్రజారోగ్య సమస్యలు
గ్రామీణ భారతంలో వైద్య ఆరోగ్య వసతులు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, వైద్య ఆరోగ్య సిబ్బంది లభ్యత లాంటి అంశాలను విశ్లేషించింది. దేశ వ్యాప్తంగా విస్తరించిన పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల వైద్య ఆరోగ్య వసతులు, మానవ వనరుల గణాంకాలను విశ్లేషించడం, లోటుపాట్లను గుర్తించడం, మౌలిక సదుపాయాలను పెంచడం, వైద్యులు/ సిబ్బంది కొరతను తీర్చడానికి ఈ వార్షిక నివేదికలు దోహదపడతాయి. గ్రామీణ ఆరోగ్య గణాంకాలు: 2021 -2022 నివేదికలో మాతా శిశు ఆరోగ్యం, ఇమ్యునైజేషన్, కుటుంబ నియంత్రణ, సేవల విస్తరణ, కౌమార యువత ఆరోగ్యం, పేషంట్ సేవలు మెుదలగు అంశాలతో కూడిన గణాంకాలను పొందుపరిచారు. దీనితో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల్లో రోగుల రేటు, బ్లడ్ రిప్లేస్‌మెంట్ రేటు, బ్రేస్ట్ ఫీడింగ్ రేటు, శస్త్ర చికిత్స అనంతర ఇన్‌ఫెక్షన్ రేటు లాంటి అంశాలు కూడా ఈ నివేదికలో పొందుపరచబడ్డాయి.
భారతంలో ప్రజారోగ్య వసతులు
దేశ వ్యాప్తంగా ప్రత్యేక వైద్యులు, మౌలిక సదుపాయాల కల్పనలో నెలకొన్న కొరతను నివేదిక బట్టబయలు చేసింది. సగటున ప్రతి 5,691 మందికి ఒక ప్రజారోగ్య ఉపకేంద్రం (సబ్ సెంటర్), ప్రతి 36,049 మందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ప్రైమరీ హెల్త్ సెంటర్, పిహెచ్‌సి), ప్రతి 1,64,027 మందికి ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ నిబంధనలు, నియమాల ప్రకారం ప్రతి 300- 5000 మందికి ఒక ప్రజారోగ్య ఉపకేంద్రం, 20,000- 30,000 మందికి ఒక పిహెచ్‌సి, ప్రతి 80,000 -1,20,000 మందికి ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉండాలని నిర్దేశించారు. దాదాపు సగం పిహెచ్‌సిలు 24 గంటల పాటు సేవలు అందించడం జరుగుతున్నది. మెుత్తం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 541 మాత్రమే నాలుగు రకాల స్పెషలిస్ట్ సేవలను అందిస్తున్నాయి. 2021లో 31,716 మంది ప్రభుత్వ వైద్యులు ఉండగా 2022లో 30,640కి తగ్గడం జరిగింది. దేశ నలుమూల 1.54 లక్షల ‘హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు’ పని చేస్తున్నట్లు, వీటి ద్వారా 12 హెల్త్ ప్యాకేజీల ద్వారా ఉచిత ఔషధాలు/ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడిస్తున్నది. కాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్ లాంటి వ్యాధుల నిర్ధారణ కూడా ఉచితంగా చేస్తున్నారు. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల ద్వారా లక్షకు పైగా ఆరోగ్య సిబ్బంది ‘ఈ -సంజీవని టెలీసర్వీసెస్’ ను నిత్యం అందిస్తున్నట్లు తలుస్తున్నది. దేశ వ్యాప్తంగా 1,61,829 సబ్ సెంటర్లు (1,57,935 గ్రామీణ, 3894 పట్టణ) ఉన్నాయి. దేశంలో 31,053 పిహెచ్‌సిలు (24,935 గ్రామీణ, 6118 పట్టణ), 6064 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (5480 గ్రామీణ, 584 పట్టణ), 1275 సబ్‌డివిజనల్/ జిల్లా ఆసుపత్రులు, 767 జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి.
పట్టణ ఆరోగ్య గణాంకాలు
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (అర్బన్ పిహెచ్‌సి) 18.8 శాతం డాక్టర్లు, 16.8 శాతం ఫార్మాసిస్టులు, 16.8 శాతం టెక్నీషియన్ల కొరత ఉందని తేలింది. ప్రతి పట్టణ పిహెచ్‌సి ద్వారా 50,000 -75,000, ప్రతి అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ద్వారా 2,50,000- 5,00,000 మంది ప్రజలు వైద్య ఆరోగ్య సేవలు పొందుతున్నట్లు పేర్కొనబడింది. ప్రతి 4-5 అర్బన్ పిహెచ్‌సిలకు ఒక అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉన్నట్లు గమనించారు.
గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత
2005లో ప్రారంభించబడిన ‘నేషనల్ రూరల్ హెల్త్ మిషన్’ ద్వారా పిహెచ్‌సిల్లో అలోపతి డాక్టర్ల సంఖ్య 20,308 (2005) నుంచి 30,640 వరకు (50.9 శాతం) పెరగడం హర్షదాయకం. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అవసరం కన్నా 80 శాతం వరకు స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉందని, ఈ సెంటర్లలో సర్జరీ, గైనకాలజీ, పెడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ రంగాల్లో స్పెషలిస్ట్ వైద్యులు ఉండాలనే నియమం ఉన్నది. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 6,064 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో తీవ్ర స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతతో ప్రజారోగ్యం పడకేస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీటిలో సర్జన్లు 83.2 శాతం, స్త్రీ వైద్య నిపుణులు 74.2 శాతం, ఫిజీసియన్స్ 79.1 శాతం, పెడియాట్రిక్స్ 81.6 శాతం కొరత ఉన్నట్లు తేలడమే కాకుండా పిహెచ్‌సి/ సబ్‌సెంటర్లలో కూడా మహిళ హెల్త్ వర్కర్లు, నర్సింగ్/ మిడ్‌వైఫ్స్ కొరత 14.4 శాతం వరకు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశాలు ముందున్నాయి. అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 46.9 శాతం స్పెషలిస్టులు, 14.7 శాతం జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్, 49.3 శాతం రేడియోగ్రాఫర్స్, 3.9 శాతం ఫార్మాసిస్టులు, 7.2 శాతం ల్యాబ్ టెక్నీషియన్లు, 5.3 శాతం స్టాఫ్ నర్సుల కొరత ఉన్నది.
ప్రజారోగ్యం, ఉచిత విద్య, నిరుద్యోగం, అధిక జనాభా, లింగ వివక్ష, పేదరికం లాంటి పలు సమస్యలను తీర్చవలసిన కనీస బాధ్యత భారత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని గుర్తించాలి. ఆసుపత్రులు, వైద్య పరికరాలు, ప్రజారోగ్య కేంద్రాలు, వైద్యులు/ సిబ్బంది కొరతతో ప్రజారోగ్యం పడకేయడంతో ప్రైవేట్ ఆసుపత్రులు / వైద్యులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పేదరికంలో సతమతమవుతున్న బడుగులకు వైద్య ఖర్చులు మోయలేని భారంగా నిలుస్తున్నాయి. ఇప్పటికైన ప్రభుత్వాలు కనీస ప్రజారోగ్య వసతులను దేశ నులుమూలల ఏర్పాటు చేయాలని, ఆరోగ్య భారత నిర్మాణానికి వడివడిగా అడుగులు వేయాలని కోరుకుందాం.

డా. బుర్ర
మధుసూదన్ రెడ్డి
9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News