Thursday, November 30, 2023

కమలంతో కటీఫ్

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీతో అఖిల భారత అన్నాడిఎంకె (ఎఐఎడిఎంకె) తెగతెంపులు తమిళనాడులో హిందూత్వ రాజకీయాల వైఫల్యాన్ని, ద్రవిడ భావజాలం ఎదురులేని స్థితిని చాటుతున్నది. సనాతన ధర్మజాడ్యాన్ని నిర్మూలించాలంటూ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కుమారుడు, డిఎంకె మంత్రి ఉదయనిధి చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో సంభవించిన ఈ పరిణామం తమిళనాడు వరకు ద్రావిడ సిద్ధాంతం తిరుగులేనిదని రుజువు చేస్తున్నది. ఎన్‌డిఎ కూటమి నుంచి ఎఐఎడిఎంకె వైదొలగడానికి దారి తీసిన తక్షణ కారణాలు ఏమైనప్పటికీ కమలంతో కలిసి వున్నంత కాలం తన ద్రావిడ మూలాలు బలహీనపడిపోయి, రాష్ట్ర ప్రజల మద్దతును మరింతగా కోల్పోడమే జరుగుతుందని ఎఐఎడిఎంకె భయపడిందని బోధపడుతున్నది.

పరాన్నభుకులా రాష్ట్రంలో తన బలాన్ని కాజేయడం ద్వారానే బలపడాలని బిజెపి పన్నిన వ్యూహం ఎఐఎడిఎంకెను బాధించిందని అనుకోడానికి ఆస్కారం కలుగుతున్నది. కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటుపై బిజెపితో తెర వెనుక మంతనాలు సాగుతున్న దశలో ఈ రాజకీయ విడాకుల పర్వం సంభవించింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన సర్దుబాటులో బిజెపి కేవలం ఐదు స్థానాలే తన వాటాగా పొందగా, వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అది 15 స్థానాలు డిమాండ్ చేసిందని సమాచారం. తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలున్నాయి. 2019లో బిజెపి ఎఐఎడిఎంకె కూటమి పోటీ చేసి ఇందులో కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. 2021 శాసన సభ ఎన్నికల్లో ఈ కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

అందుచేత ఎన్నికల లాభనష్టాల దృష్టితో చూసినప్పుడు బిజెపితో పొత్తు కొనసాగించడం తనకు ఎంత మాత్రం మేలు చేయదని ఎఐఎడిఎంకె గట్టి నిర్ధారణకు వచ్చిందని అర్థమవుతున్నది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత ప్రభుత్వాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకోడానికి పళనిస్వామి, పన్నీరు సెల్వంలకు కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి అండదండలు అత్యంత అవసరమయ్యాయి. జయలలిత స్నేహితురాలు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్న దశలో ఆమె ఆటలు సాగనివ్వకుండా చేసి వీరిద్దరి మధ్య అంగీకారం కుదిర్చి వారి చేతికి అధికారాన్ని అప్పగించి వెనుకనుంచి అభయహస్తం చాస్తూ వచ్చిన బిజెపి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని తమిళనాడులో గట్టిగా వేళ్ళూనుకోవాలని ప్రయత్నించి విఫలమైంది.

ఇప్పుడు డిఎంకె అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి పరిస్థితులు అనవాళ్ళు లేకుండా పోయాయి. సోమవారం నాడు చెన్నైలో జరిగిన ఎఐఎడిఎంకె ఎంపి, ఎంఎల్‌ఎల, రాష్ట్ర, జిల్లా కారదర్శుల ఉన్నత స్థాయి సమావేశంలో బిజెపితో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని నిర్ణయిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఇందుకు కారణంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై వైఖరిని ఎత్తి చూపారు. మాజీ ముఖ్యమంత్రులు సిఎన్ అన్నాదురై, జయలలితపై ఆయన విమర్శలకు నిరసనగా ఎన్‌డిఎ నుంచి విడిపోతున్నామని ప్రకటించారు.

అన్నామలై మొత్తం 234 అసెంబ్లీ స్థానాలలోనూ పర్యటన కొనసాగిస్తున్నారు. మంత్రి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్య చేసిన సనాతన ధర్మ నిర్మూలన సభలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు పాల్గొనడాన్ని నిరసిస్తూ ఈ నెల 11న బిజెపి రాష్ట్ర వ్యాప్త ప్రదర్శన జరిపింది. 1956లో మదురైలో హిందూ మతాన్ని విమర్శిస్తూ మాట్లాడి స్వాతంత్య్ర యోధుడు, తేవార్ల నాయకుడు ముత్తురామలింగ తేవార్ ఆగ్రహాన్ని అన్నాదురై చవిచూశారని, ఆయన అనుచరుల దాడి నుంచి తప్పించుకోడానికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి పారిపోయాడని ఈ సందర్భంగా అన్నామలై వ్యాఖ్యానించారు. దీనికి అన్నామలైపై రెండు ద్రవిడ పార్టీలూ తీవ్రంగా విరుచుకుపడ్డాయి.

అన్నాదురై, ముత్తురామలింగ తేవార్ మంచి స్నేహితులని అవి పేర్కొన్నాయి. అన్నామలై పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని అభిప్రాయపడ్డాయి. ద్రావిడ ఉద్యమం తమకు ఉనికిని ఇచ్చిందని, అన్నాదురై ప్రతి ఒక్కరికీ అవకాశాలను, మహిళలకు సమాన హక్కులను ఇవ్వడమే గాక, ఈ రాష్ట్రానికి తమిళనాడు పేరును కూడా ఇచ్చారని ఆయన గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని ఎఐఎడిఎంకె స్పష్టం చేసింది. ద్రావిడ అగ్రనేత అన్నాదురై మీద అవాకులూ చెవాకులూ పేలడం ద్వారా అన్నామలై బిజెపికి రాష్ట్రంలో మరణ శయ్య సిద్ధం చేస్తున్నాడని డిఎంకె వ్యాఖ్యానించింది. మొత్తమ్మీద ఎఐఎడిఎంకె తన ద్రవిడ మూలాలను తిరిగి బలపరచుకొనే ప్రయత్నంలో బిజెపితో తెగతెంపులు చేసుకోడం విశేష పరిణామం. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు తాను వేరే కూటమిని నిర్మిస్తానని అది చేసిన ప్రకటన ఏ మేరకు రూపుదాలుస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News