అమరావతి: రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరం అని ఎపి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తికానుందని అన్నారు. ప్రాజెక్టుకు పవన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల, దుర్గేష్, ఎంపి పురంధేశ్వరి పాల్గొన్నారు. పుష్కర ఘాట్ వద్ద రూ. 94.44 కోట్ల వ్యవయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు (Godavari Project) నిర్మించబడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తీరం వెంబడి నాగరికత, భాష అన్నీ పెరుగుతాయని, ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇది అని ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతోమంది కళాకారులకు జన్మనిచ్చిన నేల ఇది అని కొనియాడారు.
ఎంతో కాలంగా ఉన్నకలను సాకారం చేసే దిశగా ముందుకెళ్లడం ఆనందదాయకమని అన్నారు. పర్యాటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని, ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది పర్యాటకులు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామంటే షెకావత్ కారణం అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి షెకావత్ ప్రత్యేక కృషి చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవనం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామని అన్నారు. వీరులు పుట్టిన నేల నుంచి గజేంద్రసింగ్ షెకావత్ వచ్చారని పవన్ కల్యాణ్ తెలియజేశారు.