Tuesday, June 18, 2024

ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం:ఏలేటి మహేశ్వర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్ బోగస్ ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. వడ్లు కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎప్పుడు పడిపోతుందో తెలియని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడుపుతున్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కాదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బిజెపితో టచ్‌లో ఉన్నారని సంచనల వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన శాఖ నిర్వహణలో దారుణంగా విఫలమయ్యారని అన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయించలేని ఉత్తమ్ కుమార్‌రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఉత్తమ్‌కు రైతాంగ సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి సోదరులు, జగ్గారెడ్డి చెబుతున్న మాటలకు తాము జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వడ్లు కొనుగోలులో రైస్ మిల్లర్లు రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మిల్లర్ల దోపిడీ కారణంగా రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం గానీ, సంబంధిత మంత్రిగాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బిజెపి శాసనసభ పక్షం తరఫున తాము రైస్ మిల్లర్లు రైతులను బెదిరించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల వాగ్ధానాల్లో వరికి బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తీరా ఎన్నికలు అయ్యాక సన్న బియ్యానికి మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడం చాలా అన్యాయమని మహేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా రైతులకు రుణమాఫీ, ఇతర వాగ్ధానాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News