Friday, April 26, 2024

పాలస్తీనాపై అమెరికా కుట్ర!

- Advertisement -
- Advertisement -

మధ్య యుగాల్లో జరిగిన మత యుద్ధాలలో యూదులను పాత ఇజ్రాయల్, జుడా దేశాల నుంచి తరిమివేశారు. ఆక్రమంలో వారంతా అనేక దేశాలకు వెళ్లారు. చరిత్రలో వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే పేరుతో ఇజ్రాయల్‌ను పునరుద్ధరించాలనే వాదాన్ని ముందుకు తెచ్చారు. పశ్చిమాసియాలో కనుగొన్న చమురు నిల్వలను సొంతం చేసుకోవటం కూడా దాని వెనుక ఉంది. తమకు విశ్వాస పాత్రధారిగా ఉండేందుకు బ్రిటన్ సామ్రాజ్యవాదులు పన్నిన ఎత్తుగడలో భాగంగా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఏర్పడిన పాలస్తీనాను రెండు ముక్కలుగా చేసి ఇజ్రాయల్‌ను ఏర్పాటు చేశారు. అడ్డగోలుగా చేసిన తీర్మానాన్ని యూదులు అంగీకరించగా, అరబ్బులు తిరస్కరించారు.

ఏడున్నర దశాబ్దాలుగా మాతృదేశంలోనే బందీలుగా, కొలువులు నెలవులు తప్పిన వారిగా, ఇరుగు పొరుగు దేశాల్లో శరణార్ధుల శిబిరాల్లోనే పుట్టి పెరిగి, మరణించిన వారెవరైనా వర్తమాన ప్రపంచంలో ఉన్నారంటే వారే పాలస్తీనా అరబ్బులు. ఐరాస చరిత్రలో ఘోర వైఫల్యాల్లో తాను చేసిన పాలస్తీనా తీర్మానాన్ని అమలు జరపలేని అసమర్ధత. జోర్డాన్, లెబనాన్, సిరియా, సౌదీ అరేబియా, ఇరాక్‌లలో లక్షలాది మంది పాలస్తీనియన్లు శరణార్ధులుగా ఉన్నారు. 1947 నవంబరు 29న ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ ఆమోదించిన 181వ తీర్మానం ప్రకారం పాలస్తీనాను రెండుగా చీల్చి ఒక ముక్కను ఇజ్రాయల్‌గా ప్రకటించారు. చరిత్రాత్మక జెరూసలెం పట్టణం, పరిసరాలను ఎవరికీ చెందకుండా వాటికన్ మాదిరి ప్రత్యేక ప్రాంతంగా ఉంచాలని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని అరబ్బులు తిరస్కరించారు.

1948 మే 14 అధికారికంగా ఇజ్రాయల్ ఏర్పాటు ప్రకటన జరగ్గానే అరబ్బులు తిరుగుబాటు చేశారు అప్పటికే బ్రిటన్, అమెరికా తదితర సామ్రాజ్యవాదులు కుట్ర చేసి ఇతర దేశాల్లోని యూదులను రప్పించటమే గాక విభజిత ప్రాంతంలో వారికి ఆయుధాలు, డబ్బు అందచేసి సిద్ధంగా ఉంచారు. ఎప్పుడైతే అరబ్బులు తిరుగుబాటు చేశారో దాన్ని సాకుగా తీసుకొని యూదు సాయుధ మూకలు మొత్తం పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించేందుకు పూనుకున్నాయి. ఆ క్రమంలో ఇజ్రాయల్ దురాక్రమణను నివారించేందుకు ఇరుగు పొరుగు అరబ్బు దేశాలు పాలస్తీనా ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి.

తరువాత జరిగిన అనేక పరిణామాల్లో అమెరికా రంగ ప్రవేశం చేసి పాలస్తీనాకు గుర్తింపు రాకుండా అడ్డుపడుతున్నది. దాని అండ చూసుకొని ఇరుగుపొరుగు దేశాలపై ఇజ్రాయల్ దాడులకు దిగి కొన్ని ప్రాంతాలను తన ఆక్రమణలోకి తెచ్చుకుంది. పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఇతర చోట్ల నుంచి యూదులను రప్పించి అక్కడ శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసి అరబ్బులను మైనారిటీలుగా మార్చివేసి అవి కూడా తనవే అనే అడ్డగోలు వాదనకు దిగింది. జరూసలెం పట్టణాన్ని కూడా ఆక్రమించి అది కూడా తనదే అని ప్రకటించుకుంది. తన రక్షణకు హామీగా మరికొన్ని ప్రాంతాలను తనకు అప్పగించాలని విపరీత కోర్కెలను ముందు కు తెస్తున్నది.

మధ్య యుగాల్లో జరిగిన మత యుద్ధాలలో యూదులను పాత ఇజ్రాయల్, జుడా దేశాల నుంచి తరిమివేశారు. ఆక్రమంలో వారంతా అనేక దేశాలకు వెళ్లారు. చరిత్రలో వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే పేరుతో ఇజ్రాయల్‌ను పునరుద్ధరించాలనే వాదాన్ని ముందుకు తెచ్చారు. పశ్చిమాసియాలో కనుగొన్న చమురు నిల్వలను సొంతం చేసుకోవటం కూడా దాని వెనుక ఉంది. తమకు విశ్వాస పాత్రధారిగా ఉండేందుకు బ్రిటన్ సామ్రాజ్యవాదులు పన్నిన ఎత్తుగడలో భాగంగా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఏర్పడిన పాలస్తీనాను రెండు ముక్కలుగా చేసి ఇజ్రాయల్‌ను ఏర్పాటు చేశారు. అడ్డగోలుగా చేసిన తీర్మానాన్ని యూదులు అంగీకరించగా, అరబ్బులు తిరస్కరించారు.

ఒక పరిష్కారాన్ని కనుగొనే పేరుతో ఐరాస కొత్త వివాదాన్ని ముందుకు తెచ్చింది. పాలస్తీనాను మూడు ముక్కలుగా చేసి వాటి చుట్టూ ఉన్న ప్రాంతాలను ఇజ్రాయల్‌కు కేటాయించింది. జెరూసలెం నగరం పాలస్తీనా మధ్యలో ఉంది. పాలస్తీనా పౌరులు తమ దేశంలోని ప్రాంతాలకు వెళ్లాలంటే ఇజ్రాయల్ అనుమతి అవసరం. 1948 దాడులలో యూదులు జెరూసలెం ను ముట్టడించారు. దాన్ని ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగిన జోర్డాన్ పాలకులు జోర్డాన్ నదికి పశ్చిమాన ఉన్న (దాన్నే పశ్చిమ గట్టు ప్రాంతం అంటారు) పాలస్తీనా ప్రాంతాలు, తూర్పు జెరూసలెంను అదుపులోకి తీసుకొని తరువాత వాటిని విలీనం చేసుకున్నట్లు ప్రకటించారు. తరువాత వాటి మీద తమ హక్కును వదులుకున్నట్లు ప్రకటించింది.

అంతకు ముందు పశ్చిమ జెరూసలెం పట్టణాన్ని ఆక్రమించుకున్న ఇజ్రాయిల్ తరువాత అసలు మొత్తం నగరాన్ని స్వంతం చేసుకుంది. రాజధానిగా టెల్‌అవీవ్ ఉన్నప్పటికీ ఐరాస తీర్మానం, అరబ్బుల అభిప్రాయాలకు విరుద్ధంగా పార్లమెంటుతో సహా ప్రభుత్వ శాఖలన్నింటినీ అక్కడ ఏర్పాటు చేసింది. దేశ అధ్యక్షు డు, ప్రధాని నివాసాలు, సుప్రీంకోర్టును కూడా అక్కడే ఏర్పాటు చేశారు. దీన్ని అంతర్జాతీయ సమాజం ఆమోదించ లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2017 డిసెంబరులో జెరూసలెంను ఇజ్రాయల్ రాజధానిగా గుర్తిస్తూ టెల్ అవీవ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని అక్కడికి తరలిస్తున్నట్లు ప్రకటించాడు. వివాదాస్పద ప్రాంతంలోని ఒక భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.

ఇటీవలనే శాశ్వత భవనానికి స్థలం కేటాయించినట్లు అక్కడి మేయర్ ప్రకటించాడు. ఈ విధంగా ఐరాస తీర్మానాన్ని అమెరికా కూడా ఉల్లంఘించింది. పశ్చిమ గట్టు ప్రాంతం పాలస్తీనాది కాగా అక్కడ 167 అరబ్బుల నివాస ప్రాంతాలు మాత్రమే పాలస్తీనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. ఇజ్రాయల్ తన పౌరులతో నింపేందుకు నిర్మించిన 200 నివాస ప్రాంతాలు దాని ఆధీనంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలలో మిలిటరీ, యూదు దురహంకార శక్తులు నిత్యం అరబ్బులతో గిల్లి కజ్జాలకు పాల్పడుతుంటాయి. వారు ప్రతిఘటిస్తే దాడులు జరుపుతాయి. గాజా ప్రాంతంలో పాలస్తీనా విముక్తి కోసం పోరాడే హమస్ సంస్థ అధికారంలోకి వచ్చిన తరువాత 2007 నుంచి ఆ ప్రాంత మొత్తాన్ని ఇజ్రాయల్ దిగ్బంధనం గావించింది. గతంలో దాడులు కూడా చేసింది.
పాలస్తీనా ప్రాంతాలన్నింటితో కూడిన ప్రభుత్వాన్ని 1948 సెప్టెంబరు 22న అరబ్ లీగ్ నాడు ఈజిప్టు రక్షణలో ఉన్న గాజా ప్రాంతంలో ఏర్పాటు చేసింది.

దాన్ని ఒక్క జోర్డాన్ తప్ప అన్ని అరబ్ దేశాలూ గుర్తించాయి. 1988లో పాలస్తీనా ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అల్జీర్స్‌లో పిఎల్‌ఎ నేత యాసర్ అరాఫత్ ప్రకటించాడు. 1993లో ఓస్లో ఒప్పందాల తరువాత పశ్చిమ గట్టు, గాజా ప్రాంతాల్లో పరిమిత అధికారాలు గల ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం పాలస్తీనాను ఐరాసలోని 193కు గాను 138 దేశాలు గుర్తించాయి. 2012లో ఐరాస ఆమోదించిన తీర్మానం ప్రకారం సభ్యురాలు గాని పరిశీలక దేశ హోదాను కల్పించారు. ప్రస్తుతం అరబ్ లీగ్, ఇస్లామిక్ దేశాల సంస్థ, జి 77, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, యునెస్కో, అంక్టాడ్, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ప్రతినిధిగా ఉంది. పూర్తి స్థాయిలో ఐరాసలో సభ్యత్వం ఇస్తే ఐరాస 181 తీర్మానం ప్రకారం అన్ని ప్రాంతాలను పాలస్తీనాకు అప్పగించాల్సి ఉంటుంది. జరూసలెం సమస్యనూ పరిష్కరించాల్సి ఉంటుంది. అది జరగుకుండా అమెరికా తన వీటో హక్కుతో అడ్డుపడుతున్నది. అందువలన ఇజ్రాయల్‌తో పాటు దానికి మద్దతు ఇస్తున్న అసలైన నేరస్థురాలు అమెరికా, మద్దతు ఇస్తున్న దేశాల వైఖరిని నిరసిస్తూ నవంబరు 29న ప్రపంచ మంతటా పాలస్తీనాకు మద్దతుగా జన సమీకరణ జరుగుతున్నది. మన దేశంలో అఖిల భారత శాంతి సంఘీభావ సంస్థ ఈ మేరకు పిలుపునిచ్చింది.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News