Saturday, September 14, 2024

మోడీపై అగ్రరాజ్యం ఒత్తిళ్ళు

- Advertisement -
- Advertisement -

అర్ధాంతరంగా ప్రధాని నరేంద్ర మోడీ జరిపిన యుద్ధం పీడిత ఉక్రెయిన్ పర్యటనను ‘చరిత్రాత్మకం’గా ప్రచారం చేసుకుంటున్నా దౌత్యపరంగా నిర్దిష్టమైన వ్యూహం లోపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ పర్యటన పూర్తి కాగానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి ఆయనను ప్రశంసించడం, అమెరికా మీడియా పొగడ్తలతో నింపేయడం గమనిస్తే అమెరికా వత్తిడుల కారణంగానే ఆయన ఈ పర్యటన జరిపారని అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. అంతకు ముందు జులైలో జరిపిన రష్యా పర్యటన పట్ల అమెరికా తన ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేసింది. వాషింగ్టన్‌లో నాటో 75వ వార్షికోత్సవ సదస్సు జరుగుతున్న సమయంలో ఆయన పుతిన్‌తో విందారగించడాన్ని సహింపలేకపోయింది.

పొరుగు దేశాలలో జరుగుతున్న రాజకీయ మార్పులలో అమెరికా ప్రత్యక్ష ప్రమేయం స్పష్టంగా కనిపిస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాగానే ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటన జరపడాన్ని అమెరికా సహించలేకపోయింది. ఆ తర్వాత ఆయన ఆధికారం కోల్పోవడమే కాకుండా జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో సైతం అమెరికా కన్నెర్ర చేయడంతోనే షేక్ హసీనా దేశం వదిలిపోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో అమెరికాతో ఘర్షణకు భారత్ సిద్ధంగా లేదు. 1971 యుద్ధానికి ముందు వైట్ హౌస్‌కు వెళ్లి, కొన్ని వేలాది కి.మీ దూరం నుండి వర్ధమాన దేశాలపై పెత్తనం చేయాలి అనుకొంటే సాగదని నేరుగా అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ను హెచ్చరించివచ్చిన ఇందిరా గాంధీ వంటి బలమైన రాజకీయ నాయకత్వం నేడు దేశం లో లేదు. అందుకనే మోడీ రష్యా పర్యటన తర్వాత రెండు రోజులకే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్‌ను కలుసుకున్నారు.

వ్యూహాత్మక కలయికకు ఇండియా తీవ్రంగానే కట్టుబడి వుంటుందని చెప్పడం, టోక్యోలో జరగబోయే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరవుతుందని హామీ ఇచ్చారు. టోక్యోలో అమెరికా విదేశాంగ కార్యదర్శిని మన విదేశాంగ మంత్రి జైశంకర్ కలిసి అమెరికాను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ సమావేశాల తర్వాతనే మోడీ ఉక్రెయిన్ పర్యటన తెరపైకి వచ్చింది. పైగా గుజరాత్ ముఖ్యమంత్రిగా పదేళ్ళపాటు అమెరికా, ఐరోపా దేశాలలో ప్రవేశించకుండా ‘నిషేధం’ ఎదుర్కొన్న నరేంద్ర మోడీని ‘కౌగలింతలు’, ‘గ్రూప్ ఫోటోలు’, ‘ప్రవాస భారతీయులతో సంబరాలు’ వరకు మాత్రమే ఈ దేశాలు పరిమితం చేస్తున్న వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. 2024 ఎన్నికల్లో బిజెపి సొంతంగా మెజారిటీ సాధింపలేకపోవడంతో ప్రజాకర్షణ కోల్పోయిన నేతగా మిగిలిన మోడీ రష్యా అందించే అత్యున్నత పౌరపురస్కారం అందుకోవడం ద్వారా అంతర్జాతీయ నేతగా మరోసారి ప్రజల దృష్టి ఆకర్షించడం కోసం జులైలో హడావుడిగా రష్యా పర్యటన జరిపారు.

అయితే ఆ సమయమే అమెరికాకు ఆగ్రహం కలిగించింది. ఒక వంక అమెరికా ఆగ్రహాన్ని తట్టుకోలేరు, మరోవంక రష్యాతో వ్యూహాత్మక బాంధవ్యాన్ని వదులుకోలేరు. ఇటువంటి ఇరకాట పరిస్థితిలో ప్రేరేపిత దేశాల మధ్య ‘శాంతిదూత’గా పర్యటనకు వెళ్లారని ప్రచారం జరగడం గమనార్హం. మోడీ ఉక్రెయిన్‌లో అడుగు పెట్టిన్నప్పుడే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికాలో అడుగుపెట్టారు. నాలుగు రోజుల ఈ పర్యటనలో భద్రతా సరఫరాల ఒప్పందం (ఎస్‌ఒఎస్‌ఎ)తో పాటు అమెరికా కీలక కమాండ్ కేంద్రాలలో భారతీయ సైనికాధికారులను నియమించడం పైనా అవగాహనపై సంతకాలు చేశారు.

భారత్ పొందుతున్న ఆయుధాలలో అత్యధికంగా రష్యా నుండే వస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రెండున్నరేళ్లుగా రష్యా నుండి ఆయుధాల సరఫరా మందగించింది. మరోవంక, పాశ్చాత్య దేశాల ఆర్ధిక ఆంక్షలు అకారణంగా చైనాపై రష్యా ఎక్కువగా ఆధారపడాల్సి వస్తున్నది. భారత్ చైనాల సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తల కారణంగా భారత్‌కు అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేయనీయకుండా చైనా వత్తిడి తెస్తున్నది. మరోవంక, ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన జరిపిన సమయం సైతం అంత సానుకూలమైనది కాదు. కురస్క్ ప్రాంతంలో రష్యాలోకి ఉక్రెయిన్ సేనలు చొరబాటు జరపడం ద్వారా ఊహించని షాక్ ఇచ్చాయి.

ఆ విధంగా తమ భూభాగాలను ఖాళీ చేయమని రష్యాపై వత్తిడి తెచ్చేందుకు ఎత్తుగడ వేశారు. అయితే రష్యా మరింత పట్టుదలతో ఉధృతంగా ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించింది. ఉక్రేనియన్ బలగాలను తిప్పికొట్టడానికి అణ్వాయుధాలను మినహాయించి తన వద్ద ఉన్న ప్రతిదాన్ని ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నది. ఇటువంటి సమయంలో ఉక్రెయిన్ వెళ్లి ప్రధాని మోడీ పలికే శాంతి, సయోధ్య సూచనలకు ఏమాత్రం విలువ ఉంటుందనెడిది ప్రశ్నార్ధకమే. ఇటువంటి సమయంలో కైవ్‌లో ‘ఈ సంక్షోభం నుండి బయటపడటానికి మార్గాలను వెతకడానికి ఇరుపక్షాలు కలిసి కూర్చోవాలి’ అంటూ చేసిన ప్రకటనను ఎవ్వరూ సీరియస్‌గా తీసుకొనే అవకాశం లేదు.

పైగా, తన ఉక్రెయిన్ పర్యటన అనంతరం బైడెన్ ఫోన్ చేసి ప్రశంసించగానే, మోడీ నేరుగా పుతిన్‌కు ఫోన్ చేసి తన పర్యటన గురించి వివరించాల్సి రావడం గమనార్హం. పైగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రధాని మోడీ ఇంకా తమ దేశంలో ఉండగానే జరిపిన మీడియా గోష్టిలో కొన్ని కటువైన వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర ఇండియా చమురు కొనడం ద్వారా దాని ఆయుధ పరిశ్రమకు నిధులు సమకూర్చడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ శాంతి ప్రవచనాల పట్ల అసమ్మతి వ్యక్తం చేస్తూ శిఖరాగ్ర శాంతి సమావేశం జరపడంలో ఇండియాకు ఎలాంటి పాత్ర కల్పించడానికి జెలెన్ స్కీ నిరాకరించారు.
శాంతి సదస్సు ప్రకటనలో పాలుపంచుకోని ఒక దేశంలో తాను ఒక శిఖరాగ్ర శాంతి సదస్సు జరపలేనని స్పష్టం చేశారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన శాంతి సదస్సు సంయుక్త ప్రకటనలో భారత దేశం పాలు పంచుకోకపోవడాన్ని ఆయన ఆ విధంగా ప్రస్తావించారు.

పైగా, భారత్ సందర్శించమని మోడీ అందజేసిన ఆహ్వానం పట్ల కూడా సానుకూలంగా స్పందించలేదు. ఇండియా సందర్శించే సమయానికి అది తనవైపున వుండాలి గానీ అమెరికా, రష్యాల మధ్య సమతూక స్థితిలో వుండకూడదని జెలెన్ స్కీ పేర్కొనడం గమనార్హం. మొదటిసారి ప్రధాని పదవి చేపట్టే సమయంలో సార్క్ అధినేతలను ఆహ్వానించడం ద్వారా పొరుగు దేశాలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం తన మొదటి ప్రాధాన్యతగా ప్రధాని మోడీ తెలియజెప్పారు. అయితే ఇప్పుడు దాదాపు అన్ని దేశాలలో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఒక విధంగా భారత్ వ్యతిరేక శక్తులకు కేంద్రాలుగా ఆయా దేశాలు ఉన్నాయి.
విశ్వసనీయమైన మిత్రురాలిగా ఉన్న షేక్ హసీనా మన దేశంలోనే ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తలకు ఇప్పట్లో పరిష్కారం కనిపించడం లేదు. ఆ రెండు దేశాలతో మన సంబంధాలు ఒక విధంగా ప్రతిష్టంభనలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా అమెరికా కారణంగానే చైనాతో సరిహద్దు అంశంలో రాజకీయ పరిష్కారం కనిపించడం లేదు. రాజీవ్ గాంధీ సరిహద్దు సమస్యలపై చైనాతో ఒప్పందం చేసుకున్న తర్వాత నాలుగేళ్ల వరకు రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో కాల్పుల ప్రసక్తి లేదు.

కానీ భారత్ చైనా వ్యతిరేక సైనిక కూటమిగా భావించే క్యాడ్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలిసి చేరడంతోనే సరిహద్దుల్లో ఉద్రిక్తలకు బీజం పడిందని భావించాలి. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా క్వాడ్‌లో చేరడం ఓ విధంగా ప్రతిబంధకంగా మారుతున్నది. మనం క్వాడ్‌లో చేరిన కెనడా ప్రధాని బహిరంగంగా ఖలిస్థాన్ ఉగ్రవాదులపై దాడుల విషయంలో భారత్‌పై ఆరోపణలు చేస్తున్నా అమెరికా, ఆస్ట్రేలియా భారత్‌కు బాసటగా నిలబడటం లేదు. ఓ విధంగా కెనడాకు మద్దతు ఇస్తున్నాయి. ఆయుధ రంగంలో రష్యాతో వున్న దీర్ఘకాలిక అవగాహనను, మరీ ముఖ్యంగా స్వల్ప కాలంలో సైనిక సరఫరాలను భారత్ వదులుకోలేదు. కానీ అదే సమయంలో మోడీ కీవ్ పర్యటన, రాజ్‌నాథ్ సింగ్ అమెరికా యాత్ర ప్రభుత్వం చేపట్టిన నూతన మార్గం ఏమిటో చెబుతున్నాయి. అమెరికాతో భారత్ విదేశాంగ విధానంలో చెప్పుకోదగిన మార్పును సూచిస్తున్నాయి. దీర్ఘకాల కోణంలో రష్యాపై ఆధారపడే పరిస్థితిని తగ్గించుకోవడానికి మోడీ ప్రభుత్వం సుముఖంగానే వుందని సంకేతమిస్తున్నాయి. అయితే, అటువంటి ధోరణి సరిహద్దుల్లో ఉద్రిక్తలను మరింత పెంచేందుకు దారితీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చైనా మరింత అసహనంగా వ్యవహరించే అవకాశం ఉంది.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News