Wednesday, April 24, 2024

మరో భింద్రన్ వాలే?

- Advertisement -
- Advertisement -

భయపడినట్టే జరుగుతున్నది. ఆదివారం నాడు లండన్‌లోని భారతీయ హై కమిషన్ కార్యాలయం వద్ద గల భారత జాతీయ జెండాను ఖలీస్థానీయుల గుంపు అవనతం చేసిన ఘటన ఈ ఉగ్రవాద మూక మరొకసారి బీభత్స కాండకు తలపడనున్నదనే అంచనాలను నిజం చేయగల సంకేతాలను పంపించింది. గత నెలలో పంజాబ్‌లోని అజ్ఞాలాలో వారీస్ పంజాబ్ దే నాయకుడు అమృత్ పాల్ సింగ్, అతడి అనుచరులు సృష్టించిన హింసకాండను గుర్తుకు తెచ్చుకొంటే లండన్ ఘటన యాదృచ్ఛికంగా సంభవించినది కాదని బోధపడుతుంది.

1980 దశకం ప్రథమార్థం నాటి భింద్రన్ వాలా ఉగ్రవాదం మళ్ళీ రగలనున్నదనే అభిప్రాయానికి ఆస్కారం కలిగిస్తున్నది. అమృత్ పాల్ సింగ్ అనుయాయులు తనపై దాడి చేశారంటూ ఒక వ్యక్తి అమృత్‌సర్ జిల్లా అజ్ఞాలా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దానితో అమృత్‌పాల్ సన్నిహితుడు లవ్ ప్రీత్ సింగ్ తూఫాన్ను మరి అయి దుగురిని అదుపులోకి తీసుకొన్నారు. వారిపై కేసును రద్దు చేసి విడుదల చేయాలని పోలీసులకు అమృత్‌పాల్ సింగ్ అల్టిమేటమ్ ఇచ్చాడు. పోలీసుల నుంచి సానుకూల స్పందనలేకపోడంతో ఫిబ్రవరి 23న పెద్ద సంఖ్యలో అమృత్‌పాల్, అతడి అనుచరులు ఆటోమేటిక్ తుపాకులు తదితర మారణాయుధాలు ధరించి స్టేషన్‌పై దాడి చేశారు. ఈ సమయంలో వారి చేతుల్లో సిక్కుల పవిత్ర గ్రంథం గుర్ గ్రంధ్ సాహిబ్ వుంది. అందువల్ల వారిని పోలీసులు అరెస్టు చేయలేదని చెబుతున్నారు. కాని అమృత్ పాల్ అనుచరులు అత్యధిక సంఖ్యలో వుండడం కూడా పోలీసుల నిష్క్రియాపరత్వానికి కారణమని భావిస్తున్నారు.

ఈ ఘటన తర్వాత పోలీస్ నివేదిక ఆధారంగా కోర్టు ఆదేశాల మేరకు లవ్ ప్రీత్‌ను విడుదల చేశారు. ఈ విధంగా అమృత్ పాల్ బలప్రదర్శనకు పాల్పడ్డాడు. వందలాది మంది ఆ దాడిలో పాల్గొన్నట్టు చెబుతున్నారు. లవ్ ప్రీత్ పైన, ఇతర తన అనుచరులపైన పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని ఆ తర్వాత అమృత్ పాల్ ఆరోపించాడు. అతడు నాయకత్వం వహిస్తున్న వారీస్ పంజాబ్ దే పై ఈ నెల 18న పంజాబ్ పోలీసులు పెద్ద ఎత్తున గాలింపులు, అరెస్టులు జరిపారు. మొన్న 19 తేదీ వరకు పంజాబ్‌లో ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేశారు. గత నవంబర్‌లో సుధీర్ సూరి అనే శివసేన నాయకుడిని సందీప్ సింగ్ సున్నీ అనే వ్యక్తి హతమార్చాడు. ఇతడి వాహనంలో వారీస్ పంజాబ్ దే స్టికర్ కనిపించింది. ఈ సందర్భంగా అమృత్ పాల్‌ను పోలీసులు కొద్ది సేపు నిర్బంధంలోకి తీసుకొన్నారు. కాని సున్నీకి అతనికి సంబంధం లేదని తేలింది.

తమ కార్యకలాపాలను అడ్డుకొంటే ఇందిరా గాంధీకి పట్టిన గతే మీకు కూడా పడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కి అమృత్ పాల్ సింగ్ హెచ్చరించినట్టు వార్తలు చెబుతున్నాయి. 1980 దశకం ప్రథమార్ధంలో జర్నయిల్ సింగ్ భింద్రన్ వాలా అనే సిక్కు మత తీవ్రవాది ప్రకటించిన తిరుగుబాటు స్వర్ణాలయంపై సైనిక చర్య (ఆపరేషన్ బ్లూ స్టార్)కు దారి తీసి ఆయన అందులో హతుడు కావడం డానికి ప్రతీకారంగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు హత్య చేయడం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై అదే మాదిరి ప్రతీకారం తీసుకొంటామని అమృత్ పాల్ సింగ్ హెచ్చరించడం చాలా తీవ్రమైన విషయం. ఆదివారం నాడు లండన్‌లోని భారత హై కమిషన్ బయటి భారత జాతీయ జెండాను ఖలిస్థాన్ వాదులు అవతనం చేసిన ఘటనపై బ్రిటిష్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం తీవ్ర నిరసన తెలియజేయడం సమంజసంగానూ, సహేతుకంగానూ ఉంది.

భారత హై కమిషన్ ఉద్యోగి వొకరు ఖలిస్థానీయులను అడ్డుకోడానికి ప్రయత్నించి ఖలిస్థానీ జెండాను వారి చేతుల నుంచి లాక్కొని విసిరివేయడం సామాజిక మాధ్యమాల్లో విశేష ప్రశంసలను అందుకొంటున్నది. ఈ ఘటన తర్వాత అతి పెద్ద భారతీయ జెండాను లండన్ భారత హై కమిషనర్ కార్యాలయం చుట్టూ అలంకరింపజేశారు. అమృత్ పాల్ సింగ్ అనుయాయులను ఏరి పారేయడానికి, ఖలీస్థాన్ వాదం మళ్ళీ బలపడనివ్వకుండా చేయడానికి కేంద్రం, పంజాబ్ ప్రభుత్వం సమష్టిగా గట్టి కృషి చేయవలసి వుంది. అమృత్ పాల్‌కు పాకిస్తాన్ సైనిక గూఢచార సంస్థ ఐఎస్‌ఐ నుంచి సహాయం అందుతున్నట్టు తెలుస్తున్నది. అతడిని అరెస్టు చేశారని వారీస్ పంజాబ్ దే సంస్థ ప్రకటించింది. పోలీసులు దానిని ఖండించారు. అతని కోసం ఇంకా వేటాడుతున్నట్టు చెప్పారు. 30 ఏళ్ళ అమృత్ పాల్ సింగ్‌కు పంజాబ్‌లో గాని, అంతర్జాతీయ స్థాయిలో గాని ఎంత మంది అనుచరులున్నా రో తెలియవలసి వుంది. కశ్మీర్‌కు పొరుగునున్న పంజాబ్‌లో మత ఉగ్రవాదం మళ్ళీ తలెత్తడం దేశ సమగ్రతకు, సమైక్యతకు తీవ్ర హానికరం. దేశ ప్రయోజనాలు కోరేవారందరూ ఈ పరిణామాలను ఖండించాలి. అటు చైనాతో ఇటు పాకిస్తాన్‌తో శత్రుత్వం పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News