Thursday, March 28, 2024

చైనా అధ్యక్షుని రష్యా పర్యటన

- Advertisement -
- Advertisement -

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ 20-03-2023 నుంచి 22-03 -2023 వరకు రష్యాలో పర్యటిస్తున్నారు. స్నేహం, సహకారం, శాంతి పర్యటనగా భావించే జిన్‌పింగ్ రష్యా పర్యటన చైనా-రష్యా సహకారాన్ని మరింత పెంపొందిస్తుందని, ప్రపంచ శాంతికి, అభివృద్ధికి దోహదం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడు లక్ష్యాలు వున్నట్లు భావిస్తున్నప్పటికీ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది శాంతి అన్న అంశం. రష్యా చైనాల మధ్య ఆర్ధిక ఒప్పందాలు, వాణిజ్య వ్యాపారాలకు చెందిన అంశాలు ఎలాగూ కొన్ని ఒప్పందాలకు దారితీస్తాయి, ముఖ్యంగా రష్యాపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు పుష్టిని చేకూర్చే ప్రయత్నాలు తప్పనిసరి.

అమెరికా, నాటో, మరికొన్ని పాశ్చాత్య దేశాలు కూటమిగా వ్యవహరిస్తున్న తరుణంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, రష్యా, చైనాలు సహకార ఒప్పందాలు కుదుర్చుకోవటం కూడా ఒక అవసరమే కానీ శాంతిని నెలకొల్పటం ఉక్రెయిన్ సంక్షోభాన్ని చల్లార్చటం మొదటి ప్రాధాన్యతను సంతరించుకుంది. అందువల్ల చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ పర్యటన గురించి చాలా కచ్చితమైన వివరణ ఒకటి విడుదల చేసింది. రష్యా పర్యటనలో అధ్యక్షుడు జిన్‌పింగ్ ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రధాన అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అధ్యక్షుడు పుతిన్‌తో లోతైన అభిప్రాయాలను పంచుకుంటారని, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సమన్వయం, ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించుకుంటారని, ద్వైపాక్షిక సంబంధాల వృద్ధికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

చైనా, రష్యాలు నిజమైన బహుళ పక్షవాదాన్ని ఆచరిస్తూనే ఉంటాయని, అంతర్జాతీయ సంబంధాల్లో మరింత ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని, బహుళ ధ్రువ ప్రపంచాన్ని నిర్మించడానికి కృషి చేస్తాయని, ప్రపంచ పాలనను మెరుగుపరుస్తాయని, ప్రపంచంలో అభివృద్ధి, పురోగతికి దోహదం చేస్తాయని వాంగ్ అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం ఏడాదికిపైగా కొనసాగుతుండగా, ప్రపంచం తీవ్రమైన మార్పులకు లోనవుతుండగా, ఫిబ్రవరిలో చైనా ‘ఉక్రెయిన్ సంక్షోభం రాజకీయ పరిష్కారంపై చైనా వైఖరి’ అనే 12 పాయింట్ల పత్రాన్ని విడుదల చేసింది. శత్రుత్వాలను నిలిపివేయాలని, శాంతి చర్చలను తిరిగి ప్రారంభించాలని, ఏకపక్ష ఆంక్షలకు ముగింపు పలకాలని, ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని విడిచిపెట్టాలని పిలుపునిచ్చింది.అలాగే గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ కాన్సెప్ట్ అని ప్రపంచంలో శాంతిని, భద్రతను నెలకొల్పటానికి ఒక విధాన ప్రకటన చేసింది.

శాంతి చర్చలను ప్రోత్సహించడంలో చైనా చేస్తున్న ప్రయత్నాలకు స్నేహం, సహకారం, శాంతి కోసం జిన్‌పింగ్ చేస్తున్న ఈ పర్యటన ఒక ఉదాహరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. జిన్‌పింగ్ రష్యా పర్యటన కొత్త శకంలో చైనా -రష్యా సంబంధాలకు ఒక మైలురాయి అని రష్యాలో చైనా రాయబారి ఝాంగ్ హన్హుయి అన్నారు. ఇది ద్వైపాక్షిక సంబంధాలకు బలమైన ప్రేరణను ఇస్తుంది, ఉన్నత స్థాయిలో సంబంధాల సుస్థిర అభివృద్ధికి దారి తీస్తుంది. ఆర్థిక సంబంధాలు, అభివృద్ధి చెందుతున్న ప్రపంచ క్రమం, ప్రాంతీయ సంక్షోభాలతో సహా అనేక అంశాలపై ఈ పర్యటనలో చర్చించవచ్చు. చైనా -రష్యా భాగస్వామ్యం ఎప్పటిలాగే బలంగా ఉందనే సంకేతాన్ని కూడా ఈ పర్యటన అంతర్జాతీయ సమాజానికి ఇస్తుందని రష్యా నిపుణుడు అంటున్నారు.చైనా, రష్యా అగ్రనేతలు సన్నిహిత సంబంధాలు కొనసాగించారు.

దశాబ్దం క్రితం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిన్‌పింగ్ తొలి అధికారిక పర్యటనకు రష్యా గమ్యస్థానంగా నిలిచింది. 2022 ఫిబ్రవరిలో పుతిన్ చైనా పర్యటించారు. దానికి ప్రతిగా మూడవ సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జీ జిన్‌పింగ్ జరుపుతున్న ఈ పర్యటనకు ప్రాధాన్యత వుంటుంది. యురేషియా ఎకనామిక్ యూనియన్‌తో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కనెక్టివిటీని మరింత ప్రోత్సహించడం, వాణిజ్యం, పెట్టుబడులు, గ్రీన్‌ఎకానమీ, డిజిటల్ ఎకానమీ, లాజిస్టిక్స్ సహా వివిధ రంగాల్లో సహకారాన్ని ఎలా పెంపొందించుకోవాలనే దానిపై చైనా, రష్యా ఏకాభిప్రాయానికి వస్తాయని రష్యాలోని చైనా రాయబారి ఝావో పేర్కొన్నారు. జిన్‌పింగ్ పర్యటనపై రష్యా ఇంటర్నేషనల్ అఫైర్స్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ ఆండ్రీకోర్టునోవ్ మాట్లాడుతూ ఆర్థిక సంబంధాలు, అభివృద్ధి చెందుతున్న ప్రపంచ క్రమం, ప్రాంతీయ సంక్షోభాలతో సహా అనేక అంశాలపై ఈ పర్యటనలో చర్చించవచ్చని ప్రకటించారు.

ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో చైనా- రష్యా సంబంధాలు ముఖ్యంగా ఉమ్మడి అభివృద్ధి, ఇంధన రంగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇటీవల అమెరికా, కొన్ని పాశ్చాత్య దేశాలు చైనా- రష్యా సంబంధాలను చెడగొట్టడానికి, వాటిని రాక్షస మైత్రిగా చిత్రీకరించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఉక్రెయిన్‌తో ఘర్షణలో రష్యాకు చైనా ‘మద్దతు’ గురించి అసత్యాలను ప్రచారం చేయడం ద్వారా, అమెరికా దాని మిత్ర దేశాలు రష్యా- చైనాలను ఉచ్చులో ఇరికించాలను కుంటున్నాయి.

చైనా రష్యాలు తమ రెండు దేశాల ప్రయోజనాల ఆధారంగా సన్నిహిత సంబంధాలను అభివృద్ధి చేసుకున్నాయి. పొత్తులు లేకపోవడం, ఘర్షణ లేకపోవడం, ఏ మూడవ పక్షాన్ని లక్ష్యంగా చేసుకోకపోవడం ఆధారంగా సంబంధాలు నిర్మించబడ్డాయి, అంటే బయటి పరిణామాలు వారి సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేయవు. వ్యూహాత్మక భాగస్వామ్యం, పరస్పర విశ్వాసం, మంచి పొరుగుతనం, సహకారంతో కూడిన ప్రధాన దేశాల సంబంధాల మార్గాన్ని ఇరుపక్షాలు అనుసరిస్తూ, అంతర్జాతీయ సంబంధాలకు కొత్త నమూనాను ఏర్పాటు చేశాయని వాంగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా, రష్యాలు శాశ్వత సభ్యదేశాలని, చైనా-రష్యా సంబంధాల ప్రాముఖ్యత, ప్రభావం ద్వైపాక్షిక పరిధిని మించి ఉంటుంది.

చైనా -రష్యా సంబంధాల పరిణామాలు ప్రపంచ శాంతికి అనుకూలంగా ఉన్నాయని విశ్లేషకులు చెప్పారు, ఎందుకంటే రెండు దేశాలు సంయుక్తంగా బహుళ పక్షవాదాన్ని సమర్థిస్తున్నాయి. ముఖ్యం గా అమెరికా, దాని మిత్రదేశాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేరేపిస్తున్న ఘర్షణలపైన, ఉక్రెయిన్ సంక్షోభంపైనా, చైనా శాంతి చర్చలను ప్రోత్సహిస్తున్నది. అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ పర్యటన సందర్భంగా రష్యాకు చైనా వైఖరిని, ప్రతిపాదనను మరింత వివరిస్తారా, ఉక్రెయిన్ సంక్షోభం రాజకీయ పరిష్కారం కోసం రష్యాను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారా అనే ప్రశ్నకు వాంగ్ వెన్బిన్ సమాధానమిస్తూ, జిన్‌పింగ్ రష్యా పర్యటన శాంతిప్రక్రియలో భాగమేనని అన్నారు. ప్రపంచ శాంతిని పరిరక్షించడం, ఉమ్మడి అభివృద్ధిని ప్రోత్సహించడం మా విదేశాంగ విధాన లక్ష్యం.

ఉక్రెయిన్ సమస్యపై చైనా ఎల్లప్పుడూ శాంతి, చర్చల పక్షానవున్నదని, చరిత్రలో సరైన దాని వైపు చైనా నిలుస్తుందన్నారు. విభేదాలు, వివాదాల పరిష్కారానికి రాజకీయ చర్చలే ఏకైక మార్గమని మేం ఎప్పుడూ నమ్ముతాం. మంటలను రెచ్చగొట్టడం, పోరాటానికి ఆజ్యం పోయడం, ఏకపక్ష ఆంక్షలు, గరిష్ఠ ఒత్తిడి ఉద్రిక్తతకు ఆజ్యం పోస్తాయని, పరిస్థితిని మరింత దిగజార్చుతుందని వాంగ్ వెన్బిన్ అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం, ఇతర అంతర్జాతీయ, ప్రాంతీయ ఉద్రిక్త సమస్యలపై చైనా నిష్పాక్షిక వైఖరిని నిలుపుకుంటుందని, సంక్షోభం రాజకీయ పరిష్కారంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. వివాదాల పరిష్కారానికి యుద్ధాలు, ఆంక్షలు మార్గం కాదని చైనావాదిస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభంపై అంతర్జాతీయ సమాజం చర్చలను కోరుకోవడానికి, మరింత మానవతా సంక్షోభాన్ని నివారించడానికి అతిపెద్ద ఉమ్మడి ఒప్పందానికి రావాలని పిలుపునిచ్చింది. అధ్యక్షుడు జిన్‌పింగ్ తన రష్యా పర్యటనలో ఉక్రెయిన్ సంక్షోభం గురించి చర్చించేటప్పుడు కూడా ఇదే నొక్కి చెబుతారని ఆశించవచ్చు. రష్యా, ఉక్రెయిన్‌లతో కమ్యూనికేషన్‌ను కొనసాగిస్తూనే, సాధ్యమైన చర్చలను కోరడానికీ, సహకారంద్వారా ప్రజల జీవనోపాధిని ప్రోత్సహించడానికి చైనా సహాయపడుతుందని ఝావో అన్నారు. ఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి ఉక్రెయిన్‌కు మానవీయ సహాయం అందించడంతో సహా చైనా స్పష్టమైన చర్యలు తీసుకుందని, ఇది దాని బాధ్యతా భావాన్ని ఎత్తి చూపుతుంది.

చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ ఉక్రెనియన్ విదేశాంగ మంత్రి డిమిట్రోకులేబాతో ఫోన్‌లో మాట్లాడారు. దీనితో ఉక్రెయిన్ రష్యాల మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతాయనే ఆశలు సజీవమయ్యాయని, రాజకీయ పరిష్కారానికి తలుపులు మూసివేయ బడలేదనే ఆశాభావం కలుతోందని క్విన్ గాంగ్ అన్నారు. ఏదేమైనా, శాంతినీ చర్చలనూ ప్రోత్సహించడంలో చైనా నుండి అంతర్జాతీయ సమాజం నుండి ప్రయత్నాలు ఉన్నప్పటికీ యుఎస్, కొన్ని పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ యుద్ధభూమిలోకి ఆయుధాలను కుమ్మరించడం ద్వారా మంటలు ఆరకుండా చూస్తున్నాయి. రష్యాను ఖండించడానికి లేదా ఆంక్షలు విధించడానికి తమ ప్రచారంలో చైనా చేరలేదని వారు చైనాను నిందిస్తున్నారు.

ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా, దాని మిత్రదేశాలు చైనాను విమర్శించడం హాస్యాస్పదం, సిగ్గుచేటు. ఎందుకంటే చైనా ఈ సంక్షోభంలో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న పక్షం కాదు లేదా సంక్షోభాన్ని ప్రారంభించినదీ కాదు, మంటలకు ఆజ్యం పోయడానికి ఎంచుకోలేదు. అయితే అది ప్రేక్షకుడిగా ఉండటానికి బదులుగా చర్చలు, శాంతి ప్రక్రియలు ప్రారంభమయ్యేలా ప్రయత్నిస్తున్నది. రష్యా -ఉక్రెయిన్ వివాదాన్ని మరీ ఆలస్యం కాకముందే ఆపడానికి ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఉంది. అందుకే శాంతి చర్చల కోసం చైనా ఇచ్చిన పిలుపుకు చాలా మద్దతు లభించింది. ఈ నేపథ్యం లో జిన్‌పింగ్ రష్యా సందర్శన పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

డా. జతిన్ కుమార్
9849806281

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News