Home తాజా వార్తలు హైదరాబాద్‌లో చ.అడుగు 1,14,000

హైదరాబాద్‌లో చ.అడుగు 1,14,000

Approval To increase Land market value

ములుగు జిల్లాలో అత్యల్పంగా రూ.1700

భూముల కొత్త మార్కెట్ విలువ పెంపునకు గ్రీన్‌సిగ్నల్
ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన ధరలు
అమల్లోకి, 50శాతం పెరగనున్న
వ్యవసాయ భూముల ధరలు
నేడు ఖరారు చేయనున్న కలెక్టర్‌ల ఆధ్వర్యంలోని కమిటీలు
ప్రభుత్వ నిర్ణయంతో తహసీల్దార్ కార్యాలయాలకు పోటెత్తిన రిజిస్ట్రేషన్‌దారులు

మనతెలంగాణ/హైదరాబాద్ : మార్కెట్ వాల్యూ పెంపునకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఫిబ్రవరి 01వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా చదరపు అడుగుకు మార్కెట్ విలువ రూ. 1,14,000లుగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో చదరపు అడుగుకు రూ.1,700లుగా ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ విలువల సవరణకు సంబంధించి శుక్రవారం ఆమోదం లభించింది. వ్యవసాయేతర ఖాళీ స్థలాలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్ల్ల సవరణ విలువలను అధికారులు ఖరారు చేశారు. వ్యవసాయ భూముల విలువలకు శనివారం కమిటీలు ఆమోదించిన తర్వాత ఫైనల్ చేయనున్నారు. వ్యవసాయ భూములకు 50 శాతం, అపార్ట్‌మెంట్ల ప్లాట్లు విలువలు, 25 శాతం, ఖాళీ స్థలాల విలువ 35 శాతం పెంపుకు ఆమోదించారు. ముందుగా వ్యవసాయేతర ప్లాట్లు, ఫ్లాట్ల విలువలను ఖరారు చేశారు.

అందులో భాగంగా 33 జిల్లాల్లో వ్యవసాయేతర ఆస్తులు, భవనాలు, ప్లాట్లు విలువలను రిజిస్ట్రేషన్ల శాఖ ఐజి ఆధ్వర్యంలోని కమిటీ శుక్రవారం ఫైనల్ చేసింది. మాసాబ్‌ట్యాంక్, పంజాగుట్ట, వైఎస్సార్ సర్కిల్ ప్రాంతాల్లో, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి తదితర శివారు జిల్లాల్లో మార్కెట్ విలువలు భారీగా పెరగనున్నాయి. అసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మార్కెట్ వాల్యూ స్వల్పంగా పెరగ్గా, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1, 2, 3, శ్రీనగర్ కాలనీలో చదరపు గజం ధర రూ. 1,14,000లుగా, మాసాబ్‌ట్యాంక్, పంజాగుట్ట, వైఎస్సార్ సర్కిల్ ప్రాంతాల్లో ఇదే ధరను అధికారులు ఫైనల్ చేశారు. గతంలో ఇక్కడ చదరపు గజానికి రూ. 84,500లుగా ఉండేది. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.57వేలను చదరపు గజం ధరగా నిర్ధారించి హేతుబద్దీకరించారు.

అపార్టుమెంట్లలో పాత ధర రూ. 1000లుండగా ప్రస్తుతం .1300లుగా…

అపార్టుమెంట్లలో పాత ధర రూ. 1000లుండగా ప్రస్తుతం దానిని రూ.1300లుగా, రూ. 1200లు ఉన్నచోట రూ. 1,500లుగా, రూ. 1600ల ధరను రూ.2వేలుగా, రూ. 1800లు ఉన్న ధరను రూ.2500లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పాత రూ.200లకు చదరపు అడుగు ఉన్న ప్లాట్లు విలువ రూ. 300లుగా, రూ.3వేలను ఉన్న చోట రూ. 4100లకు పెంచారు. రూ. 10,500లు ఉన్న ధరను రూ. 14,200లకు పెంచారు. ఈ ధరలు ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి రానున్నాయి. వ్యవసాయ భూముల పెరిగిన ధరలను కలెక్టర్ల అధ్యర్యంలోని కమిటీలు శనివారం ఖరారు చేయనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది బడ్జెట్‌లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తన రాబడిని రూ. 15వేల కోట్ల నుంచి రూ. 18వేల కోట్లను పెంచుకోవాలని యోచిస్తోంది.

సాధారణ రోజులకంటే 50శాతం ఎక్కువ

మార్కెట్ విలువ పెంపు భయంతో ఆరు రోజులుగా ప్రజలు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూములు, ప్లాట్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ప్రజలు తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను క్యూ కట్టడంతో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ల తాకిడి పెరిగింది. ధరణి వెబ్‌సైట్‌కు ఒత్తిడి పెరగడంతో పలు ప్రాంతాల్లో నెట్‌వర్క్ హ్యాంగ్ అవ్వగా, కార్డు విధానంలో కూడా రిజిస్ట్రేషన్ల సర్వర్‌పై ఒత్తిడి తీవ్రమయ్యింది. దీంతో సాధారణ రోజులకంటే 50శాతం కంటే ఎక్కువ సంఖ్యలో డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్‌లు జరిగాయి.

ఇప్పటివరకు ఈ ఏడాది ఆదాయం రూ.9,041కోట్లు

ఈ ఏడాది రిజిస్ట్రేషన్‌ల శాఖ డాక్యుమెంట్‌లలో 103.73శాతం పురోగతిని ఆదాయంలో 187.45 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఈనెలలో ఇప్పటివరకు రూ.773 కోట్ల రాబడి ఖజానాకు చేరింది. ఈనెలలో 1,18,737 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగ్గా ఈ ఏడాది ఇప్పటివరకు 187.45 శాతం వృద్ధిరేటుతో రాబడి 9,041.54 కోట్లకు చేరింది. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 103.73 శాతం వృద్ధిరేటుతో 15.28 లక్షల డాక్యుమెంట్‌ల రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ఈనెలలో వ్యవసాయ భూములకు సంబంధించి 47,9763 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ జరగ్గా రూ.98.60 కోట్ల రాబడి సమకూరింది.