Saturday, April 27, 2024

కృత్రిమ ఆహార సంక్షోభం!

- Advertisement -
- Advertisement -

500 రోజులు పూర్తి చేసుకొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుకొంటున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పర్యవసానంగా ప్రపంచంలో ఆహార సంక్షోభం ముంచుకు రావడం ఖాయంగా కనిపిస్తున్నది. నల్లసముద్రం రేవుల గుండా ఉక్రెయిన్ ఆహార ఎగుమతులను అనుమతించడానికి గత ఏడాది జులైలో కుదిరిన ఒప్పందం నుంచి తాను తప్పుకొంటున్నట్టు రష్యా సోమవారం నాడు చేసిన ప్రకటన అనేక దేశాల్లో, ముఖ్యంగా యుద్ధాల్లో, ఘర్షణల్లో నలిగిపోతున్న యెమెన్, ఇథియోపియా వంటి చోట్ల ఆహార ధరలను విపరీతంగా పెంచివేయనున్నది. వివిధ దేశాలకు ఉక్రెయిన్ నుంచి వెళుతున్న 32 మిలియన్ టన్నుల ఆహార ఎగుమతులు స్తంభించిపోతున్నాయంటే ఎంతటి కరవు ఏర్పడనున్నదో ఊహించవచ్చు.

కొవిడ్ కారణంగా అన్నార్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రతి రాత్రి ఎనిమిది కోట్ల మందికి పైగా ఆకలితో నిద్రపోతున్నారు. నల్ల సముద్రం రేవుల గుండా ఉక్రెయిన్ ఆహారోత్పత్తుల ఎగుమతికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా రష్యాను ఒప్పిస్తూ టర్కీ, ఐక్యరాజ్య సమితి గత ఏడాది జులైలో ఈ అంగీకారాన్ని కుదిర్చాయి. ఆ ఓడల ద్వారా ఆయుధాలను ఉక్రెయిన్ రప్పించుకోకుండా చూడడానికి నల్ల సముద్రంలో అవి ప్రవేశించే చోట రష్యా తనిఖీలు చేయడానికి కూడా ఆ ఒప్పందం వీలు కలిగించింది. ఇప్పుడు దాని నుంచి రష్యా తప్పుకోడం వల్ల ఆయా రేవుల్లో 20 మిలియన్ టన్నుల ఉక్రెయిన్ ఆహార ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఒప్పందంలోని తనకు అనుగుణమైన షరతులు అమలు కావడం లేదని , అది జరిగిన తర్వాతనే తాను తిరిగి దానిని అమలు పరుస్తానని రష్యా ప్రకటించింది.

అయితే రష్యా ఈ ప్రకటన చేయడానికి కొన్ని గంటల ముందు క్రిమియాతో రష్యాను కలిపే ఏకైక రోడ్డు బ్రిడ్జిని ఉక్రెయిన్ డ్రోన్లు కూల్చివేశాయి. ఆ దాడిలో ఒక రష్యన్ జంట మరణించినట్టు వారి కుమార్తె తీవ్రంగా గాయపడినట్టు రష్యా అధికార్లు వెల్లడించారు. క్రిమియాకు వెళ్ళే అసంఖ్యాక టూరిస్టులు నిలిచిపోయారు. ఈ బ్రిడ్జిని తక్షణమే పునరుద్ధరించాలని, టూరిస్టులకు తగిన సౌకర్యాలు కల్పించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ బ్రిడ్జి కూల్చివేతకు, తాను ఒప్పందం నుంచి వైదొలగడానికి సంబంధం లేదని రష్యా అంటున్నది. ఆహార ఎగుమతులను నిరోధించడం ద్వారా రష్యా బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నదని, ఆకలిని ఎగుమతి చేస్తున్నదని అమెరికా, ఉక్రెయిన్లు ఆరోపించాయి. 2019లో ఈజిప్టు తాను దిగుమతి చేసుకొన్న 3.02 బిలియన్ డాలర్ల గోధుమలో 1.44 బిలియన్ డాలర్ల మేరకు రష్యా నుంచి 773.4 మిలియన్ల డాలర్ల మేరకు ఉక్రెయిన్ నుంచి తెచ్చుకొన్నది.

అదే సంవత్సరంలో ఇథియోపియా 458.42 మిలియన్ డాలర్ల గోధుమను దిగుమతి చేసుకోగా, అందులో 142.01 మిలియన్ డాలర్ల మేరకు ఉక్రెయిన్ నుంచి 64.77 మిలియన్ డాలర్ల మేరకు రష్యా నుంచి తెచ్చుకొన్నది. అలాగే యెమెన్, లెబనాన్, పాలస్తీనాలు కూడా ఉక్రెయిన్ ఆహారోత్పత్తుల మీద అమితంగా ఆధారపడి వున్నాయి. తాము తినే ఆహార ధాన్యాల్లో సగం ఉక్రెయిన్ నుంచే వస్తాయని యెమెన్ ప్రకటించింది.ఇంకా ఇజ్రాయెల్, యూరపు దేశాలు ఉక్రెయిన్ నుంచి ఆహారాన్ని దిగుమతి చేసుకొంటున్నాయి. రష్యా మీద అమెరికా విధించిన ఆంక్షల నుంచి వ్యవసాయోత్పత్తులను మినహాయించింది. అందుచేత యూరపు దేశాలు కూడా ఇప్పుడు ఆహార సంక్షోభానికి గురి అవుతాయి. యెమెన్‌లో యుద్ధం ఇప్పటికే అక్కడి బతుకులను దుర్భరం చేసింది.

ఉక్రెయిన్ ఆహారోత్పత్తుల రాక ఆగిపోడంతో ఆకలి అక్కడ పేట్రేగిపోతుంది. యుద్ధం ఇంకెన్ని మలుపులు తిరిగి మరెన్ని సంక్షోభాలకు దారి తీస్తుందో, ఎంత కాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. కేవలం ఉక్రెయిన్, రష్యాలకే యుద్ధం పరిమితమై వుంటే ఇంత కాలం కొనసాగి వుండేది కాదు. అమెరికా, ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తరపున తలమునకలుగా పాల్గొంటున్నది. యుద్ధంలో గల రెండు దేశాల్లో ఏదో ఒకటి సర్వనాశనం అయ్యే వరకు యుద్ధం కొనసాగుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. గతంలోనూ, ఇప్పుడూ స్వాధీనం చేసుకొన్న ఉక్రెయిన్ భూభాగాలన్నింటి నుంచి రష్యాను తరిమి కొట్టాలని అమెరికా కోరుకొంటున్నది.

అది పరోక్ష యుద్ధంతోనే సరిపుచ్చుకొనేంత వరకు అది సాధ్యమయ్యే పని కాదు. ప్రత్యక్షంగా అమెరికా యుద్ధంలో పాల్గొంటే అది మరో ప్రపంచ యుద్ధానికే దారి తీయవచ్చు. రష్యా ఆశించిన విధంగా స్వల్ప కాలంలోనే తన లక్షాలను సాధించుకొని యుద్ధానికి స్వస్తి చెప్పడం సాధ్యం కాలేదు. అది దాని మందు గుండును, ఆయుధాలను అమితంగా ఖర్చు చేస్తున్నది. అయినా పుతిన్ వెనుకాడే పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఈ యుద్ధం ప్రభావం చూపించవచ్చు. అది కొనసాగినంత కాలం ప్రపంచం మరింత సంక్షోభంతో కూరుకుపోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News