Tuesday, April 30, 2024

దాయాదిల సమరానికి వేళాయే

- Advertisement -
- Advertisement -

Asia Cup 2022: IND vs PAK Match Today

దుబాయి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానుల ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయి వేదికగా పోరు జరుగనుంది. దాయాదిల మధ్య జరిగే మ్యాచ్ కోసం ఇప్పటికే ఇదరు దేశాలకు చెందిన అభిమానులు దుబాయి చేరుకున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ తెరలేవనుంది. ఇక ఇటీవలే యుఎఇ వేదికగా జరగిన టి20 వరల్డ్‌కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ సంచలన విజయం సాధించింది. ఈసారి కూడా అలాంటి ఫలితం పునరావృతం చేయాలనే పట్టుదలతో పాకిస్థాన్ పోరుకు సిద్ధమైంది. మరోవైపు పాకిస్థాన్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలనే లక్షంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఇక గల్ఫ్ గడ్డపై చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్‌లకు ఉండే క్రేజ్ మరో రేంజ్‌లో ఉంటుంది. ఈసారి కూడా దాయాదిల పోరుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లి, రిషబ్ పంత్, సూర్యకుమార్, హార్దిక్, జడేజా తదితరులతో టీమిండియా చాలా బలంగా ఉంది. ఇక బాబర్ ఆజమ్, రిజ్వాన్, ఫకర్ జమాన్, ఆసిఫ్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్ వంటి స్టార్లతో పాకిస్థాన్ కూడా చాలా పటిష్టంగా కనిపిస్తోంది. రెండు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఆసక్తికరంగా సాగుతుందనడంలో సందేహం లేదు.
ఓపెనర్లే కీలకం..
ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్లు రోహిత్, కెఎల్ రాహుల్‌లు కీలకంగా మారారు. గాయం కారణంగా రాహుల్ చాలా రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డేలో రాహుల్ జట్టుకు సారథ్యం వహించాడు. అయితే రాహుల్ మాత్రం తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ కూడా మెరుపులు మెరిపించాలని తహతహలాడుతున్నాడు. ఓపెనర్లు మెరుగైన ఆరంభం అందిస్తే తర్వాత వచ్చే బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడేందుకు వీలుంటుంది.
విరాట్‌కు కీలకం
మరోవైపు మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లికి ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. కొంతకాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న కోహ్లి ఇంటాబయట విమర్శలతో సతమతమవుతున్నాడు. ఇలాంటి స్థితిలో అతనిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇక తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒకప్పుడూ ప్రపంచంలోనే ఎదురులేని బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లి ఇటీవల కాలంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. సెంచరీల మాట అటుంచి కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకోలేక పోతున్నాడు. ఈ పరిస్థితుల్లో కోహ్లికి ఆసియాకప్ చావోరేవోగా మారిందనడంలో సందేహం లేదు. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో కోహ్లి తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోహ్లి గాడిలో పడితే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. ఇక రిషబ్, సూర్యకుమార్, హార్దిక్, జడేజా, అశ్విన్‌లు కూడా బ్యాట్‌ను ఝులిపిస్తే ఈ మ్యాచ్‌లో భారత్‌కు భారీ స్కోరు కష్టమేమీ కాదు. అంతేగాక భువనేశ్వర్, అవేశ్ ఖాన్, అశ్విన్, బిష్ణోయ్, చాహల్ తదితరులతో భారత బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ పోరులో భారతే ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
తక్కువ అంచనా వేయలేం
ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. పోరాటానికి మరో పేరుగా చెప్పుకునే పాకిస్థాన్‌ను ఓడించడం టీమిండియాకు అనుకున్నంత తేలికేం కాదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పాక్ సమతూకంగా ఉంది. స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిది గాయంతో టోర్నీకి దూరం కావడం పాకిస్థాన్‌కు కాస్త ఇబ్బందికర పరిణామంగా మారింది. అయితే అతను లేకున్నా హసన్ అలీ, హస్‌నైన్, నసీమ్ షా, షానవాజ్ తదితరులతో బౌలింగ్ పటిష్టంగానే ఉంది. ఇక బాబర్, రిజ్వాన్, ఫకర్ జమాన్, ఆసిఫ్ అలీ, ఖుష్‌దిల్ షా, ఇఫ్తికార్ అహ్మద్ తదితరులతో బ్యాటింగ్ కూడా బలంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు గట్టి పోటీ ఖాయమనే చెప్పాలి.
జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్, హార్దిక్, జడేజా, రిషబ్, భువనేశ్వర్, అశ్విన్, యజువేంద్ర చాహల్, అర్ష్‌దీప్, అవేశ్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, బిష్ణోయ్.
పాకిస్థాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాజ్, ఫకర్, ఇఫ్తికార్, ఖుష్‌దిల్,ఆసిఫ్, హస్‌నైన్, షాదాబ్, ఉస్మాన్ ఖదీర్, నసీమ్‌షా, హారిస్ రవూఫ్, షానవాజ్, నవాజ్, హసన్ అలీ, హైదర్ అలీ.

Asia Cup 2022: IND vs PAK Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News