Sunday, April 28, 2024

రైతు సంక్షేమం కోసం ఐక్య పోరాటం

- Advertisement -
- Advertisement -

రైతు సంఘాల నేతల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. పాల్గొన్న వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నేతలు

రైతు సంఘం నేతలు ముందువరుసలో ఉండాలి

స్వాతంత్య్ర సమర స్ఫూర్తితో దేశాభివృద్ధికి మనం పాటుపడాలి తెలంగాణ ఉచితంగా సాగు నీరు, కరెంటు
ఇస్తున్నది.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు రైతులు కూర్చొని మాట్లాడుకోవడానికి తెలంగాణలో ఉన్నట్లు
కిసాన్ మంచ్‌లు ఎక్కడైనా ఉన్నాయా? దేశంలో 40 కోట్ల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉన్నది 70వేల
టిఎంసిల జలాలు అందుబాటులో ఉన్నాయి 10వేల టిఎంసిలు దేశ ప్రజల తాగునీటికి సరిపోతాయి 40వేల
టిఎంసిలు సాగుకు సరిపోతాయి దేశంలో 4లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థం ఉన్నది అయినా..
2 లక్షల మెగావాట్లను కూడా ఉపయోగించుకోవడం లేదు దేశంలో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నా.. సాగు
నీరు, తాగు నీరు కోసం దేశ ప్రజలు ఎందుకు గోస పడుతున్నారు సాగునీరు, విద్యత్, కష్టపడే రైతులు ఉన్నా..
దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎందుకు ఉన్నది 25 రాష్ట్రాల రైతు సంఘాల నేతల సమావేశంలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ పాలన ఇంకా గాడిలో పడలేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను ఇప్పటికైనా మనం సమగ్రంగా అన్వేషించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ముఖ్యం గా చట్టసభల్లో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వారే నిర్లక్ష్యం వహిస్తున్నారని తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ప్రజల కోసం పనిచేసే వాళ్లను దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేస్తుండం శోచనీయమన్నారు. ఇలాంటి పోకడలు ప్రస్తుతం మన దేశంలో పెద్దఎత్తున కొనసాగుతుండటం మనందరి దురదృష్ణకరమని సిఎం వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు, ప్రజల సంక్షేమం కోరుకునే శక్తులు సంఘర్శించాల్సి ఉంటదన్నారు. ఈ సంఘర్షణ ప్రారంభదశలో మనతో కలిసివచ్చే శక్తులు కొంత అనుమానాలు, అయితదా కాదా? అనే అపోహలకు గురవుతుంటారన్నారు. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకొంటూ ఐక్యత సాధించి లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుందన్నారు.

దేశంలో ఉన్న వనరులను సరిగా వినియోగించుకుంటూ…. దేశ సౌభాగ్యాన్ని గుణాత్మకంగా అభివృద్ధి పరిచే రైతు వ్యవసాయ సంక్షేమ దిశగా సాగే సుపరిపాలన కోసం మనం అడుగులు వేయాల్సి ఉంటుందన్నారు. దేశంలోని రైతాంగం అంతా వ్యవసాయ రంగాన్ని గుణాత్మకంగా ప్రగతిపథాన నడిపించేందుకు ఐక్యం కావాల్సి ఉందన్నారు.. అందుకు దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటాలు చేస్తున్న మీరంతా ముందు వరసరలో ఉండాల్సిన అవసరం ఉందని రైతు సంఘం నేతలకు ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు వంద మంది రైతు సంఘాల నాయకుల అధ్యయన కార్యక్రమం రెండోరోజు కూడా కొనసాగింది. ఇందులో భాగంగా శనివారం ఉదయం ప్రగతి భవన్‌కు చేరుకున్న రైతు సంఘాల నేతలు వ్యవసాయం, సాగునీటి రంగం తదితర రాష్ట్ర ప్రగతి పై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు. ఈ సందర్భంగా అన్నిరంగాల్లో రాష్ట్ర ప్రగతిని చూస్తున్న వారంతా చప్పట్లతో హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. తమ క్షేత్రస్థాయి పరిశీలనకు, డాక్యుమెంటరీలోని దృశ్యాలు, వివరణలు అద్దంపడుతున్నాయని ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. తదనంతరం కెసిఆర్‌తో వారు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర పోరాటం ముగిసిన దశాబ్దాల తర్వాత కూడా దేశంలో అనేక వర్గాలు తమ ఆకాంక్షలను, హక్కులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు సిద్ధపడుతుండటం శోచనీయమన్నారు. దేశంలోని రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిష్కారం దొరకడంలేదో, ఈ దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో మనందరం చర్చించుకోవాల్సిన సందర్భం ఏర్పడిందన్నారు. ఒకనాడు బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతదేశానికి అనేక పోరాటాల ద్వారా స్వాతంత్య్రం లభించిందన్నారు. చైతన్యంతో స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్న ఏ దేశమైనా, ఏ సమాజమైనా ఆ పోరాట చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తూ తమ స్వయంపాలనలో ప్రజల అభివృద్ధి కోసం భవిష్యత్ తరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తమ తమ దేశాల చట్టాలను, పాలనా వ్యవస్థలను రూపొందించుకుంటాయన్నారు. ఆయా సమాజాల స్వయంపాలనా ప్రారంభకాలంలో బుద్ధిజీవులు నాయకత్వం వహిస్తారన్నారు. తమ ప్రజలకు ఎలాంటి పాలన అందించాలో సర్వానుమతి తీసుకొని పాలనను ప్రారంభిస్తారన్నారు. కానీ మొదటి దశలోనే పరిపాలన సంపూర్ణంగా ఉండకపోవచ్చునని…. రానురాను బాలారిష్టాలను దాటుకుంటూ పాలన అనుభవాలను, కార్యాచరణను క్రోడీకరించుకోవడం ద్వారా రెండు మూడు దశాబ్దాల్లో పాలనను 80 శాతం వరకు విజయవంతంగా గాడిలో పడుతుందన్నారు. తద్వారా ఆ దేశ ప్రజలయొక్క జీవితాలు గుణాత్మకంగా అభివృద్ధి సాధిస్తాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. మిగిలిన కొద్దిశాతం పాలన కూడా మరికొద్దికాలంలో చక్కబడి, పరిపూర్ణత సాధించుకుంటుందన్నారు.

ప్రపంచంలో సైన్సు, సాంకేతిక అభివృద్ధి పెరుగుతున్నకొద్దీ ఆయా సమాజాల్లో నూతన ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయన్నారు. అలా సాంకేతికత పెరుగుతున్నాకొద్దీ.. పాలనలో పరిపూర్ణత వస్తుందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. మానవ జీవితం ఉన్నంతకాలం ఈ పరిణామ క్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎంఎల్‌సి సిరికొండ మధుసూదనా చారి, శాసనసభ్యులు బాల్క సుమన్, ఆశన్నగారి జీవన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ రైతు సంఘాల నేతలు సహా దాదాపు 100 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మనవ వనరులు మన దేశంలోనే పుష్కలం
భారతదేశంలో ప్రకృతి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూమి దేవుడిచ్చిన వరమని కెసిఆర్ అన్నారు. అమెరికా, చైనా వంటి మిగతా ఏ దేశాలతో పోల్చి చూసినా నీటి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూమి, మానవ వనరులు భారతదేశంలోనే పుష్కలంగా ఉన్నాయన్నారు. దేశంలో మొత్తం 40 వేల కోట్ల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉన్నదన్నారు. ఈ భూముల సాగుకు కావల్సింది కేవలం 40 వేల టిఎంసిల నీళ్లు మాత్రమేనని కెసిఆర్ పేర్కొన్నారు. ఇందులో తాగునీటికి 10 వేల టిఎంసిలైతే సరిపోతాయన్నారు. మరి, 70 వేల టిఎంసిల నీటి వనరులు మన దేశంలో అందుబాటులో ఉన్నా కూడా ఎందుకు సాగునీటికి, తాగునీటికి దేశ ప్రజలు ఇంకా కూడా ఎదురు చూడాల్సి వస్తున్నదని ఈ సందర్భంగా కెసిఆర్ ప్రశ్నించారు. అదే సందర్భంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం మన దేశానికి ఉందన్నారు. అయినా 2 లక్షల మెగావాట్ల విద్యుత్ ను కూడా వినియోగించుకోలేకపోతున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తూ, సాగునీటిని అందిస్తున్నపుడు ఇదేపనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయదని కెసిఆర్ మరోసారి నిలదీసారు.

దేశంలో వ్యవసాయం సంక్షోభం ఎందుకుంది?

రైతులు కూర్చొని మాట్లాడుకోవడానికి తెలంగాణలో ఉన్నట్లు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్ లు ఉన్నాయా? అని కెసిఆర్ అడిగారు. సాగునీరున్నది….పుష్కలంగా కరెంటు ఉన్నదన్నారు. అలాగే కష్టపడే రైతులున్నారన్నారు. అయినా ఈ దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎందుకున్నదని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించారు. కేంద్ర పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విషయాలను మనం విశ్లేషించుకొని, చర్చించాల్సిన సందర్భం ఇదన్నారు. మన దేశ వనరులను సరిగా వినియోగించుకుంటూ దేశ సౌభాగ్యాన్ని గుణాత్మకంగా అభివృద్ధి పరిచే రైతు వ్యవసాయ సంక్షేమ దిశగా సాగే సుపరిపాలన కోసం మనం అడుగులు వేయాల్సి ఉన్నదని అని సిఎం కెసిఆర్ రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణ సహా ఢిల్లీ, ఒడిషా, గుజరాత్,కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్ గఢ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, అస్సాం, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, పాండిచ్చేరి, దాదానగర్ హవేలి తదితర రాష్ట్రాలకు చెందిన, వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నదన్నారు.

తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలు ఉండి ఉంటే….

తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రైతు సంక్షేమ పథకాలు ఉంటే తాము కూడా ఎంతో అభివృద్ధి చెందేవారమని ఈ సందర్భంగా పలువురు రైతు సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ కేవలం ఒక్క తెలంగాణకే కాకుండా తమ రాష్ట్రాల్లోని రైతుల గురించి కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని వారు ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News