Friday, April 26, 2024

బెంగాల్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: ప్రారంభోత్సవం జరుపుకున్న కొద్ది రోజులకే హౌరా జల్పాయ్‌గురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో సోమవారం సాయంత్రం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరుగగా దీనిపై ఎన్‌ఐఎతో దర్యాప్తు జరిపించాలని బిజెపి డిమాండు చేసింది. మాల్డా పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలోని కుమర్‌గంజ్ రైల్వే
స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. అయితే కోచ్ నంబర్ సి13 గ్లాస్ డోర్ ధ్వంసమైనట్లు ఆయన తెలిపారు.

డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ఈ రైలును ప్రారంభించారు. కాగా.. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బిజెపి కార్యకర్తలు జైశ్రీరామ్ నినాదాలతో స్వాగతం పలకడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ సివి ఆనంద బోస్ నచ్చచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ వేదికపైకి రావడానికి మమత నిరాకరించి కిందనే రైల్వే అధికారులతో కలసి కూర్చుండిపోయారు. ఇలా ఉండగా..వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మాల్డా జిల్లాలో జరిగినరాళ్ల దాడిని బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష బిజెపి నాయకుడు సువేందు అధికారి ఖండించారు. ప్రారంభోత్సవం రోజున జైశ్రీరామ్ నినాదాలతో ప్రతీకారమే ఈ రాళ్ల దాడా అని ప్రశ్నించిన ఆయన దీనిపై ఎన్‌ఐఎ దర్యాప్తునకు డిమాండు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News