Friday, September 19, 2025

మహా కుంభమేళాకు హాజరు కావడం దైవానుగ్రహమే

- Advertisement -
- Advertisement -

మహాకుంభ్ నగర్ : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రయాగ్ రాజ్‌లో త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానం ఆచరించారు. ‘మహా కుంభమేళాకు హాజరు కావడం దైవానుగ్రహమే’ అని భావిస్తున్నానని ఆయన తెలిపారు. ‘భక్తితో ధ్యానంలో నిమగ్నమైనట్లు’ ఆయన చెప్పారు. ప్రధాని మోడీ పుణ్య స్నానం ఆచరిస్తున్నప్పుడు చేతిలో రుద్రాక్షమాల పట్టుకున్నారు. ముదురు కాషాయ రంగు జెర్సీ ధరించిన మోడీ మంత్రోచ్చాటన చేస్తూ సూర్యునికి, గంగకు ప్రార్థనలు చేశారు. ‘ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో పాల్గొనడం దైవానుగ్రహమే. త్రివేణి సంగమం వద్ద కోట్లాది మందిఇతర భక్తుల వలె పుణ్య స్నానం ఆచరించాను. ‘భక్తితో ధ్యానంలో నిమగ్నమయ్యాను’ అని మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. ‘గంగా మాత శాంతి, విజ్ఞత, మంచి ఆరోగ్యం, సమరస భావంతో అందరినీ ఆశీర్వదించుగాక’ అని మోడీ అన్నారు.

ప్రధాని మోడీ త్రివేణి సంగమం వద్దకు అరైల్ ఘాట్ నుంచి ఒక పడవలో చేరుకున్నారు. ఆయన వెంట ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. మోడీ ఆ ప్రదేశానికి చేరుకునేటప్పుడు నదికి రెండు వైపుల బారులు తీరిన జనసమూహం చేతులు ఊపుతుండగా ఆయన ప్రత్యభివాదం చేశారు. పవిత్ర స్నానం ఆచరించిన తరువాత ప్రధాని మోడీ నదిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక వేదికపైకి ఎక్కి హారతి సహా పూజాదికాలు నిర్వహించారు. ఆయన పవిత్ర నదులకు పాలు, పూలు సమర్పించారు. ఆయన త్రివేణి సంగమం వద్ద ఒక చీర కూడా సమర్పించారు. ఒక అర్చకుని మార్గదర్శకంలో ప్రధాని మోడీ ఆ ప్రక్రియలు నిర్వర్తించారు. కాగా, ప్రధాని పర్యటన కోసం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తర ప్రదేశ్ మిల్కీపూర్‌లో ఉప ఎన్నిక జరుగుతున్న రోజు ఆయన పర్యటన చోటు చేసుకున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News