Wednesday, April 24, 2024

బార్టీ, జకోవిచ్ శుభారంభం

- Advertisement -
- Advertisement -

Australia Open

 

రెండో రౌండ్‌లో సెరెనా, ఒసాకా , ఫెదరర్, సిట్సిపాస్ ముందుకు: ఆస్ట్రేలియా ఓపెన్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), మాజీ ఛాంపియన్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆశ్లే బార్టీ (ఆస్ట్రేలియా), మాజీ నంబర్‌వన్‌లు సెరెనా విలియమ్స్ (అమెరికా), కరోలిన్ వోజ్నియాకి (డెన్మార్క్) తదితరులు తొలి రౌండ్‌లో విజయం సాధించారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో రెండో సీడ్ జకోవిచ్ చెమటోడ్చి నెగ్గాడు. 76, 62, 26, 61తో జర్మనీ ఆటగాడు జాన్ లెనార్డ్ స్ట్రర్ఫ్‌ను ఓడించాడు. తొలి సెట్‌లో జకోవిచ్‌కు ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా దాన్ని తట్టుకుని ముందుకు సాగాడు. రెండో సెట్‌లో మాత్రం అలవోకగా విజయాన్ని అందుకున్నాడు. కానీ, మూడు సెట్‌లో జాన్ పుంజుకున్నాడు. దూకుడుగా ఆడుతూ సెట్‌ను దక్కించుకున్నాడు.

అయితే నాలుగో సెట్‌లో మళ్లీ జకోవిచ్ ఆధిపత్యం చెలాయించాడు. తన మార్క్ షాట్లతో చెలరేగిన జకోవిచ్ సునాయాసంగా సెట్‌ను గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మరో పోటీలో మూడో సీడ్ ఫెదరర్ జయకేతనం ఎగుర వేశాడు. అమెరికా ఆటగాడు స్టీవ్ జాన్సన్‌తో జరిగిన మొదటి రౌండ్‌లో ఫెదరర్ 63, 62, 62 ఫెదరర్ విజయం సాధించాడు. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన ఫెదరర్ వరుసగా మూడు సెట్లను గెలిచి ముందంజ వేశాడు. మరోవైపు ఆరోసీడ్ సిట్సిపాస్ (గ్రీస్) కూడా సునాయాస విజయంతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఏకపక్షంగా సాగిన పోరులో సిట్సిపాస్ 60, 62, 63తో ఇటలీకి చెందిన కరుసోను చిత్తు చేశాడు. 8వ సీడ్ మాటెయో బరెటిని (ఇటలీ) కూడా తొలి రౌండ్‌లో విజయం సాధించాడు. మొదటి రౌండ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ హారిస్‌ను ఓడించాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన బరెటిని 63, 61, 63తో హారిస్‌పై గెలుపొందాడు. కాగా, సోమవారం జరగాల్సిన పలు మ్యాచ్‌లు ప్రతికూల వాతావరణం వల్ల అర్ధాంతరంగా ఆగిపోయాయి.

ఆశ్లే ముందుకు
మరోవైపు మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆశ్లే బార్టీ తొలి రౌండ్‌లో కష్టపడి విజయం సాధించింది. సోమవారం జరిగిన పోరులో బారీ ్ట 57, 61, 61తో ఉక్రెయిన్ క్రీడాకారిణి లెసియా సురెంకోను ఓడించింది. తొలి సెట్‌లో బార్టీకి చుక్కెదురైంది. ప్రత్యర్థి క్రీడాకారిణి అద్భుత పోరాట పటిమను కనబరచడంతో బార్టీకి ఇబ్బందులు తప్పలేదు. టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్‌లో లెసియా విజయం సాధించింది. కానీ, తర్వాతి సెట్‌లలో బార్టీ చెలరేగి పోయింది. తన మార్క్ షాట్లతో విరుచుకు పడిన బార్టీ సునాయాసంగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేసింది. మాజీ ఛాంపియన్, 8వ సీడ్ సెరెనా విలియమ్స్ కూడా రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో సెరెనా 60, 63తో అనస్తాసియా పొటాపొవా (రష్యా)ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన సెరెనా వరుసగా రెండు సెట్లు గెలిచి తర్వాతి రౌండ్‌కు దూసుకెళ్లింది.

మరో పోటీలో ఏడో సీడ్ పెట్రా క్విటోవా (చెక్) విజయాన్ని అందుకుంది. తొలి రౌండ్‌లో తన దేశానికే చెందిన కటెరినాను చిత్తు చేసింది. ఏక పక్ష పోరులో క్విటోవా 61, 60తో జయభేరి మోగించింది. మాజీ నంబర్‌వన్ వోజ్నియాకి కూడా రెండో రౌండ్‌కు చేరుకుంది. మొదటి రౌండ్‌లో వోజ్నియాకి 61, 63తో అమెరికాకు చెందిన క్రిస్టిను చిత్తు చేసింది. మరోవైపు మూడో సీడ్ నవోమి ఒసాకా (జపాన్) కూడా తొలి రౌండ్‌లో అలవోక విజయాన్ని అందుకుంది. 62, 64తో చెక్ క్రీడాకారిణి మారి బౌజ్‌కోవాను ఓడించి ముందంజ వేసింది. కాగా, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ నంబర్‌వన్ సమంత స్టోసర్ తన పేలవమైన ప్రదర్శనను కొనసాగిస్తూ మరోసారి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.

Australia Open defending champion
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News