Thursday, April 25, 2024

మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాశ్ ఏకగ్రీవం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. బండ ప్రకాష్ ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా బండ ప్రకాశ్‌కు సిఎం కెసిఆర్ అభినందనలు తెలి పారు. ఆయనను స్వయంగా తీసుకెళ్లి ఛైర్మన్ సీట్లో కూర్చొబెట్టారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్ పదవీకాలం ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. విద్యార్థి స్థాయి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆయన సేవలు చాలా అవసరమని పేర్కొన్నారు. ఉన్నత విద్యావంతుడిగా వరంగల్ జిల్లా వాసిగా సుపరిచితులని, ముదిరాజ్ సామాజిక అభ్యున్నతికి బండ ప్రకాశ్ చేసిన కృషి అభినందనీయమన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా బండ ప్రకాష్ కీలకపాత్ర పోషించడంతోపాటు నూతన రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని వివరించారు. బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు. విద్యార్థి నాయకుడిగా ఉంటూనే రాజకీయాల్లోకి వచ్చిన బండ ప్రకాష్ , తన సామాజిక వర్గం అయిన ముదిరాజ్ సామాజిక వర్గానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. రాజ్యసభ నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని తాను కోరానని అన్నారు.

మండలి డిప్యూటీ చైర్మెన్‌గా ఎన్నికైన బండ ప్రకాశ్‌ను మంత్రి కెటిఆర్ హృదయపూర్వకంగా అభినందించారు. ఆయన అనుభవం సభకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాన్నారు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన బండ ప్రకాశ్‌కు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎంఎల్‌సి కవిత, జీవన్ రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. సభ్యులం దరికీ చర్చలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ ముందుకెళ్లాలని బండప్రకాశ్‌ను సభ్యులు కోరారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా నేతి విద్యా సాగర్ రావు పదవి కాలం పూర్తయినప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. బండ ప్రకాష్ 2021లో ఎంఎల్‌ఎ కోటాలో శాసన మండలికి ఎంపికైన సంగతి తెలిసిందే. బండ ప్రకాష్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన 2021లో జరిగిన ఎన్నికల్లో ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నిక్ల్లో 2021 నవంబర్ 16న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థిగా ఖరారై, నవంబర్ 22న ఎంఎల్‌సిగా ఎన్నికయ్యారు. బండ ప్రకాష్ ఎంఎల్‌సి పదవీ కాలం 2021 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు ఉండనుంది. బండ ప్రకాష్ 1954 ఫిబ్రవరి 18న వరంగల్ లో సత్యనారాయణ, శకుంతల దంపతులకు జన్మించారు. ఆయన కాకతీయ యూనివర్సిటీ, వరంగల్ నుండి 1996లో పిహెచ్‌డి పట్టా పొందారు. ఆయన భార్య పేరు అనిత, ఆమె వృత్తిరీత్యా టీచర్, సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు.

రాజకీయాల్లోకి ఇలా…

బండ ప్రకాష్ 1981 నుండి 1986 వరకు వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్‌గా పని చేశారు. ఆయన 1981 నుండి 1984 వరకు వరంగల్ మున్సి పాలిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. 1981 నుండి 1986 వరకు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. బండ ప్రకాష్ 2018లో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ నుండి గెలిచారు. ఈ ఎన్నికలో బండ ప్రకాశ్‌కు అత్యధికంగా 33 ఓట్లు పోలయ్యాయి. ఆయన 2018 మార్చి 23న బిఆర్‌ఎస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. బండ ప్రకాష్, 2018-2019 వరకు ప్రాచీన స్మారక కట్టడాలపై రాజ్యసభలో సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2019లో రాజ్యసభలో కార్మిక చట్టాలు, సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2019 జూన్‌లో జరిగిన పార్టీ పార్ల మెంటరీ సమావేశంలో రాజ్యసభలో బిఆర్‌ఎస్ పక్ష ఉప నాయకుడిగా బండ ప్రకాష్ నియమితులయ్యాడు. బండ ప్రకాష్ తెలంగాణ శాసన మండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎంఎల్‌ఎ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 16 నవంబర్ 2021న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థిగా ఖరారై, నవంబర్ 22న ఎంఎల్‌సిగా ఎన్నికై, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి అయన పేరును 2023 ఫిబ్రవరి 10న సిఎం కెసిఆర్ ఖరారు చేశారు.

సిఎం కెసిఆర్ బిసిల పక్షపాతి : మంత్రి గంగుల

సిఎం కెసిఆర్ బిసి వర్గాలకు సముచిత స్థానం కల్పస్తున్నారని రాష్ట్ర బిసి సంక్షేమ ,పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శాసన మండలిలో బండ ప్రకాశ్‌ను డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నుకున్నందుకు అభినందనల తీర్మానంపై మంత్రి మాట్లాడారు. వెనుకబడిన వర్గాలను రాజకీయం, సామాజికం, ఆర్థికంగా చేయూత నిచ్చి బిసిలకు అండగా నిలబడుతున్నారని ప్రశంసించారు. బిసిల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న బండా ప్రకాశ్‌ను డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నుకున్నందుకు సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రైతుబంధు సహా అనేక పథకాల్లో బిసిలదే మెజార్టీ వాటా ఉంటుందని అన్నారు. బలహీన వర్గాలకు వెయ్యికి పైగా గురుకులాలు, వేల కోట్ల విలువైన స్థలాల్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారన్నారు. రాజకీయంగానూ ముదిరాజ్, రజక, నేత, యాదవ, కాపు, గౌడ, బిసిల్లోని సామాజిక వర్గాలకు అవకాశం ఇస్తున్నారన్నారు. బిసిల అభ్యున్నతికి బిసి ప్రతినిధులు మరింత కృషి చేయాలని కోరారు. వెనుకబడిన వర్గాల కోసం తపించే బండ ప్రకాశ్ అత్యున్నతమైన డిప్యూటీ చైర్మన్ పదవిని అధిష్టించడం సంతోషంగా ఉందని మంత్రి అభినందనలు తెలిపారు.

కెసిఆర్‌కు బిసిలంటే అమితమైన ప్రేమ : తలసాని

మంత్రి తలసాని మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌కు బిసిలంటే అమితమైన ప్రేమ అని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో బిసిలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని, రాజకీయ పదవులలోనూ వారికే అగ్రతాంబూలం ఇస్తున్నారన్నారని పేర్కొన్నారు. అందుకు నిదర్శనం బిసి నేతకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి కట్టబెట్టడం అన్నారు.

వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం: కొప్పుల

శాసనమండలిలో డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికైన బండ ప్రకాష్‌కు రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందనలు తెలిపారు.
తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికైన బండ ప్రకాష్ అభినందన తీర్మానంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు.
వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన బండ ప్రకాష్ విద్యార్థి దశ నుంచి ఉద్యమ బాట పట్టారని, ఆదివారం ఉన్నత స్థానంలో కుర్చోవడం
ఎంతో సంతోషకర విషయమన్నారు. భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించ్చారు. అంతే కాదు, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన బండ ప్రకాష్‌కు సిఎం కెసిఆర్ మండలి డిప్యూటీ చైర్మన్ పదవి కట్టబెట్టి ఆత్మగౌరవం నిలిపారన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News