Monday, June 5, 2023

హైదరాబాద్‌లో బిసి గర్జన: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

 వచ్చే నెలలో హైదరాబాద్‌లో బిసి గర్జన : బండి సంజయ్
 ఓబిసి సమ్మేళనంలో బిసి డిక్లరేషన్ ప్రకటించిన బిజెపి
 బిసిల జనాభా ఆధారంగా బడ్జెట్‌లో నిధులు
 రాష్ట్ర బిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదాకు హామీ
 విదేశాల్లో విద్యాభ్యాసానికి ఆర్దిక సాయం
మనతెలంగాణ/ హైదరాబాద్: వచ్చే నెలలో లక్ష మందితో హైదరాబాద్‌లో బిసి గర్జన సభ నిర్వహిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్ నాగోల్‌లో మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన బిజెపి ఓబీసీ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు బిసి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో బిసిలకు కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, 50 శాతం మంది బిసిలుంటే మంత్రివర్గంలో ముగ్గురికే మంత్రి పదవులు ఇచ్చి రాజకీయంగా అణగదొక్కారని ఆరోపించారు.

ఎన్నికలు వస్తే తప్ప కెసిఆర్‌కు ఆత్మ గౌరవ భవనాలు గుర్తుకు రావని దుయ్యబట్టారు. రూ.1600 కోట్లతో సచివాలయం మాత్రం పూర్తి చేసుకున్నారని… ఇప్పటివరకు బిసి ఆత్మ గౌరవ భవనాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల బిసిలకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని విమర్శలు గుప్పించారు. బిసి బంధు ప్రకటించేందుకు ఉన్న ఇబ్బంది ఏంటో రాష్ట్ర ప్ఱభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

భజరంగ్‌దళ్‌ను నిషేధించేందుకు కుట్ర..
రాష్ట్రంలో భజరంగ్‌దళ్‌పై నిషేధించేందుకు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ముస్లిం కూడా భజరంగ్‌దళ్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేయలేదని, ఆ సంస్థ ఎప్పుడూ హింసను ప్రేరేపించలేదని, హిందూ ధర్మ వ్యాప్తి కోసం మాత్రమే పనిచేస్తోందన్నారు.

బిసిల మద్దతుతో అధికారంలోకి వస్తాం: ఎంపి లక్ష్మణ్
రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే బిసిలకు న్యాయం చేస్తామని ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ హామీ ఇచ్చారు. బిజెపి బిసి డిక్లరేషన్‌ను ఆయన ప్రకటిస్తూ… అధికారంలోకి వస్తే బిసి జనాభా ఆధారంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర బిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తామని తెలిపారు. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే బిసి విద్యార్థులందరికీ ఆర్దిక సాయం అందిస్తామని ప్రకటించారు. నామినేటెడ్ పదవుల్లో బిసిలకు పెద్ద పీట వేస్తామని, ఎన్నికల్లో పోటీపడలేని, గెలవలేని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. బిసిల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎవరు పని చేస్తున్నారో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

2017లో బిసి కమిషన్‌కు ప్రధాని మోడీ సర్కారు చట్టబద్ధత కల్పించిందని తెలిపారు. నరేంద్ర మోడీ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు మంత్రివర్గంలో పెద్దపీఠ వేసి సామాజిక న్యాయం పాటించారన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక బిసి జనాభా నిష్పత్తి ప్రకారం వాటా కల్పిస్తామని చెప్పారు. తెలంగాణలో మార్పు రావాలంటే.. బిసిలు ఐక్యం కావాలన్నారు. బిసిల మద్దతుతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో లక్షలాది మందితో హైదరాబాద్‌లో బిసి గర్జన చేపడతామని లక్ష్మణ్ తెలిపారు. సమ్మేళనంలో మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీశైలంగౌడ్, నందీశ్వర్‌గౌడ్, ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్, గడీల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News