Sunday, April 28, 2024

బిసి స్త్రీలకు టికెట్లివ్వండి!

- Advertisement -
- Advertisement -

జనాభాలో సగం మంది మహిళలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు వారికి చట్టసభల్లో ఎన్నడూ న్యాయమైన ప్రాతినిధ్యం దక్కలేదు. కొత్త చట్టం ప్రకారం భవిష్యత్తులో, బహుశా 2028 నుంచి స్త్రీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలయ్యే అవకాశమున్నది. ఈ రిజర్వేషన్లలో ఎస్‌సి, ఎస్‌టి మహిళలకు ‘కోటాలో వాటా’ దక్కనున్నది. కానీ బిసి మహిళలకు ఆ అవకాశం లేకుండా చేసిండ్రు. తనకు తాను ఒబిసిగా చెప్పుకునే నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఈ అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తాము గతంలో ఇవ్వ నిరాకరించిన ఒబిసి రిజర్వేషన్లను ప్రస్తుత చట్టంలో అమలు చెయ్యాలని ‘లిప్ సింపథీ’ చూపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి నిజంగానే చిత్త శుద్ధి ఉన్నట్లయితే 2010లోనే బిల్లు చట్ట రూపం దాల్చేది. 2014 ఎన్నికల్లో అమలయి తీరేది. ఒబిసిలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం నిరాకరించడంలో కాంగ్రెస్, బిజెపి దొందూ దొందే అని గుర్తించాలి. ప్రస్తుత చట్టం వల్ల ‘దొరల’ స్థానంలో ‘దొరసానులు’ ఏలడం తప్ప సామాజికంగా అణచివేతకు, వివక్షకు గురవుతున్న మహిళలకు జరిగే మేలు గుండు సున్న. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సందర్భం కాబట్టి ఇక్కడి మహిళల ప్రాతినిధ్యం గురించి విశ్లేషించుకోవాలి.

మొత్తంగా మహిళలకు అందులోనూ బిసి స్త్రీలకు జరిగిన అన్యాయాన్ని వివరంగా చర్చించుకోవాలి. ఈ అవగాహనతో రాజకీయ పార్టీల ముందు డిమాండ్లు పెట్టాలి. ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతంలో మొత్తం 15 సార్లు జనరల్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్నడు కూడా స్త్రీల ప్రాతినిధ్యం సింగిల్ డిజిట్‌ని దాటలేదు. ఒక్క 2009 ఎన్నికలు మినహా. 2009లో జరిగిన నియోజక వర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో సీట్ల సంఖ్య 107 నుంచి 119కి పెరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 16 మంది మహిళలు విజేతలుగా నిలిచారు. ఇందులో ఆరుగురు ఎస్‌టి మహిళలున్నారు. ఒక ఎస్‌సి, ఒక బిసి మహిళ ఉన్నారు. అట్లాగే 1985, 1994 జనరల్ శాసనసభ ఎన్నికల్లో కేవలం ఒక్కొక్క మహిళ విజేతగా నిలిచారు. 1985లో షాద్‌నగర్ ఎస్‌సి రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఎం. ఇందిర, 1994లో ఆర్మూరు నుంచి ఏలేటి అన్నపూర్ణదేవిలు తెలుగుదేశం పార్టీ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇది తెలంగాణ నుంచి అత్యల్ప ప్రాతినిధ్య ఉన్న సందర్భం.

ఇప్పటి వరకు తెలంగాణలో 15 సార్లు సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో మొత్తం 1622 స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో 90 మంది మహిళలు విజేతలుగా నిలిచారు. ఇందులో 21 మంది ఎస్‌సిలు, 11 మంది ఎస్‌టిలు, ఏడుగురు బిసిలు, నలుగురు ముస్లిం మహిళలు, ఒక పార్సీ, ఒక క్రిస్టియన్ మహిళ అసెంబ్లీకి ఎన్నికయిండ్రు. ఇందులో నాలుగు సార్లు విజేతగా నిలిచిన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ కూడా ఉన్నది. ఈమె మున్నూరు కాపు కులానికి చెందిన మురళిని వివాహ మాడింది. ఆమె కాకుండా అంతకుముందు బిసి సామాజిక వర్గాల నుంచి 1952లో బాన్సువాడ నుంచి సంగెం లక్ష్మీబాయమ్మ, 1962నుంచి ముదిరాజ్ కులానికి చెందిన కేవల్ ఆనందిబాయి, 1972లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ముసపోత కమలమ్మ విజేతగా నిలిచింది. ఉప ఎన్నికల్లో ఒక సారి నిజామాబాద్ నుంచి ఆకుల లలిత గెలిచింది. ఇట్లా ఏడు సార్లు తెలంగాణ అసెంబ్లీకి బిసి మహిళలు ఎన్నికయిండ్రు. (ఉప ఎన్నికలను మినహాయిస్తే) నిజానికి మొత్తం 56 శాతమున్న బిసిలకు 1622 సీట్లలో హీనపక్షం దాదాపు 900 సార్లు ప్రాతినిధ్యం దక్కాలి.

అందులో మహిళలకు 50% అంటే నాలుగు వందల యాభై సార్లు ప్రాతినిధ్యం దక్కాలి. కానీ కేవలం ఏడు సార్లు మాత్రమే బిసి మహిళలు విజేతలుగా నిలిచారు. అంటే బిసి మహిళల ప్రాతినిధ్యం 2% కూడా లేదు అని గుర్తుంచుకోవాలి.హైదరాబాద్ అసెంబ్లీకి, ఆతర్వాత 1957 లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితమై జరిగిన జనరల్ ఎన్నికల్లో ఇద్దరేసి ముస్లిం మహిళలు మాసూమా బేగవ్‌ు, షాజాహానా బేగవ్‌ులు విజేతలుగా నిలిచారు. అట్లాగే పార్సీ మహిళ రోడా మిస్త్రి 1962లో జూబ్లీహిల్స్ నుంచి, క్రైస్తవ మహిళ మేరి రవీంద్రనాథ్ 1989లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు.
ఇక ఎస్‌సి మహిళల విషయానికి వస్తే వారికి 1983, 1994, 2018 మినహా ప్రతి ఎన్నికల్లో ప్రాతినిధ్యం దక్కింది. చట్ట సభల్లో స్త్రీలకు ఎలాంటి రిజర్వేషన్లు లేకున్నా 1972, 2004 ఎన్నికల్లో ముగ్గురేసి ఎస్‌సి మహిళలు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1957, 1962, 1967, 1999, 2014ల్లో తెలంగాణ నుంచి ఇద్దరేసి ఎస్‌సి స్త్రీలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అట్లాగే 1952, 1978, 1985, 1989, 2009 ఎన్నికల్లో ఒక్కో ఎస్‌సి మహిళ గెలుపొందారు. ఇట్లా వీరి సంఖ్య 21గా నిలిచింది. 1952లో హైదరాబాద్ రాష్ర్టంలో మొదటిసారిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన అంబేడ్కర్ శిష్యురాలు జె.ఎం. రాజమణీదేవి ఆయన స్థాపించిన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీ తరపున సిరిసిల్ల ఎస్‌సి నియోజక వర్గం నుంచి విజేతగా నిలిచింది. ఆమె తొలి అసెంబ్లీలో తన గళాన్ని అనేక సందర్భాల్లో వినిపించింది.

ఆమె బావ, అంటే భర్త కృష్ణమూర్తి అన్న జెహెచ్ సుబ్బయ్య హైదరాబాద్ నుంచి రాజ్యసభకు ఎన్నికయిండు. ఈ సుబ్బయ్య హైదరాబాద్‌లో షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ (ఎస్‌సిఎఫ్) కార్యకలాపాలను విస్తృతంగా నడిపించాడు. హైదరాబాద్ అసెంబ్లీకి మొత్తం ఐదుగురు సభ్యులు ఎస్‌సిఎఫ్ నుంచి ఎన్నికయితే అందులో ముగ్గురు తెలంగాణ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అంతకు ముందు ఆంధ్ర రాష్ర్టంలో ఎన్నికలు జరగడంతో వారి పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేవలం తెలంగాణ ప్రాంతంలో 1957లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఫైర్ బ్రాండ్ లీడర్ సుమిత్రాబాయి, అగ్గి గొంతుక టి.ఎన్. సదాలక్ష్మి కామారెడ్డి నియోజకవర్గం నుంచి విజేతలుగా నిలిచారు. ఆ తరువాతి ఎన్నికల్లో (1962) సుమిత్రాబాయి హైదరాబాద్ ఈస్ట్ నుంచి, ఎల్లారెడ్డి నుంచి టి.ఎన్.సదాలక్ష్మి మరోసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిండ్రు.

సుమిత్రాబాయి 1967లో ఓడిపోయినప్పటికీ 1972లో మేడ్చల్ నుంచి, 1978లో ఇబ్రహీంపట్నం నుంచి విజేతగా నిలిచారు. అంటే ఆమె నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ వరుసలో జె.ఈశ్వరీబాయి, ప్రేమలతాదేవి, ఎం. ఇందిర, కొండ్రు పుష్పలీల, పాటి సుభద్ర, జె. గీతారెడ్డి, బండారు శారారాణి, బొడిగె శోభలు అసెంబ్లీలో అడుగుపెట్టిన దళిత మహిళలు. ఈ విశ్లేషణలో ఉప ఎన్నికలను పరిగణనలోకి తీసుకోలేదు. మేడ్చల్ నుంచి వి. మంకమ్మ అనే దళిత స్త్రీ ఉప ఎన్నికలో విజేతగా నిలిచింది.
ఎస్‌టి మహిళలు మొదటిసారిగా 2009లో అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో మొత్తం ఆరుగురు మహిళలు అసెంబ్లీలో అడుగు పెట్టిండ్రు. అంటే వారికి ఆ ఎన్నికల్లో 50% ప్రాతినిధ్యం దక్కిందని చెప్పవచ్చు. మొత్తం 12 సీట్లు ఎస్‌టిలకు రిజర్వయితే అందులో ఆరు సీటలో సుమన్ రాథోడ్ (ఖానాపూర్), సత్యవతి రాథోడ్ (డోర్నకల్), కవితా మాలోవత్ (మహబూబాబాద్), ధనసరి అనసూయ (ములుగు), చంద్రాబతి భానోత్ (వైరా), కుంజా సత్యవతి (భద్రాచలం) నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కోవా లక్ష్మి, అజ్మీరా రేఖ, హరిప్రియా భానోత్, ఆత్రం సక్కులు ఎస్‌టి నియోజకవర్గాల నుంచి గెలుపొందారు.ఇందులో అజ్మీరా రేఖ రెండు సార్లు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి విజేతగా నిలిచారు. తెలంగాణ నుంచి మహిళల ప్రాతినిధ్యమే తక్కువ ఇందులో 45 మంది కులపరంగా,

మతపరంగా అణచివేతకు గురైన వారుండగా మరో 45 మంది ఆధిపత్య కులాలకు చెందిన వారున్నారు. ఇందులో రెడ్డి, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాల వారున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి లక్ష్మికాంతమ్మ (హిమాయత్‌నగర్ 1978), కాట్రగడ్డ ప్రసూన (సనత్‌నగర్ 1983), జయసుధ (సికింద్రాబాద్ 2009) విజేతలుగా నిలిచారు. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఒక్క వెలమ మహిళ కూడా ఇంత వరకు తెలంగాణ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ఆధిపత్య కుల మహిళల్లో మూడు సార్లు గెలిచిన వారిలో కమ్యూనిస్టు పార్టీ నుంచి ఆరుట్ల కమలాదేవి, కాంగ్రెస్ నుంచి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి, డి.కె.అరుణ (ఒకసారి సమాజ్‌వాది పార్టీ), పద్మాదేవేందర్ రెడ్డి (టిఆర్‌ఎస్) తదితరులున్నారు. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినట్లయితే మళ్ళీ ఈ స్త్రీకే ప్రాతినిధ్యం దక్కుతుంది తప్ప అనాదిగా అణచివేతకు గురవుతున్న బిసిలు మరింతగా నష్టపోతారు. ఎస్‌సి, ఎస్‌టిలకు కొంత మేరకైనా రిజర్వేషన్లు కోటాలో వాటాగా అమలవుతుంది కాబట్టి అంతోఇంతో వారి తరపున మాట్లాడే వారు అసెంబ్లీలో అడుగుపెడతారు.

బిసి స్త్రీల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారం కోసం ప్రయత్నించే ప్రతినిధి సుదూరంలో కనబడడం లేదు. నిజానికి చట్ట సభల్లో రిజర్వేషన్లు ఎప్పటి నుంచి అమలవుతాయో ఇదమిత్థంగా తేల్చిచెప్పడం ఇప్పుడే సాధ్యం కాదు. ఒక్క బిజెపి తప్ప అన్ని రాజకీయ పార్టీలు చట్ట సభల్లో బిసి మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ చేసే పార్టీలన్నీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరపున 33% మహిళలకు అందులో 33% (కనీసం) సీట్లు బిసిలకు (టికెట్లు) కేటాయించాలి. అంటే 119 సీట్లలో 33% అంటే దాదాపు 40 సీట్లు స్త్రీలకు (టికెట్లు) కేటాయించాలి. అందులో 33% అంటే 13 సీట్లు బిసి స్త్రీలకు ఇవ్వాలి. అంటే బిసిల రిజర్వేషన్ల పట్ల సమ్మతి ప్రకటిస్తున్న అన్ని పార్టీలు బిసి మహిళలకు కనీసం 13 టికెట్లు ఇవ్వాలి. అట్లా ఇస్తేనే వారిని భవిష్యత్తులో నమ్మడానికి వీలవుతుంది. లేదంటే బిజెపి మాదిరిగా వీళ్లు కూడా ‘జుమ్లా బాజీ’లే అని అర్థం చేసుకోవాల్సి ఉంటది. ఇప్పుడు బంతి రాజకీయపార్టీల కోర్టుల్లో ఉన్నది.

సంగిశెట్టి శ్రీనివాస్
9849220321

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News