Saturday, April 27, 2024

డొమెస్టిక్ క్రికెట్ రక్షణ కోసం నడుం బిగించిన బిసిసిఐ!

- Advertisement -
- Advertisement -

మన తెలం గాణ/ హైదరాబాద్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు దేశవాళీ క్రికెట్‌కు పెద్ద పీట వేస్తాయి. ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆస్ట్రేలియాలో కూడా దేశవాళీ క్రికెట్‌కు సముచిత స్థానం లభిస్తోంది. భారత్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, న్యూజిలాండ్ దేశాల క్రికెట్ బోర్డులు కూడా డొమెస్టిక్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎప్పుడైతే భారత క్రికెట్ బోర్డు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)ను తెచ్చిందో అప్పటి నుంచి డొమెస్టిక్ క్రికెట్ పరిస్థితి రోజురోజుకు దయనీయంగా తయారవుతోంది. ఐపిఎల్‌లో ఆడడం ద్వారా యువ క్రికెటర్లకు కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తోంది. అంతేగాక ఐపిఎల్‌లో ప్రతిభ ఆధారంగా టీమిండియాలో కూడా సునయాసంగా చోటు దక్కుతోంది.

ఇలాంటి సమయంలో చాలా మంది యువ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్‌పై చిన్నచూపు చూస్తున్నారు. ఒకప్పుడూ టీమిండియాలో స్థానం దక్కాలంటే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ,విజయ్ మార్చంట్ ట్రోఫీ, ముస్తాక్ అలీ వంటి దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటాల్సి ఉండేది. అందులో సత్తా చాటిన క్రికెటర్లకే భారత జట్టులో చోటు దక్కేది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, లక్ష్మణ్, కుంబ్లే, శ్రీనాథ్, జహీర్ ఖాన్, వెంకటేష్ ప్రసాద్, హర్భజన్, కాంబ్లీ, అజారుద్దీన్, రవిశాస్త్రి వంటి దిగ్గజాలు రంజీ ట్రోఫీ తదితర టోర్నమెంట్‌లలో సత్తా చాటడం ద్వారే భారత జట్టులో స్థానం సంపాదించారు. అయితే ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ఆటగాళ్లలోచాలా మంది దేశవాళీ క్రికెట్‌లో కంటే ఐపిఎల్‌లో రాణించడం ద్వారానే జట్టులోకి వచ్చారు. ఐపిఎల్ రాకతో దేశవాళీ క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది. దీంతో భారత క్రికెట్ బోర్డు నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది.

దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు ఆసక్తి చూపనిఆటగాళ్లపై కొరడా ఝులిపించింది. తాజాగా ప్రకటించిన బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో స్టార్ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ తదితరులకు చోటు కల్పించలేదు. ఐపిఎల్‌లో రాణించడం ద్వారా జాతీయ జట్టులో చోటు సంపాదించిన ఇషాన్, శ్రేయస్‌లు రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో ఆడేందుకు ఆసక్తి కనబరచడం లేదు. జాతీయ జట్టులో చోటు సంపాదించాలంటే దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో ఆడాల్సిందేనని బిసిసిఐ యువ ఆటగాళ్లను హెచ్చరించింది. అయినా ఇషాన్, శ్రేయస్ వంటి క్రికెటర్లు బోర్డు ఆదేశాలను సయితం లెక్కచేయలేదు. బోర్డు హెచ్చరికలను పెడచెవిన పెట్టిన వీరు ఐపిఎల్ సాధనను మొదలు పెట్టారు. వీరి తీరు బోర్డును మరింత ఆగ్రహం తెప్పించింది. వీరికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించిన బిసిసిఐ శ్రేయస్, ఇషాన్ తదితరులను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. వీరి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బిసిసిఐ పెద్దలు రానున్న రోజుల్లో ఈ ఆటగాళ్లను ఐపిఎల్‌లో ఆడకుండా వేటు వేసినా ఆశ్చర్యం లేదు.

మార్పులకు శ్రీకారం..

దేశవాళీ క్రికెట్‌ను రక్షించేందుకు బిసిసిఐ నడుంబిగించింది. కౌంటీ తరహాలో ప్రతి క్రికెటర్ దేశవాళీ క్రికెట్‌లో ఆడాల్సిందేనని నిబంధనను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే డొమెస్టిక్ క్రికెట్‌కు సంబంధించి సరికొత్త రూల్స్‌ను ప్రకటించాలనే ఉద్దేశంతో బిసిసిఐ పెద్దలు ఉన్నట్టు సమాచారం. టీమిండియాలో చోటు కోసం దేశవాళీ క్రికెట్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకోవాలని వారు భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఐపిఎల్ వేలం పాటలో పాల్గొనాలనుకునే ప్రతి క్రికెటర్ దేశవాళీ క్రికెట్‌లో తప్పనిసరిగా ఆడాలనే నిబంధనను కూడా తేవాలని బిసిసిఐ భావిస్తున్నట్టు తెలిసింది. దేశవాళీ క్రికెట్‌లో ఆడని ఆటగాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపిఎల్‌లో ఛాన్స్ ఇవ్వకూడదనే పట్టుదలతో ఉన్నట్టు కథనాలు వినవస్తున్నాయి. ఈ విషయాలన్నీ గమనిస్తే దేశవాళీ క్రికెట్ బలోపేతం కోసం బిసిసిఐ భవిష్యత్తులో కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఖాయమని చెప్పక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News