Tuesday, December 10, 2024

జార్ఖండ్ ఖనిజ సంపదపై బిజెపి కన్ను:భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

బిజెపికి ఝార్ఖండ్ ప్రజలపై ప్రేమ లేదని, ఇక్కడి ఖనిజ సంపద పై కన్ను వేసిందని స్టార్ క్యాంపెయినర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన జార్ఖండ్ రాష్ట్రం బొకారో నియోజకవర్గంలోని శివండి, దుంది బజార్, ఆజాద్ నగర్ తదితర బ్లాక్‌లలో ఇండియా కూటమి పక్షాన ప్రచారం నిర్వహించారు. జార్ఖండ్ రాష్ట్రంలోని అపార ఖనిజ సంపదను అదానీ, అంబానీ లకు అప్పగించేందుకు బిజెపి ప్రయత్నం చేస్తోందని వివరించారు. మీ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీ సంపదను, వనరులను కాపాడే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఈ దేశ వనరులు పంచాలని మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలోనూ ఎన్నికల ముందు ఇదే ప్రధాన అస్త్రంగా ప్రచారం చేశామని, ఆ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం వనరులు, సంపద పంచేందుకు తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించామని వివరించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే క్యాబినెట్లో తీర్మానం చేశామని, ఆ తర్వాత అసెంబ్లీలో ఏకగ్రీవంగా కుల గణనకు బిల్లు పాస్ చేయించామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో శరవేగంగా సమగ్ర కుటుంబ సర్వే జరుగుతోందని తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రంలోనూ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే ఇక్కడి సంపద ఈ ప్రాంత వాసులకే పంచుతామని, అందుకు ఇక్కడ కూడా సమగ్ర కుటుంబ సర్వే చేపడతామని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సంపద ఎవరి వద్ద ఉంది, ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి వంటి అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ సైనికుడిగా, మీ అందరితో ఇక్కడ మాట్లాడడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని, జార్ఖండ్ రాష్ట్ర పార్టీకి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ధన్యవాదాలు అన్నారు. తాను 20 ఏళ్లకు పైగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేతగా, ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా వివిధ హోదాల్లో పనిచేస్తున్నానని తెలిపారు. జార్ఖండ్ తరహా లోనే తెలంగాణ ప్రజలు మా నీళ్లు, నిధులు, నియామకాలు మాకు కావాలని సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని వివరించారు.

ప్రత్యేక రాష్ట్రాన్ని మొదట 10 సంవత్సరాల పాటు పాలించిన వారు రాష్ట్ర సంపద, వనరులను దోచుకున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల ముందు నాలుగు నెలలపాటు విరామం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా తాను మహా పాదయాత్ర నిర్వహించానని వివరించారు. తెలంగాణ రాష్ట్ర వనరులు, సంపదను 10 ఏళ్లు పాలించిన వారు ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ వివరించానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర సంపదను సామాన్యులకు పొందుతామని తెలిపామన్నారు. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను ఒకటి తరువాత ఒకటి అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రిగా 200 యూనిట్ల వరకు గృహ జ్యోతి పథకం ద్వారా పేదలకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నామని తెలిపారు. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ పథకాలు చేపట్టామని తెలిపారు.

జార్ఖండ్ రాష్ట్రంలోనూ మహాకూటమి అధికారంలోకి రాగానే తెలంగాణ తరహాలో ఏడు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మహాకూటమి అధికారులకు రావడం ఖాయమని, చివరి రెండు రోజులు మహాకూటమి, నాయకులు కార్యకర్తలు అవిశ్రాంతంగా శ్రమించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా సమిష్టిగా ప్రచారం చేసి ఇండియా కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు నిజాం అన్సారి, మహేష్ సింగ్, గులాబ్ హుస్సేన్ తోపాటు స్థానిక కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News