Sunday, December 15, 2024

నిజం బయటకు వస్తోంది:ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

బోగస్ కథనం కొంత కాలమే ఆకట్టుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం వ్యాఖ్యానించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002లో గోధ్రా రైలు దగ్ధం సంఘటనపై ఒక చిత్రాన్ని గురించి ప్రస్తావిస్తూ మోడీ ఆ వ్యాఖ్య చేశారు. ‘ఇటీవలి చరిత్రలో అత్యంత హేయనీయ ఘటనల్లో ఒకడానిలో ముఖ్యమైన నిజాన్ని వెలికి తెచ్చినందుకు’ ‘సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని ఒక వినియోగదారుడు ఒక పోస్ట్‌లో శ్లాఘించడంపై స్పందిస్తూ మోడీ ‘ఎక్స్’లో ఆ వ్యాఖ్య చేశారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో ‘ప్రయాణికులను క్రూరంగా దగ్ధం చేయడాన్ని’ ఒక స్వార్థపర వర్గం రాజకీయ వివాదంగా మార్చిందని, మోడీని అన్యాపదేశంగా ఉద్దేశిస్తూ, ‘ఒక నేత’ ప్రతిష్ఠను మసకబార్చే అంశంగా ఆ వర్గం ఆ ఘటనను చూసిందని కూడా ఆ వినియోగదారుడు వ్యాఖ్యానించారు.

‘బాగా చెప్పారు. ఈ నిజం బయటకు వస్తుండడం, అందునా సామాన్యులు దీనిని చూడగలిగే విధంగా వెలుగు చూడడం మంచిది’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘బోగస్ కథనం పరిమిత కాలం మాత్రమే సాగుతుంది. తుదకు వాస్తవాలు ఎల్లప్పుడూ వెల్లడవుతాయి’ అని మోడీ అన్నారు. అయోధ్య నుంచి తిరిగి వస్తున్న అధిక సంఖ్యాక యాత్రికులు ప్రయాణిస్తున్న రైలుకు ఒక ముస్లిం గుంపు నిప్పు అంటించిందని గుజరాత్ పోలీసులు ఆరోపించగా, ఆ ఘటనను ఒక ప్రమాదంగా కొందరు చిత్రించారు. రైలుకు నిప్పంటించినప్పుడు 50 మందికి పైగా ప్రయాణికులు మరణించగా, ఆ తరువాత గుజరాత్‌లో మత కల్లోలాలు చెలరేగాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంలో సభ్యుడైన రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ ప్రమాద కథనాన్ని సమర్థించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News