డ్బ్భైఅయిదు ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల వేళ మన దేశనాయకుల సేవాభావాన్ని మననం చేసుకోవడం అనివార్యం. ఈశాన్య భారతదేశంలో జననేతగా పేరుగాంచిన రాజకీయ చతురతుడు భీంబర్ డియోరీ. ఆయన 1903, మే 16న అసోంలోని శివసాగర్ జిల్లాలోని పనిదిహింగ్ గ్రామంలో గోదారం డిరీ, బజోతి డియోరీ దంపతులకు జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడైన ఈయన అసోంను తూర్పు పాకిస్తాన్‌లో విలీనం చేసే ప్రయత్నాలను విఫలం చేసిన జననాయకుడు. బాల్యం నుండి తెలివైన విద్యార్ధి. తనకు ఆసక్తి గల న్యాయవాది పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. మంగోలాయిడ్ జాతికి చెందిన సాధారణ గిరిజన యువకుడైన భీంబర్ అసోం సివిల్ పరీక్షలో ప్రథమస్థానం సంపాదించారు.
కానీ ఈయన గిరిజనుడైనందున బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. పట్టుదలతో ఆయన డిబ్రుగర్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. భీంబర్ స్వదేశీ వర్గాలను ఉద్ధరించడంలో, అసోం ప్రయోజనాలను పరిరక్షించడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి ఫలితంగా అసోం విధానసభలో గిరిజనుల కోసం 5 స్థానాలు రిజర్వు చేయబడ్డాయి. భీంబర్ వృత్తిరీత్యా సమర్థవంతమైన న్యాయవాది. ఆయన విలాసవంతమైన నగర జీవితాన్ని అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ, స్వార్థ ప్రయోజనాలను పక్కనబెట్టి గిరిజనవర్గాల స్వాతంత్య్రం కోసం పని చేయాలని నిర్ణయించుకున్నారు. అతను తన ప్రజల కోసం, భూమి కోసం పోరాటం చేసిన వారికి భూ ఆదాయాన్ని అందజేయడానికి 1933లో ‘అసోం బ్యాక్ వర్డ్ ప్లెయిన్స్ ట్రైబల్ లీగ్’ని స్థాపించి దాని వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా పని చేశారు.
స్వాతంత్యం అతని రక్తంలో ఉంది. అతని హృదయం, మనస్సు, దూరదృష్టి తోటి గిరిజనుల భవిష్యత్తును అర్ధం చేసుకోవడానికి అతనికి సహాయపడింది. ఆక్రమణకు వ్యతిరేకంగా స్వేచ్ఛ, ప్రత్యేక మాతృభూమి కోసం 1945, మార్చి 2123 మధ్య ‘ఖాసీ దర్బార్ హాల్ తీర్మానాలు’ ఏర్పాటు చేశారు. ఈ తీర్మానాలలో వివిధ గిరిజన తెగలకు చెందిన స్థానిక నాయకులు స్వతంత్ర మాతృభూమిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. ఆయన దృష్టి ఎల్లవేళలా అట్టడుగువర్గాల సంక్షేమంపై ఉండేది. భీంబర్ కారణంగానే గిరిజన సమాజం సంఘటితమైనదని చెప్పవచ్చు. అసోంను పాకిస్తాన్‌లో విలీనం చేయాలనే సాదుల్లా నిగూఢమైన ఉద్దేశానికి భీంబర్ వ్యతిరేకం.
ఈయన అసోంలో ముస్లిం చొరబాట్లను, దానివల్ల వచ్చే పరిణామాలను ముందుగానే పసిగట్టారు. 1947లో భారత్ పాక్ మధ్య బ్రిటిషు వారు రేఖ గీశారు. ఆ ముళ్లతీగ ప్రజల రక్తంతో ఎర్రబడింది. లక్షలాది మంది విధి మార్చబడింది. ఒక కాగితంపై ఒక గీతతో చాలా మంది బతుకులు నాశనం చేయబడ్డాయి. ఈ పరిస్థితిలో అసోంతోపాటు దేశభవిష్యత్తుకు కూడా పెనుప్రమాదం ఏర్పడింది. బ్రిటిష్ వైస్రాయ్ అసోంను పాకిస్తాన్‌లో చేర్చాలనే ప్రణాళికను రచించాడు. భీంబర్ ఈ కుట్రలను తిప్పికొట్టారు. భీంబర్ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ బ్రిటిష్ అధికారాన్ని సవాలు చేశారు. దౌత్యవ్యూహాల ద్వారా అసోం భారతదేశంలో భాగంగా ఉండేలా కాపాడుకున్నారు.
అతని జట్టు కృషితో అసోం ‘ప్రావిన్స్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’లో చేర్చబడింది. గిరిజనుల్లో అత్యంత సమర్థుడైన వ్యక్తిగా పరిగణించబడుతున్న భీంబర్ డియోరిని రాజ్యాంగ సభలో నియమించాలని కాంగ్రెస్ నాయకులను అభ్యర్థించారు. కానీ అది నెరవేరలేదు. దానికి బదులుగా 1946, జూలై 8న అసోం ప్రభుత్వంలో అటవీ, కార్మిక శాఖ మంత్రిగా నియమించబడ్డారు. స్వాతంత్య్ర పోరాటంలో భీంబర్ పాల్గొనడం స్పష్టంగా కనిపించడం కంటే అత్యంత ప్రభావవంతమైన పని చేశారు అని చెప్పవచ్చు. ఎందుకంటే అతను సరైన స్ఫూర్తి తో స్వరాజ్‌ని స్వీకరించడానికి ప్రజలను సన్నద్ధం చేయడంలో అవిరళంగా కృషి చేశారు. ఈ విధంగా సమాజహిత, దేశహిత కారకమైన పనులన్నీ ఆయన తన 44 సంవత్సరాల వయస్సులోనే చేశారు. అసోం ప్రజల హృదయాల్లో భీంబర్ డియోరి ఆదివాసీల నాయకుడిగానే గాక ఆదర్శ జననేతగా నిలిచిన ఆయన 1947 నవంబర్ 30న తనువు చాలించారు.
గుమ్మడి లక్ష్మీనారాయణ, 94913 18409
(నేడు భీంబర్ డియోరి జయంతి)