Monday, April 22, 2024

బిజెపి.. ఎలక్టోరల్ జేమ్స్‌బాండ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ఇప్పుడు తెలిసిన వివరాల ప్రకారం ఎలక్టోరల్ బాండ్స్ రూపేణా ఎక్కువ వాటాలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ (బిజెపి) అత్యధికంగా రూ 6986.5 కోట్ల మేర సొమ్మును ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా సంతరించుకుంది. రాజకీయ పార్టీలను సుంపన్నం చేసే విరాళాలు చందాల దందాలో ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్‌ది పెద్దవాటా అయింది. ఇప్పుడు అధికారికంగా ఏ సంస్థ ఎలక్టోరల్ బాండ్స్‌ను కొనుగోలు చేసిందనేది వెల్లడైంది. అంతకు ముందటి విరాళాల పద్ధతులకు భిన్నంగా 2018లో ఈ బాండ్స్ ప్రక్రియ ఆరంభం అయింది.

కాగా అప్పటి నుంచి చూస్తే బిజెపికి ఈ తరహాలో దక్కిన నగదు ఇతర పార్టీలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని ఇప్పుడు ఆదివారం ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం రూఢీ అయింది. ఇక బిజెపి తరువాత బెంగాల్‌లో అధికారంలో ఉన్న టిఎంసికి ఈ మార్గంలో దక్కిన మొత్తం రూ 1397 కోట్లు. కాగా కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచి రూ 1334 కోట్లు రాబట్టుకుంది.

ఇక తెలంగాణలో ఇటీవలి వరకూ అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌కు ఈ క్రమంలో దక్కిన వాటా రూ 1322 కోట్లు. ఇక ఎలక్టోరల్ బాండ్స్‌ను ఎందుకో ఏమో తెలియదు కానీ అత్యధిక సంఖ్యలో కొనుగోలు చేసింది ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ. కాగా ఈ సంస్థ తమిళనాడులోని అధికార డిఎంకెకు కట్టబెట్టిన బాండ్ల రూపం రూపాయల విలువ రూ 509 కోట్లు. సుప్రీంకోర్టు రూలింగ్ మేరకు ఇప్పుడు రద్దయిన ఈ బాండ్ల వివరాలు పూర్తి కథా కమామిషు ఇప్పుడు సవివరంగా క్రమేపీ వెలుగులోకి వస్తోంది. ఇక బిజెడికి ఈ బాండ్స్ క్రమంలో నాలుగవ స్థానంలో నిలిచింది. ఈ పార్టీకి రూ 944.5 కోట్లు. డిఎంకెకు రూ 656 కోట్లు. వైఎస్‌ఆర్‌సిపికి రూ 442 కోట్లు దక్కాయి. జెడిఎస్‌కు రూ 89 కోట్లు రాగా ఇందులో రూ 50 కోట్లు కేవలం మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ద్వారా అందాయి.

ఇక ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లలో ఈ మేఘా రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిలిచిన ఫ్యూచర్ గేమింగ్ లాటరీ కింగ్ సాంటియాగో మార్టిన్. ఓ దశలో సామాన్య కూలీ. కాలక్రమంలో ఆయన వ్యాపారాలలో చక్రం తిప్పి అత్యంత ఔదార్యంగా ఈ బాండ్స్ కొనుగోళ్లతో సత్తా చాటుకున్నారు. ఈ సంస్థ మొత్తం మీద రూ 1368 కోట్ల బాండ్స్ కొనుక్కుంది. వీటిలో ఎక్కువగా దాదాపుగా 37 శాతం వరకూ ఒక్క డిఎంకెకే దక్కింది. ఇక దక్షిణాదిలో బిజెపికి ఎంతకూ కొరుకుడుపడని పార్టీగా మారిన డిఎంకెకు ఈ బాండ్ల రూపంలో పలు కంపెనీల నుంచి భారీ స్థాయిలోనే విరాళాలు వచ్చిచేరాయి. వీటిలో మేఘా నుంచి రూ 105 కోట్లు, ఇండియా సిమెంట్స్ నుంచి రూ 14 కోట్లు, ఇక సన్ టీవీ నుంచి రూ 100 కోట్లు దక్కాయి. బాండ్స్‌లలో బిజెపి తరువాతి స్థానాన్ని మమత పార్టీ కొట్టేసింది.

డోనర్ల వివరాలు తెలిపింది కేవలం డిఎంకెనే

రాజకీయ పార్టీలలో ఒక్క డిఎంకెనే తమకు ఎవరి ద్వారా బాండ్ల రూపంలో ఇతరత్రా విరాళాలు అందాయనేది అందించింది. ఇతర పార్టీలు అంటే బిజెపి, కాంగ్రెస్, టిఎంసి, ఆప్ ఎన్నికల సంఘానికి ఈ వివరాలను ఇప్పటివరకూ అందించలేదు. దీనిపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన క్రమంలో ఎన్నికల సంఘం బహిర్గతం చేసిన పార్టీల విరాళాల ఫైలింగ్ ద్వారా ఏ పార్టీకి ఎంతెంత అందింది? ఎవరి ద్వారా అందింది? అనే వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.

కాగా చంద్రబాబు నాయుడు సారథ్యపు టిడిపికి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అందింది రూ 181.35 కోట్లు, ఆమ్ ఆద్మీపార్టీకి రూ 65 కోట్లు, శివసేనకు రూ 60 కోట్లు, ఆర్జేడీకి రూ 56 కోట్లు, ఎస్‌పికి రూ.14 కోట్లు రాగా అకాలీదళ్‌కు రూ 7.26 కోట్లు వచ్చాయి. అన్నాడిఎంకె అందుకున్న మొత్తం రూ.6 కోట్లు, అత్యల్పంగా నేషనల్ కాన్ఫరెన్స్‌కు అందింది కేవలం అరకోటి అంటే రూ.50 లక్షలు, ఇక సిపిఎం తెలిపిన వివరాల మేరకు వీరికి నిధులు ఈ బాండ్ల రూపంలో ఒక్క కానీ అందలేదు. మజ్లిస్, బిఎస్‌పిలు సంబంధిత విషయంలో ఎటువంటి రశీదులు పొందుపర్చలేదు. ఇక ఈ బాండ్స్ ద్వారా ప్రాంతీయ పార్టీలన్నింటికి కలిపి అందిన మొత్తం రూ.5221 కోట్లు అని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News