Wednesday, July 24, 2024

కువైట్ నుంచి భారత్‌కు చేరుకున్న 45 మృతదేహాలు

- Advertisement -
- Advertisement -

కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలు శుక్రవారం ఉదయం కోచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అనంతరం ఈ విమానం ఢిల్లీకి బయల్దేరి వెళ్లింది. ఐఎఎఫ్ సి-130 కువైట్ నుంచి బయల్దేరినట్లు కువైట్‌లోని భారతీయ ఎంబసీ ఎక్స్ వేదికగా తెలిపింది. మృతులలో 23 మంది కేరళీయులు ఉండగా తమిళనాడుకు చెందిన వారు ఏడుగురు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశాకు చెందినవారు ముగ్గురేసి ఉన్నారు. బీహార్, పంజాబ్, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానాకు చెందిన వారు ఒకరి చొప్పున ఉన్నారు. కోచ్చి, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు మృతదేహాలను అప్పగించారు. ఈ విమానంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉన్నారు. అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయు ల మృతదేహాలను త్వరితంగా భారతదేశానికి తరలించడం, గాయపడిన వారికి ఆసుపత్రులలో మెరుగైన చికిత్స అందచేలా కువైట్ ప్రభుత్వంతో సమన్వయం చేసేందుకు గురువారం సింగ్ కువైట్ చేరుకున్నారు.

అగ్ని ప్రమాదం సంభవించిన కువైట్‌లోని వసతి భవనంలో మొత్తం 176 మంది భారతీయ కార్మికులు ఉన్నారు. వీరిలో 23 మంది గాయపడి కువైట్‌లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. 45 మంది మరణించగా మిగిలిన వారంతా సురక్షితంగా ఉన్నట్లు భారతీయ ఎంబసీ తెలిపింది. కువైట్ చేరుకున్న సింగ్ అదాన్, ముబారక్, ఎలె కబీర్, జబేర్, కర్వానియాలోని ఐదు ఆసుపత్రులను సందర్శించి క్షతగాత్రులను పరామరశించారు. ఇలా ఉండగా..కోచ్చిలోని విమానాశ్రయం వద్ద కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విలేకరులతో మాట్లాడుతూ ప్రవాసులు కేరళ రాష్ట్రానికి జీవనాడి లాంటివారని, అగ్ని ప్రమాదంలో ఇంత భారీ సంఖ్యలో ప్రవాసులు మరణించడం దేశానికి అత్యంత నష్టదాయకమని అన్నారు. ఈ ఘటన మృతుల కుటుంబాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని, కువైటీ ప్రభుత్వం సత్వరమే స్పందించి పటిష్టమైన చర్యలు తీసుకుందని, భారత ప్రభుత్వం కూడా సకాలంలో జోక్యం చేసుకుందని ఆయన అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం లభించేందుకు కువైటీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కుటుంబ జీవనోపాధి కోసం వారంతా కువైట్ వెళ్లి అసువులు బాసారని, వారి కుటుంబాలకు సత్వరంగా నష్టపరిహారం అందేలా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవచూపాలని విజయన్ కోరారు. మతదేహాలను స్వీకరించేందుకు కోచ్చి విమానాశ్రయం చేరుకున్న కేంద్ర పర్యాటక, పెట్రోలియం శౠఖ సహాయ మంత్రి సురేష్ గోపి కూడా కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రవాసుల పట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఎనలేని గౌరవం ఉందని చెప్పారు. మృతదేహాలతో కూడిన పేటికలపై ముఖ్యమ్ంతరి విజయన్, సురేష్ గోపి పుస్సగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ విమానంలోనే ఉండిపోయారు. తమిళనాడు మైనారిటీల సంక్షేమం, ప్రవాస తమిళుల సంక్షేమ శాఖ మంత్రి జింజీ కెఎస్ మస్తాన్ కూడా కోచ్చి విమానాశ్రయంలో మృతులకు నివాళులర్పించారు. మృతులకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కాగా..31 మృతదేహాలను కోచ్చి విమానాశ్రంలో అందచేసిన అనంతరం మిగిలిన 10 మంది మృతదేహాలతో విమానం ఢిల్లీకి బయల్దేరి వెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News