సుప్రీంకోర్టు స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తోందని మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం మాజీ ఎమ్మెల్యే పి .శశిధర్ రెడ్డి , బిఆర్‌ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు సి.కళ్యాణ్‌రావు, లలితరెడ్డి తదతరులతో కలసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం కర్ణాటక ,మహారాష్ట్ర సిఎంలు సమావేశాలు పెట్టుకున్నారన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ 2013లో ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తీర్పు ఫై ఆందోళనలు వ్యక్తమయ్యాయని గుర్తు చేశారు. ఆందోళనల నేపథ్యంలో అప్పటి ఎపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్ పి వేస్తే ట్రిబ్యునల్ తీర్పుపై స్టే వచ్చిందని, 2014లో ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు స్టే కొనసాగించేలా చర్యలు చేపట్టిందని తెలిపారు.
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు విస్తరణ కోసం లక్షా 33 వేల ఎకరాల భూసేకరణ చేయాలని మంత్రి వర్గ సమావేశంలో బుధవారం నిర్ణయించిందన్నారు.ఈ భూసేకరణ కోసం రెండేళ్లలో 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని కర్ణాటక లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కర్ణాటక ఆలమట్టిపై నిర్ణయం తీసుకుని రెండు రోజులు అవుతున్నా సిఎం రేవంత్ రెడ్డి ఇంకా స్పందించలేదన్నారు. సుప్రీం కోర్టు స్టే పెండింగ్‌లో ఉండగానే కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచడానికి తీసుకున్న నిర్ణయంపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదిలో ఒక్క నీటి చుక్క ను వదలుకోమని ఇటీవలే సిఎం రేవంత్ రెడ్డి ఓ సమీక్ష సమావేశంలో చెప్పారని గుర్తు చేశారు. మరి కర్ణాటక అక్రమంగా ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కర్ణాటక నిర్ణయంపై స్పందించారన్నారు.
ఆల్మట్ట్టి ఎత్తు పెంచితే తమ రాష్ట్రంలోని రెండు జిల్లాలు సాంగ్లీ ,కొల్హాపూర్ జిల్లాల్లో ముంపు ఉంటుందని మహారాష్ట్ర సిఎం ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఆల్మట్ట్టి ఎత్తు పెంపును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని అడ్డుకుని తీరుతామని ఫడ్నవీస్ హెచ్చరించారన్నారు. కెసిఆర్‌పై ద్వేషమే తప్ప రేవంత్ రెడ్డికి కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం చేయాలని లేదన్నారు. కెసిఆర్ పట్టుదలతోనే సెక్షన్ 3 ప్రకారం కృష్ణా ట్రిబ్యునల్‌లో వాదనలు జరుగుతున్నాయన్నారు. కెసిఆర్ కృష్ణా ట్రిబ్యునల్ కోసం 33 లేఖలు కేంద్ర ప్రభుత్వానికి రాశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తగ్గించారని కెసిఆర్‌పై
రేవంత్ రెడ్డి పదే పదే నిందలు వేస్తున్నారన్నారు. బుధవారం కూడా సెప్టెంబర్ 17 వేడుకల ప్రసంగంలోనూ కెసిఆర్‌పై రేవంత్‌రెడ్డి విషం చిమ్మారన్నారు. తెలంగాణ ఏర్పడ్డ నెల రోజులకే కెసిఆర్ కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం లేఖ రాశారని గుర్తు చేశారు.కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటును మహారాష్ట్ర కర్ణాటక వ్యతిరేకించినా కెసిఆర్ మాటనే చివరకు నెగ్గిందన్నారు. కెసిఆర్‌పై నిందలు మాని ఆలమట్టిపై కర్ణాటక దూకుడును రేవంత్‌రెడ్డి అడ్డుకోవాలన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారా? రేవంత్ రెడ్డి ఆల్మట్ట్టి ఎత్తు పెంపునకు ఒప్పుకున్నారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సుప్రీం కోర్టులో కర్ణాటకకు వ్యతిరేకంగా కంటెంప్ట్ పిటిషన్ వేయాలని సూచించారు. ఆలమట్టి ఎత్తు పెరిగితే తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని డిమాండ్ చేశారు.
కెసిఆర్ కృషి లేకుండానే కృష్ణా ట్రబ్యునల్ వచ్చిందా?
బిఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్
299 టిఎంసిలు తెలంగాణకు, 511 టిఎంసిలు ఎపికి అనే ఒప్పందం తెచ్చింది ఉమ్మడి ఎపిలో కాంగ్రెస్ ప్రభుత్వమేనని బిఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ అన్నారు. 299 టిఎంసిలకు కెసిఆర్ ఒప్పుకున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఉమ్మడి ఎపిలో తెలంగాణకు క్రిష్ణా నీళ్లు 100 టిఎంసిలకు మించి రాలేదన్నారు. కాంగ్రెస్ తరతరాలుగా తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు. పునర్విభజన చట్టంలో పెన్నా డెల్టాకు తీసుకువెళ్లిన నీటిని రెగ్యులరైజ్ చేశారని వెల్లడించారు. కెసిఆర్ హయాంలో 28 సమావేశాలు పెట్టారన్నారు. కెసిఆర్ కృషి లేకుండానే కృష్ణా ట్రబ్యునల్ వచ్చిందా? అని ప్రశ్నించారు.
ALso Read: శబరిమలలో బంగారం మాయం