Friday, July 19, 2024

సకాలంలో బిఆర్‌ఎస్ శంఖారావం

- Advertisement -
- Advertisement -

జాతీయ రాజకీయాలు అద్భుతమైన మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి సారథ్యంలో భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ అవతరించి రానున్న ఎన్నికల్లో వివిధ పార్టీలకు మేల్కొలుపుగా శంఖారావాన్ని పూరించింది. మతోన్మాదంతో, నియంతృత్వ పోకడలతో, విద్వేష రాజకీయాలతో సర్పంలా బలిసిన భారతీయ జనతా పార్టీని 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా మట్టి కరిపించాలన్న దీక్షతోనే బిఆర్‌ఎస్ పుట్టుకొచ్చింది. దీంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యే చరిత్రాత్మక పరిణామం సంతరించుకోగలదన్న ఆశ కలుగుతోంది.

కొన్ని నెలలుగా కెసిఆర్ ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాభిప్రాయాలను తెలుసుకొంటున్నారు. బిజెపియేతర ప్రతిపక్షాలతో చర్చలు జరుపుతున్నారు. ఇవన్నీ సానుకూల సంకేతాలు ఇవ్వడంతో ఇప్పుడు దేశ రాజధాని నడిబొడ్డున బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి తిరుగుబాటు బావుటా ఎగురవేయడం రాజకీయ చరిత్రలో చెప్పుకోదగిన ఘట్టం. కాషాయ పార్టీ విషనాలుకలతో దేశంలో విభజన, విచ్ఛిన్న ధోరణులు మితిమీరిపోతున్నాయి. కార్పొరేట్ సామ్రాజ్యం విస్తరించి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దాని గుప్పెటలోకి పోతోంది. దాంతో ఉన్న ఉద్యోగాలు ఊడి, నిరుద్యోగం అమాంతంగా పెరిగి, ప్రతి సామాన్య కుటుంబం దరిద్రంతో అల్లాడుతోంది. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో ప్రతిపక్ష మన్నదే దేశంలో ఉండకూడదన్న నియంతృత్వ హిట్లర్ లా ప్రధాని మోడీ తయారయ్యారు. ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా పాలనలో సాగుతున్న పెడ ధోరణులను ప్రశ్నించే వారిపై ఇడి, సిబిఐ, ఇన్‌కమ్ టాక్స్ వంటి సంస్థల దాడులను ఉసిగొల్పుతున్నారు.

ఇవన్నీ తీక్షణంగా పరిశీలించిన కెసిఆర్ బిఆర్‌ఎస్‌కు నాంది పలకడం చెప్పుకోదగిన పరిణామం. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బిజెపి విష కౌగిలి నుంచి కొన్ని నెలల క్రితమే బయటపడి నిరసన జెండా ఎగురవేశారు. ఆర్‌జెడితో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఆయనది అవకాశవాదమనే ముద్ర ఉంది. బిజెపి వ్యతిరేక శక్తులను కూడగడతానని ప్రకటించినా ఆ మేరకు ఇంకా సరైన అడుగులు ముందుకు పడడం లేదు. బెంగాల్ టైగర్‌గా పేరొందిన తృణమూల్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపిపై ఎంత వ్యతిరేకత చూపుతున్నా విపక్షాలను ఏకం చేసే ప్రయత్నంలో ఆమె కూడా వెనుకబడుతున్నారు. రాష్ట్రీయ జనతాదళ్, నేషనలిస్టు కాంగ్రెస్ వంటి పార్టీలు సరైన మార్గదర్శకత్వం కోసం చూస్తున్నాయి.

అందుకే బిఆర్‌ఎస్ ఆవిర్భావాన్ని ఆ పార్టీలన్నీ సమర్ధిస్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఉద్యమాల్లో పాలుపంచుకోడానికి ముందుకు వస్తున్నాయి. జాతీయ ప్రతిపక్షంగా కాంగ్రెస్ గట్టి పాత్రను పోషించలేకపోతోంది. ఈలోటు భర్తీ చేయవలసిన అవసరం ప్రాంతీయ పార్టీలపై ఉండడంతో ఇప్పుడు కెసిఆర్ చేపట్టిన బిఆర్‌ఎస్ సరైన సమయంలో తీసుకున్న చర్యే అన్న ఆలోచన ప్రజలకు కలుగుతోంది. మోడీ పాలనలో దేశంలో విదేషం, విధ్వంసం, వినాశనం తప్ప మరేమీ కనిపించడం లేదు. దేశ జనాభాలో 88 శాతం మంది అంటే 80 కోట్లకు మించి 35 ఏళ్ల లోపు వయసు వారే. అలాగే జనాభాలో 40 శాతం మంది 13 నుంచి 35 ఏళ్ల వారే. ఇంతటి యువశక్తి ఉన్నా దేశం నీరసించి నీరుగారిపోతోంది.

యువతకు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ ఎండమావిగా మారింది. దేశంలో ఆకలి పెరుగుతోంది. ఈ ఏడాది 121 దేశాల ఆకలి జాబితాలో మనం 107వ స్థానంలో ఉన్నామంటే దేశం ఏ పరిస్థితిలో ఉందో తెలుస్తుంది. బిజెపి పాలనకు ముందు అప్పటి పాలకులు 48 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయగా, మోడీ ప్రభుత్వంలోకి వచ్చి గత ఎనిమిదేళ్లలో లక్షల కోట్ల అప్పులు చేసినట్టు నివేదికలు చెబుతున్నా యి. ఈ డబ్బంతా ప్రజలకు ఎంతవరకు ప్రయోజనం కలిగించిందో ఆలోచించాల్సిందే.మైనార్టీలపైకి మెజార్టీ మతస్థులను ఉసిగొలుపుతున్నారు. ప్రధాని మోడీ సమయం వచ్చినప్పుడు, నీతి చంద్రికలు చెబుతుంటారు. భారతదేశం ప్రజాస్వామ్య జన్మస్థలమని, మన భిన్నత్వమే మన బలం అని, భిన్న వర్గాల ప్రజలను కలిపి ఉంచుతున్న దేశభక్తే భారత్‌ను దృఢంగా ఉంచుతోందని, ఈదేశం సదాశయ సంపన్న దేశమని, ఇక్కడ మార్పులు సంఘ చైతన్యంతో ఆవిష్కృతమవుతాయని ఇలా ఏవేవో పలుకులు పలుకుతుంటారు.

కానీ మహారాష్ట్రలో, గోవాలో ఇలా తొమ్మిది రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులకు, అభ్యర్థులను డబ్బుమూట చూపి కొనుగోళ్లు చేయడం ఎవరి వల్ల జరిగిందో ఇంకా ఎలా జరుగుతోందో మనకు అనుభవాలే. తెలంగాణలో ఎమ్‌ఎల్‌ఎలకు ఎరవేయడం, అది రచ్చకెక్కడం, న్యాయస్థానం వరకు వెళ్లడం తెలిసిందే. మొన్నటికి మొన్న మేఘాలయలో నలుగురు ఎమ్‌ఎల్‌ఎలను బిజెపి తన పార్టీలోకి చేర్చుకుని సంబరపడుతోంది. అక్కడ ఒకటి రెండు స్థానాలతో ఉన్న బిజెపి బలం పెంచుకోడానికి ఇది నాంది అని చెబుతోంది. ఫిబ్రవరిలో మేఘాలయ ఎన్నికల నాటికి బిజెపి బలంతో పడగవిప్పి అధికారం చేజిక్కించుకోవాలన్న తాపత్రయంతో పావులు కదుపుతోం ది. తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో టిఆర్‌ఎస్ ప్రభు త్వం ఎంతగా ప్రజాప్రయోజన కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే అగ్రగామిగా కీర్తి వహించిందో తెలిసిందే.

CEC Decide to Change party name TRS to BRS

కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు చేపట్టి వ్యవసాయాన్ని విస్తరింపచేసింది. అన్నమో రామచంద్రా అంటూ పొట్టచేతపట్టుకుని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలసలు పోయే పరిస్థితిని తప్పించింది. దళిత బంధు, రైతుబంధు వంటి పథకాలతో ప్రజలకు ఆసరా కల్పించింది. మత ఘర్షణలకు తావు లేని విధంగా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పింది. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశమంతా ఇలాంటి సామరస్య, ప్రశాంత వాతావరణం నెలకొనాలని, అన్నిరంగాల్లో ప్రగతి పథంతో దేశం ముందు కు వెళ్లాలన్నదే కెసిఆర్ లక్షం. ఆమరణ దీక్షతో తెలంగాణను ఎలా సాధించ గలిగారో అలాగే మోడీ ప్రభుత్వ విష సంకెళ్ల నుంచి భారత దేశాన్ని విముక్తి చేయాలన్న దీక్షా కంకణాన్ని కెసిఆర్ కట్టుకున్నారు. పార్టీల సిద్ధాంతాలకు, స్వప్రయోజనాలకు అతీతంగా ఆవిర్భవించిన బిఆర్‌ఎస్ అనే మహా సంస్థకు వివిధ పార్టీలు మద్దతు ఇచ్చి మరింత బలోపేతం చేయవలసి ఉంది. చలిచీమల సమష్టి బలంతో విష సర్పం ఎలా చచ్చిందో అదే విధంగా బిజెపియేతర పార్టీలన్నీ సమష్టిగా కెసిఆర్ సారథ్యంలో ముందుకు వెళ్తే 2024 ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం కుప్పకూలడం ఏమంత కష్టం కాదు.

పి.వెంకటేశం
9985725591

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News