Thursday, March 28, 2024

ఇంత కక్షా?

- Advertisement -
- Advertisement -

రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీసుకొన్న చర్య దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ప్రతిపక్షంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మోపిన ఉక్కు పాదానికి ఈ చర్య నిదర్శనం కాగా, అదే సమయంలో ప్రతిపక్షాలు మరింత సంఘటితం కావడానికి ఇది దారి తీసింది. మోడీ ఇంటి పేరు గల వారు దొంగలంటూ 2019లో కర్నాటక ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యానించినందుకు దాఖలైన పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు గురువారం నాడు రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ళ జైలు శిక్ష ఇంకా అమల్లోకి రాకముందే ఈ చర్య తీసుకోడంలోని నిరంకుశత్వం దేశ ప్రజలందరూ ఖండించదగినది. శిక్ష విధించిన కోర్టు దాని అమలును నెల రోజుల పాటు వాయిదా వేస్తూ పై కోర్టులో అప్పీలు చేసుకొనే అవకాశాన్ని రాహుల్ గాంధీకి కల్పించింది. రెండేళ్ళకు తక్కువ కాకుండా శిక్ష పడిన వారి పార్లమెంటు లేదా శాసన సభ్యత్వాల రద్దుకు ప్రజాప్రాతినిధ్య చట్టం అవకాశం కల్పిస్తున్నప్పటికీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానిని అమలులోకి తేవడంలో మోడీ ప్రభుత్వ అక్కసు స్పష్టంగా వెల్లడవుతున్నది. గుజరాత్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంస్థల అతి పెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటు (జెపిసి) సంఘాన్ని నియమించాలనే డిమాండ్‌తో ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింప చేస్తున్న సమయంలో తీసుకొన్న ఈ చర్య విపక్షం గొంతు నొక్కడానికి ఉద్దేశించిందేనని వెల్లడవుతున్నది.

అప్పీలు కోర్టులో రాహుల్‌కు ఊరట లభించే అవకాశాలున్నాయేమో వేచి చూడకుండా వెంటనే అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ ఖండించదగినది. కేవలం పరువు నష్టం కేసే ఇది, అవినీతికి సంబంధించింది కాదు. ప్రధాని మోడీ, గౌతమ్ అదానీ మధ్య గల సాన్నిహిత్యం ప్రపంచానికంతటికీ తెలిసినదే. అదానీ స్టాక్ మార్కెట్‌ను మోసం చేసి తన సంస్థల షేర్ల విలువలను విశేషంగా పెంచుకోడం ద్వారా సాధారణ మదుపరులను భారీగా దోచుకొన్నట్టు తేలిన తర్వాత ఆ మొత్తం మోసం వెనుక ప్రధాని మోడీ హస్తం కూడా వుందని ఆరోపిస్తూ వారిద్దరూ కలిసి వున్న ఫోటోను రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రదర్శించారు. రాహుల్ ఇటీవల లండన్‌లో ప్రసంగిస్తూ భారత ప్రజాస్వామ్యానికి గడ్డు కాలం దాపురించిందని చేసిన వ్యాఖ్యల పట్ల ప్రధాని మోడీ, భారతీయ జనతా పార్టీ తీవ్ర అసంతృప్తిగా వున్న విషయం విదితమే. అందుచేత దేశ పాలకులు ప్రతిపక్షాన్ని, రాహుల్ గాంధీని చూసి గంగవెర్రులెత్తుతున్నారని రూఢి అవుతున్నది.

రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసిన రోజు చీకటి రోజని భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ పాలనలో దేశం ఎదుర్కొంటున్న దురవస్థను ఆయన గత కొంత కాలంగా చీల్చిచెండాడుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మాట్లాడుతూ ప్రధాని మోడీ నవ భారతంలో ప్రతిపక్ష నేతలపై పాలక బిజెపి కక్ష వహించిందని, అదే సమయంలో సొంత పార్టీలోని నేర చరిత్రులకు మంత్రి పదవులు కూడా కట్టబెడుతున్నారని అన్నారు. దేశంలో రాజ్యాంగ విహిత ప్రజాస్వామ్యం మరింత లోతులకు పతనమైపోయిందని అభిప్రాయపడ్డారు. మనం బంధిత ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామని ఉద్ధవ్ థాక్రేకి చెందిన శివసేన వ్యాఖ్యానించింది. ఇది ప్రజాస్వామ్యంపై బిజెపి పాలకులు జరిపిన సర్జికల్ దాడి అని సిపిఐ(ఎంఎల్) అభిప్రాయపడింది. ఇంకా సిపిఐ పార్టీ, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, రాజస్తాన్ తదితర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మున్నగు వారు రాహుల్‌పై అనర్హత వేటును తీవ్రంగా విమర్శించారు.

దాదాపు ప్రతిపక్షమంతా ఒక్క త్రాటి మీదికి వచ్చిన దృశ్యం కళ్ళకు కట్టింది. అంతా కలిసి దేశ ప్రజాస్వామ్యానికి బిజెపి నిరంకుశత్వం నుంచి విమోచన కలిగిస్తామని ప్రతినపూనినట్టు అనిపించింది. అదానీ ఉదంతంపై జెపిసిని డిమాండ్ చేస్తున్నా ఫలితం లేని నేపథ్యంలో రాహుల్ గాంధీపై పడిన వేటు విపక్షాన్ని కొత్త పుంతలు తొక్కించవచ్చుననే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. మొత్తం ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులందరూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడగల అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు ఇంకా ఏడాదికిపైగా దూరంలో వున్నప్పటికీ వాటికి రంగం ఇప్పుడే సిద్ధపడినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల మధ్య మెరుగైన సాన్నిహిత్యానికి అవకాశాలు చిక్కబడినట్టు అనిపిస్తే ఆక్షేపించవలసిన పని లేదు. అధికారంలో వున్న వారు ప్రతిపక్షాన్ని అణచివేసే కొద్దీ అది మరింత బలమైన శక్తిగా రూపొందుతుంది. ఆ విధంగా పాలక పక్షాలు తమ కష్టాలను తామే కొనితెచ్చుకొంటాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడానికి అనూహ్యమైన తొందరపాటును ప్రదర్శించడం ద్వారా బిజెపి ఇటువంటి సంకట స్థితిలోకి తనను తాను నెట్టుకొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News