కొచ్చి: ప్రముఖ మలయాళ నటుడు, ప్రేమమ్ చిత్ర కథానాయకుడు నివిన్ పాలీపై అత్యాచార కేసు నమోదైంది. ఏడాది క్రితం దుబాయ్‌లో తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక 40 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు నివిన్ పాలీపై మంగళవారం కేసు నమోదు చేశారు. ఐపిసిలోని సెక్షన్ 376 కింద నివిన్ పాలీపై ఊనుకల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఒక మహిళతోసహా ఆరుగురు నిందితులు ఉన్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. దుబాయ్‌లో ఏడాది క్రితం తనపై లైంగిక దాడి జరిగినట్లు ఒక మహిళ ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.
ఈ కేసులో మొదటి నిందితురాలు ఒక మహిళ కాగా నివిన్ పాలీ ఆరవ నిందితుడని ఆయన తెలిపారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళా నటులపై లైంగిక దాడులు, వేధింపులపై దర్యాప్తు జరిపిన జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెలుగుచూసిన తర్వాత మీటూ ఉద్యమం కేరళలో రాజుకుంది. పలువురు నటీమణులు తమపై లైంగిక దాడి జరిగిందంటూ ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతలపై ఫిర్యాదులు చేశారు. పలువురిపై కేసులు నమోదయ్యాయి.