Saturday, September 14, 2024

ప్రవళిక మిత్రుడిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం

శివరాం నిత్యం ఫోన్లు చేసి వేధించే వాడు

ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది
రాజకీయ పార్టీలు మావద్దకు రావొద్దు
ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్ ప్రకటన

మన తెలంగాణ/సిటీబ్యూరో: ప్రేమించి మోసం చేయడంతో ఉరివేసుకున్న ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక మిత్రుడిపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై చిక్కడపల్లి పోలీసులు ఐపిసి 417, 420, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రవళిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఆధారాలు సేకరించారు. కొన్ని ఆధారాలను ప్రవళిక తల్లిదండ్రులు పోలీసులకు ఇవ్వడంతో కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
వరంగల్ జిల్లా, బిక్కాజీపల్లికి చెందిన ప్రవళిక అశోక్‌నగర్‌లోని బృందావన్ గల్స్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలోనే 12వ తేదీన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ప్రవళిక పోటీ పరీక్షలు వాయిదా పడడం వల్లే ఆత్మహత్య చేసుకుందని నిరుద్యోగులు పెద్దఎత్తున అశోక్‌నగర్‌లో ఆందోళనకు దిగారు. దీంతో అర్ధరాత్రి వరకు ప్రవళిక మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించలేదు. ప్రవళిక మృ తిపై పలు విమర్శలు రావడంతో సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి ప్రవళిక ఎలాంటి పోటీ పరీక్షలకు అప్లై చేయలేదని, ప్రేమికుడు మోసం చేయడం వల్లే మృతి చెందిందని తెలిపారు. అసలు ప్రవళిక టిఎస్‌పిఎస్‌సిలో ఎలాంటి ఉద్యోగానికి దరఖాస్తు చేయలేదని చెప్పారు.

ఈ క్రమంలోనే ప్రవళిక తల్లి, సోదరుడు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రవళిక తల్లి విజయ మాట్లాడుతూ రెండు ఏళ్ల నుంచి తన కూతురు, కుమారుడు హైదరాబాద్‌లో ఉండి చదువుకుంటున్నారని తెలిపారు. భార్యాభర్తలం కష్టపడి పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటున్నామని తెలిపారు. మా కష్టం తమ పిల్లలకు రావద్దని వారిని ఉన్నత చదువులు చదివించామని తెలిపారు. కానీ తమ కూతురిని శివరాం అనే యువకుడు వేధింపులకు గురిచేశాడని తెలిపారు. వాడి టార్చర్ భరించలేక మా అమ్మాయి కనీసం మాతో కూడా చెప్పుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. తన బిడ్డ చావుకు కారణమైన వాడిని కఠినంగా శిక్షించాలని, బయటకు రాకుండా చేయాలని కోరారు. తన కూతురు పడ్డ కష్టం వేరేవారికి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల పరంగా ఏమైనా గోడవలు ఉంటే వారు చూసుకోవాలని, అంతేకానీ తమ కుటుంబాన్ని అందులోకి లాగవద్దని ప్రాదేయపడ్డారు. ప్రవళిక తమ్ముడు ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ తమ అక్క ఆత్మహత్యకు శివరామే కారణమని ఆరోపించాడు.

తమకు న్యాయం జరగాలంటే శివరాంను శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్క హాస్టల్‌కు కొద్ది దూరంలోనే తాను హాస్టల్‌లో ఉంటానని, వారానికి మూడు, నాలుగుసార్లు కలిసి మాట్లాడుకుంటామని తెలిపారు. వేరే యువతి ద్వారా శివరాం తన అక్కకు పరిచయం అయ్యాడని, అప్పటి నుంచి అక్కకి ఇష్టం లేకపోయిన తనతో మాట్లాడడం, కాల్ చెయ్యడం, హాస్టల్‌కు వచ్చి అందరి ముందు మాట్లాడమని ఇబ్బంది పెట్టడం చేశాడని తెలిపారు. ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల అమ్మకు, నాన్నకు, తనకు చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

అక్క హాస్టల్ దగ్గరికి వెళ్లి ఏడిపించడం, కాల్స్ చేయడం, ఫ్రెండ్స్ ఫోన్ నుంచి, వేరే వేరే నంబర్ల నుంచి ఫోన్ చేసి శివరాం వేధించాడని, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. అక్కకి న్యాయం జరగాలంటే శివరాం ఎక్కడ ఉన్నా పట్టుకుని ఉరి లేదా ఎన్‌కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం వల్లే తమ సోదరి మృతిచెందిందని అంటున్నారని అలా జరగలేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News