Friday, May 3, 2024

ప్రగతికి శిక్ష?

- Advertisement -
- Advertisement -

ఒక రాష్ట్ర జన సంఖ్యను బట్టి లోక్‌సభలో దాని స్థానాల సంఖ్య వుండాలని రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతి మంచికి శిక్ష, చెడుకి బహుమతి లభించేలా చేస్తున్నది. ప్రతి ఒక్క జనాభా లెక్కల సేకరణ అనంతరం చట్ట సభల్లో రాష్ట్రాల స్థానాల సంఖ్యను కొత్తగా నిర్ధారించాలని పెట్టుకొన్న నియమం జన సంఖ్యను నియంత్రించుకోడం ద్వారా ప్రగతి శిఖరాలను త్వరగా అందుకొనేందుకు చిత్తశుద్ధితో కృషి చేసే రాష్ట్రాల పాలిట శాపమైంది. ప్రధాని మోడీ ప్రభుత్వం లోక్‌సభలోనూ, రాష్ట్రాల శాసన సభల్లోనూ మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకు వచ్చిన నేపథ్యంలో నియోజకవర్గాల పునర్వవస్థీకరణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ రిజర్వేషన్లను ప్రస్తుత లోక్‌సభ స్థానాలను బట్టి కాకుండా కొత్తగా సేకరించే జనాభా లెక్కల ప్రకారం జరిగే పునర్వవస్థీకరణ వల్ల పెరగగల లోక్‌సభ సభ స్థానాల ఆధారంగా ఇవ్వాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. 2021లో జరిగి వుండవలసిన జనాభా లెక్కల సేకరణ ఆ ఏడాది విరుచుకుపడిన కోవిడ్ కారణంగా వాయిదా పడి అది ఇప్పటికీ ఆచరణకు నోచుకోడం లేదు. ఇది జరిగిన తర్వాత గాని నియోజకవర్గాల పునర్వవస్థీకరణకు అవకాశం కలగదు.

పునర్వవస్థీకరణ మామూలుగా, అనుకొన్న ప్రకారం 2026లో చేపట్టదలచుకొంటే ఆలోగానే జనాభా లెక్కల సేకరణ జరిగిపోవాలి. అయితే లోక్‌సభలో ప్రస్తుతమున్న స్థానాల సంఖ్య 1971 జనాభా లెక్కల ప్రాతిపదికగా నిర్ధారణ అయింది. నియోజకవర్గాల పునర్వవస్థీకరణను 2001 జనాభా లెక్కల సేకరణ జరిగే వరకు స్తంభిపం చేస్తూ 1976లో ఎమెర్జన్సీ కాలంలో ఇందిరా గాంధీ నిర్ణయం తీసుకొన్నారు. ఆ పరిధులను 2026 తర్వాత జరగబోయే మొదటి జనాభా లెక్కల వరకు పొడిగిస్తూ 2001లో 84వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారు. దీనిని అనుసరించక తప్పని పరిస్థితుల్లో లోక్‌సభలో మహిళల కోటా ఆ తర్వాత గాని అనుభవంలోకి రాకపోయే ప్రమాదమున్నది. అంటే 2031లో నియోజకవర్గాల పరిధుల పునర్నిర్ణయం జరిగితే ఆ తదుపరి ఎన్నికల నాటికి గాని మహిళల కోటా వారి అనుభవంలోకి వచ్చే అవకాశం లేకపోయే పరిస్థితి కనుపిస్తున్నది. ఆ విధంగా నియోజకవర్గాల పునర్వవస్థీకరణ నిరవధికంగా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అవి ఎప్పుడు జరిగినప్పటికీ అప్పటికుండే జన సంఖ్యే ఆయా రాష్ట్రాల లోక్‌సభ స్థానాలను నిర్ణయిస్తుందనేది ప్రగతిశీల రాష్ట్రాల నెత్తిన పిడుగుపాటును తలపిస్తున్నది.

2026లో పునర్వ్యవస్థీకరణ చేపట్టడానికి కేంద్రం సంకల్పించే సూచనలు కనిపిస్తున్నందున అప్పటికుండే జనాభా ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లోక్‌సభ స్థానాలు ఇప్పుడున్న 42 నుంచి 34కి తగ్గిపోతాయని వాషింగ్టన్‌లోని కార్నెగీ ఎండోమెంట్ సంస్థ ఇటీవలనే ప్రకటించింది. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రం మూడు నుంచి నాలుగు లోక్‌సభ స్థానాలు కోల్పోనున్నదని బోధపడుతున్నది. దీని పట్ల బిఆర్‌ఎస్ ఉపాధ్యక్షులు, రాష్ట్ర మంత్రి కెటిఆర్ తీవ్రంగా స్పందించడం సముచితంగా వుంది. జనాభా పెరుగుదల నియంత్రణలోనే కాకుండా మానవాభివృద్ధి సూచీలోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయని, స్థూల దేశీయ ఉత్పత్తిలో 35% మేరకు ఇక్కడి నుంచే వెడుతున్నదని అటువంటి దక్షిణాదికి లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గించడం, అపరిమిత జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాలకు పెంచడం కంటే అన్యాయం మరొకటి వుండదని ఆయన అన్నారు. గతంలో 1971 జనాభా లెక్కల ప్రకారం గల లోక్‌సభ స్థానాలను కేంద్రం స్తంభింప చేసిందని, అదే పద్ధతిని కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్ సూచించారు.

తెలంగాణ వంటి ప్రగతి రాష్ట్రాన్ని లోక్‌సభ స్థానాలను తగ్గించడం ద్వారా శిక్షించడం ఎంత మాత్రం తగదని ఆయన అన్నారు. జనాభా నియంత్రణ మానవ సమాజ పురోగతికి అత్యంత ఆవశ్యకమైన అంశం కాబట్టి అందులో సఫలమ-య్యే రాష్ట్రాలను తగు విధంగా సత్కరించడం న్యాయమవుతుంది. తన స్వప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని సవరించడానికి క్షణకాలం ఆలస్యం చేయని కేంద్ర పాలక పక్షం బిజెపి ఇటువంటి విషయాల్లో జరిగిన తప్పును సరిదిద్దుకోడానికి రాజ్యాంగాన్ని తగు విధంగా మార్చవచ్చు. జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాల లోక్‌సభ స్థానాలు పెరిగేలా చూసి విఫలమైన రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించడమే సమంజసంగా వుంటుంది. ఇటువంటి పరిష్కారాన్ని కనుగొనకుండా నియోజకవర్గాల పునర్వవస్థీకరణ జరిపితే ఉత్తరాది దక్షిణాదిల మధ్య అంతరాలు పెరగవచ్చు. అది జాతికి మేలు చేయదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News