Monday, April 29, 2024

అందరికీ తెలిసేలా సరళరీతిలో చట్టాలు: మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చట్టాలను సరళీకృత పద్థతిలో, భారతీయ భాషలలో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో యత్నిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.ఇంటర్నేషనల్ లాయర్స్ కాన్ఫరెన్స్‌ను శనివారం ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టాల అంతర్గల విషయాలు తేలిగ్గా అందరికీ తెలిసి ఉండాలి. సంక్లిష్ట రీతిలో చట్టాల వివరణ ఉంటే ఇది సామాన్యుడికి ఇబ్బంది కల్గిస్తుంది. కాగా ప్రాంతీయ భాషలు, భారతీయ భాషలన్నింటిలో చట్టాల రూపకల్పన లేకపోవడం చిరకాల సమస్యఅని దీనిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇది సాధారణ విషయం కాదని, చట్టాల గురించి ఆసాంతం తెలిసిన వారు, దీనిని ఇతరులకు వివరించే ప్రతిభ గలవారు తగు రీతిలో వీటిని ఆవిష్కరించాల్సి ఉందని చెప్పారు.

ఇప్పుడు నేరాల తీరు మరింతగా మారిపోతోంది. సైబర్ టెర్రరిజం, మనీలాండరింగ్, పైగా కృత్రిమ మేధ (ఎఐ) వంటివాటిని విధ్వంసకర విషయాలకు వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి కీలక విషయాలకు ప్రాంతీయ ఎల్లలు ఉండవు. సరిహద్దులు, దేశాల ఎల్లలు దాటుకుని సాగుతూ ఉంటాయి. వీటికి ప్రాంతీయ పరిధి ఉండదు. ముప్పు గ్లోబల్ అయినప్పుడు , వీటిని నివారించడం కూడా ఇదే పద్థతిలో ఉండాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రపంచ దేశాల మధ్య సమన్వయం , సహకారం అవసరం అన్నారు. కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, లార్డ్ ఛాన్సలర్ , బ్రిటన్ న్యాయశాఖ సహాయ మంత్రి అలెక్స్ చాక్ కెసి, భారత అటార్నీ జనరల్ ఇతరులు పాల్గొన్నారు.

విస్తారిత గ్లోబలైజైషన్ దశలో లాయర్లదే కీ ః సిజెఐ
ప్రపంచ విస్తారిత సంబంధాల నడుమ న్యాయవాద వృత్తికి, న్యాయ పంపిణీకి సంబంధించి పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు అధునాతనం అవుతోంది. దీనితో సంక్లిష్టమైన లీగల్ సమస్యలు తలెత్తుతున్నాయి. పలు మార్పుల నడుమ , మారుతున్న పరిస్థితుల నడుమ న్యాయవ్యవస్థ ద్వారా బాధ్యతాయుత న్యాయ పంపిణీ జరుగుతుంది. ఇందుకు జుడిషియరీ కీలక పాత్ర పోషిస్తుంది.

ఇందుకు అనుగుణంగానే చట్టం న్యాయం పరిరక్షణ విషయంలో లాయర్ల పాత్ర కూడా అంతే కీలకంగా ఉంటుందన్నారు. గ్లోబలైషన్ వేగాన్ని తట్టుకుంటూ మన న్యాయవ్యవస్థ ఇందులోని అంతర్భాగమైన న్యాయవాదుల వ్యవస్థ కూడా 1980 లేదా అంతకు ముందునుంచే అడుగుజాడలను మార్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచస్థాయి వేగాన్ని అందుకుంటూ , నేరవిస్తృతి పరిణామాలతో తలెత్తుతున్న సవాళ్లను ఎప్పటికప్పుడు తట్టుకుని నిలుస్తోందన్నారు.

కట్టుబాట్లులేకపోతే కష్టమే ః ఏజె
విస్తరించుకుని, అల్లుకుపోతున్న సామాజిక మాధ్యమం ఇప్పుడు రెండువైపుల పదునున్న ఆయుధం అయిందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తెలిపారు. ఈ మాధ్యమంతో ప్రపంచ అనుసంధానం అవుతోంది. అయితే నైతికతకు భంగం వాటిల్లుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండురోజుల ఇంటర్నేషనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ 2023 ప్రారంభోత్సవ సదస్సులో అటార్నీ జనరల్ శనివారం పాల్గొన్నారు. ఏదో విధంగా విషయ ప్రచారం జరగాలి. ఈ క్రమంలో అంతర్లీనంగా ఉండే నైతికతలను , వాటి అవసరాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక విషయాలపై ప్రభావం గురించి పక్కకు పెడితే న్యాయ పంపిణీ, న్యాయ ప్రక్రియపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఏ విధంగా పడుతోందనేది కీలకం అయిందన్నారు. సరిహద్దులు లేకుండా ప్రపంచమంతటా విస్తరించుకుని పోవడం సోషల్ మీడియా శక్తి. అయితే పాటించాల్సిన కట్టుబాట్లు దెబ్బతినడం అవలక్షణం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News