Thursday, September 18, 2025

సెంట్రల్ సాఫ్ట్ వేర్ వాడి ఓటర్లపేర్లు తొలగించారు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

కేంద్ర ఎన్నికల సంఘంపై లోక్ సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేందుకు పుష్కలంగా అవకాశం ఉన్న బలమైన నియోజకవర్గాలలో ఓటర్లను మూకుమ్మడిగా తొలగించారని ఆరోపించారు. ఇందుకు సాఫ్ట్ వేర్ ఉపయోగించి కేంద్రీకృత పద్ధతులలో దారుణాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఈ ఓటరు ఐడీలను వేరే రాష్ట్రాలలో నుంచి, నకిలీ లాగిన్ లు, ఫోన్ నెంబర్ లను ఉపయోగించి కుట్రపూరితంగా తొలగించారని రాహుల్ వెల్లడించారు. ఇందుకు తిరుగులేని రుజువులు ఉన్నాయన్నారు.
ఓట్ చోరీపై ఢిల్లీలో మీడియా సమావేశంలో చాలా విషయాల పై తన అవేదనను పంచుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఉద్దేశపూర్వకంగా నేరస్థులను కాపాడుతున్నారని కూడా ఆయన విమర్శించారు.

కర్ణాటక లోని అలంద్ నుంచీ కేస్ స్టడీలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, మైనారిటీలను ప్రత్యేకంగా లక్ష్యం చేసుకున్నారని రాహుల్ గాంధీ వివరించారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఈసిఐ అధికారికంగా ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. 2018 లో బీజేపీకి చెందిన సుభాద్ గుత్తేదార్ , 2023లో కాంగ్రెస్ కు చెందిన బిఆర్ పాటిల్ అలంద్ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.ఎన్నికల తర్వాత ఎన్నికలు జరుగుతుండగా, భారతదేశం అన్నిప్రాంతాలలోనూ, లక్షలాది మంది ఓటర్లను, వివిధ వర్గాలను, ప్రధానంగా ప్రతిపక్షాలకు ఓటు వేస్తున్న వర్గాలను తొలగించేందుకు ఓ క్ర మపద్ధతిలో టార్గెట్ చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు.ఇందుకు సంబంధించి 100 శాతం రుజువులను కనుగొన్నట్లు తెలిపారు.

తాను భారత దేశాన్ని, భారత రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నానని, ప్రజాస్వామ్య ప్రక్రియను ఇష్టపడుతున్నానని చెబుతూ, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవల్సిన బాధ్యత మనందరిమీద ఉందని పేర్కొన్నారు. ఇక ఎలా స్పందించాలన్నది మీరే నిర్ణయించుకోవాలని మీడియాను ఉద్దేశించిఅన్నారు. అలంద్ నియోజకవర్గంలో ఓ బూత్ స్థాయి అధికారి తన మామ ఓటును తొలగించిన విషయం కనుగొని, దానిపై దర్యాప్తు చేస్తున్నప్పుడు పొరుగువారి వల్ల ఓటు తొలగినట్లు తేలిందని, వారిని ప్రశ్నిస్తే, వారికీ తెలియదని చెప్పారని,రాహుల్ వివరించారు. వేరే ఏదో శక్తి ఈ ప్రక్రియను హైజాక్చేసి ఓటును తొలగించిందని రాహుల్ గాంధీ అన్నారు.

రాహుల్ ఆరోపణలు నిరాధారమైనవన్న ఎన్నికల కమిషన్

రాహులు గాంధీ చేసిన ఆరోపణలు తప్పు అనీ, నిరాధారమైనవని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఆయన తప్పుడు భావనలో ఉన్నారని, ఎవరూ ఆన్ లైన్ లో ఏ ఓటును తొలగించకూడదని, అలాగే బాధిత వ్యక్తి తన వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా ఎటువంటి తొలగింపు జరగబోదని కమిషన్ పేర్కొంది.

Also Read: సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News