Sunday, May 5, 2024

రైతన్నలకు గిట్టుబాటు

- Advertisement -
- Advertisement -

రైతన్నలకు గిట్టుబాటు
ఖరీఫ్ పంటలకు మరింత దన్ను
కనీస మద్దతు ధరల పెంపు
కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర
వరి ధాన్యానికి 10 శాతానికి పైగా హెచ్చింపు
ఇక నాణ్యమైన వడ్ల ధర క్వింటాలుకు 2183
పెసర కంది పంటలకు కూడా ఎక్కువ శాతం
న్యూఢిల్లీ: 2023-24 ఖరీఫ్ పంట కాలానికి పలు రకాల పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పి) కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సంబంధిత నిర్ణయానికి కేంద్రం ఆమోద ముద్ర తెలిపింది. ప్రత్యేకించి దక్షిణాది పంట వరిధాన్యానికి కనీస మద్దతు ధరలో దాదాపుగా 10.35 శాతం హెచ్చింపును ప్రకటించారు. వరిపంటకు క్వింటాలుకు రూ 143 పెంపుదలను ఖరారు చేసినట్లు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆ తరువాత ఆహార మంత్రి పియూష్ గోయల్ విలేకరులకు తెలిపారు. వరిపంటకు కనీస మద్దతు ధరను ఈ స్థాయిలో పెంచడం దశాబ్దంలో ఇది రెండోసారి అయింది. ఇప్పుడు జరిగిన పెంపుదలతో వరిపంట కనీస మద్దతు ధరలు ఇక క్వింటాలుకు రూ 2,183కు చేరుకుంటాయని మంత్రి వివరించారు. ఇంతకు ముందు 201819లో వరి మద్దతు ధరను క్వింటాలుకు రూ 200 వరకూ పెంచారు. ఇప్పుడు 202324 ఖరీఫ్ పంటలకు సంబంధించి ఎంఎస్‌పిని వివిధ రకాల ధాన్యాలను బట్టి 5.3 శాతం నుంచి గరిష్టంగా 10.35 శాతం వరకూ పెంచినట్లు మంత్రి తెలిపారు.

దీని మేరకు ఇప్పుడు పంటలను బట్టి పెరుగుదల క్వింటాలుకు రూ 128 నుంచి అత్యధికంగా రూ 805 వరకూ ఉంది. ఈ ఖరీఫ్ పంటకాలంలో సాగుబడిలో ఉండే అన్ని రకాల ఆమోదిత పంటలకు, అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకూ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో సేకరించే వాటికి ఈ హెచ్చింపు వర్తిస్తుందని గోయల్ తెలిపారు. ఇక ఈసారి దేశంలో అత్యధికంగా వినియోగంలో ఉండే పెసర పంటకు అత్యధికంగా మద్దతు ధరను పెంచారు. ఈసారి పెసరకు ఎంఎస్‌పిని 10.5 శాతం పెంచడంతో ఇంతకు ముందటి ధర రూ 7,755 ఉండగా ఇప్పుడు పెసర పంట ధర క్వింటాలుకు రూ 8,558కు చేరుకుంది. పప్పు ధాన్యాలలో పెసరకు ఇప్పుడు ధరలలో పెద్ద పీట వేశారు. ఓ వైపు దేశంలో టోకు ద్రవ్యోల్బణ స్థాయి పడిపోతున్న దశలోనే కనీస మద్దతు ధరలను భారీగా పెంచడం చాలా కీలక పరిణామమని, ప్రత్యేకించి దేశంలోని అన్నదాతలకు శుభవార్త అని మంత్రి తెలిపారు. ఇప్పుడు పెరిగే మద్దతు ధరలు ధాన్యాల వారిగా క్వింటాళ్ల చొప్పున మంత్రి వివరించారు.

పంటల ధరల పెంపు వివరాలు
హైబ్రిడ్ జొన్న పంట కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ 3180, జొన్న మాల్దండి రకం రూ 3225, రాగి రూ 3846, సజ్జలు రూ 2500 , మొక్కజొన్న రూ 2090, పొద్దుతిరుగుడు విత్తనాలు రూ 6760 ,వేరుశెనగా రూ 6377, సోయాబీన్ పసుపుపచ్చ రూ 4600 , పత్తి మధ్యస్థాయి సైజ్ రూ 6620, పత్తి పొడవు పింజ రూ 7020గా కనీస మద్దతు ధరలను ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ సాగు వ్యయాలు, ధరల కమిషన్ సిఫార్సుల ప్రాతిపదికన ఎప్పటికప్పుడు కనీస మద్దతు ధరలను ఖరారు చేయడం జరుగుతుంది. ఇంతకు ముందటి సంవత్సరాలతో పోలిస్తే ఈసారి పంటల ధర పెరుగుదల ఎక్కువే అని మంత్రి వివరించారు. సాధారణ రకం వరి ధాన్యానికి ఏడు శాతం పెరుగుదల ఖరారు అయింది. దీనితో దీని ధర ఇప్పుడు రూ 2040 వరకూ ఉంటుంది.

ఎ గ్రేడ్ రకం ధర క్వింటాలుకు రూ 2203కు చేరుతుంది. ఇక జొన్నల రకాలను బట్టి కనీస మద్ధతు ధరల ఖరారు జరిగింది. ఖరీఫ్ పంటల్లో ప్రధాన పంటగా వరి నిలుస్తుంది. సాధారణంగా దీనిని నైరుతి రుతుపవానాల ఆగమన దశలో సాగుచేస్తారు. దక్షిణాదిలో ఎక్కువగా ఈ పంట ఉంటుంది. ఈసారి సాధారణ వర్షపాతాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనావేసింది. అయితే వరి పంటకు సరైన ప్రోత్సాహం కల్పించేందుకు కనీస మధ్దతు ధరలను పెంచినట్లు మంత్రి తెలిపారు. తృణధాన్యాలకు సంబంధించిన ద్రవ్యోల్బణం ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో తక్కువగా ఉందని మంత్రి తెలిపారు. లెక్కలు పలికారు. అయితే ఈ విషయంలో పరిస్థితిని మంత్రి అమిత్ షా సారధ్యపు బృందం తరచూ పర్యవేక్షిస్తుందని , ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఇప్పుడు పెరిగిన వాటిలో పప్పు ధాన్యాలకు సంబంధించి పెసర ధరకు ఎక్కువ పెంపుదల కన్పించింది.

దేశంలోని పలుప్రాంతాలలో పెసర పంటకు కటకట, ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ పంటకు కనీస మద్దతు ధరను పెంచారు. మరో నిత్యావసర ధాన్యం కందిపప్పు కనీస మద్దతు ధరను 6 శాతం పైగా పెంచారు. దీనితో ఇంతకు ముందు క్వింటాలుకు రూ 6600 వరకూ ఉన్న కంది ధర ఇప్పుడు రూ7000కు చేరుతుంది. ఈ కాలంలో మినపపప్పు ధరలను క్వింటాలుకు 5.3 శాతం పెంచారు. దీనితో ఇంతకు ముందు వరకూ క్వింటాలుకు రూ 6600గా ఉన్న ధర ఇక రూ 6950 అవుతుంది. వంటలలో కీలకం అయిన మినప పంటకు ఆదరణ దక్కుతుంది.
చమురు ధాన్యాలకు సంబంధించి నువ్వుల ధరలను 10.28 శాతం పెంచారు. దీనితో క్వింటాలుకు ఇప్పుడు దీని ధర రూ 8635కు చేరుతుంది. ఇంతకు ముందు ఇది రూ 7,830 ఉంది. వేరుశెనగ ధరను ఇప్పుడు క్వింటాలుకు రూ 6337 చేశారు.సోయాబీన్ ధరను క్వింటాలుకు రూ 4600గా ఖరారు చేశారు. ఇంతకు ముందు ఇది రూ 4300గా ఉంది. రైతులకు పంటసాగు వైవిధ్య పద్దతులను పెంచే తత్వాన్ని పెంచేందుకు వీలుగా ధరలను ఖరారు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News