Sunday, April 28, 2024

బ్రిజ్ భూషణ్‌పై చార్జిషీట్ దాఖలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బిజెపి ఎంపి, బారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు గురువారం 1000 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆయనపై పోక్సో కేసును తొలగించాలని కోరుతూ పాటియాల హౌస్ కోర్టుకు 500 పేజీల నివేదికను కూడా సమర్పించారు. మైనర్ రెజ్లర్‌పెట్టిన ఈ కేసును ధ్రువీకరించే సాక్షాలు లేకపోవడంతో పోలీసులు దాన్ని కొట్టివేయాలని కోరుతూ నివేదిక ఇచ్చారు. దీనిపై జులై 4న విచారణ జరుగుతుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష హోదాలో ఉన్న బ్రిజ్‌భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కొద్ది నెలల క్రితం అగ్రశ్రేణి క్రీడాకారులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఏడుగురు మహిళా రెజ్లర్లు ఆయనపై ఫిర్యాదు చేయడంతో ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ పోలీసు స్టేషన్‌లో ఏప్రిల్ నెలలో ఆయనపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుతో తొలి ఎఫ్‌ఐఆర్ , మరో మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్‌ఐఆర్‌ను ఏప్రిల్ 28న నమోదు చేశారు.

వేధింపులకు గురయినట్లు చెప్తున్న సమయంలో సదరు యువతి మైనర్ కాదని గుర్తించడంతో న్యాయమూర్తి ఎదుట ఆమెనుంచి మరోసారి వాంగ్మూలం తీసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు డ్రిజ్‌భూషణ్‌పై పోక్సో కేసులను తొలగించాలని కోరుతూ నివేదికలు ఇచ్చారు. ‘ దర్యాప్తు పూర్తయిన తర్వాత మైనర్, ఆమె తండ్రి వాంగ్మూలాల ఆధారంగా ఆ పోక్సోసెక్షన్ల తొలగింపు కోరుతూ నివేదిక సమర్పించాం. దర్యాప్తులో ఆ కేసును ధ్రువీకరించే సాక్షాలు లభించలేదు. ఇక రెజ్లర్లకు సంబంధించిన కేసులో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ సమర్పించాం’ అని పోలీసులు వెల్లడించారు. ఈ చార్జిషీట్‌లో మహిళా రెజ్లర్ల మర్యాదకు భంగం కలిగించే రీతిలో వారిపై వేధింపులకు పాల్పడడం గురించి ప్రస్తావించారు. ఈ చార్జిషీట్‌ను ఈ నెల 22న పరిశీలించనున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News