Saturday, July 27, 2024

కుల్వీందర్ కౌర్ కు  న్యాయ సాయం ఆఫర్

- Advertisement -
- Advertisement -

చండీగఢ్:  బిజెపి ఎంపీ కంగనా రనౌత్ చెంప పగులగొట్టిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ కు న్యాయ సహాయం (లీగల్ అసిస్టెంట్ సపోర్ట్) లభిస్తోంది. ఆమెకు అనేక మంది నుంచి, సంస్థల నుంచి ఆర్థిక, న్యాయ సహాయం ఆఫర్లు అందాయి. ఒకవేళ ఆమెను అరెస్టు చేసినా, ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసినా సహాయం అందించేందుకు అనేక మంది ఆఫర్లు ఇస్తున్నారు.

మొహీందర్ కౌర్ అనే 82 ఏళ్ల రైతు సంఘం కార్యకర్త  ఇదివరలో కంగనా రనౌత్ పై పరువు నష్టం దావా వేసింది. ఆమె కూడా ఇప్పుడు కుల్వీందర్ కౌర్ కు సాయపడేందుకు ముందుకు వచ్చింది. ‘‘ కంగనాకు ఎవరితో ఎలా మాట్లాడాలో సరిగా తెలియదు.  ఎంపీగా ఎన్నికయిన ఆమె పొలైట్ గా ఉండాలి.  కానీ  ఆమె పంజాబీలను తీవ్రవాదులుగా ముద్ర వేసే ప్రయత్నం చేసింది. పంజాబీలను హీనపరుస్తూ మాట్లాడింది’’ అని ఆ పెద్దావిడ టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికకు తెలిపింది.

రైతుల నిరసన విషయంలో కంగనా రనౌత్ కు కుల్వీందర్ కౌర్ కు మధ్య అభిప్రాయ భేదాలు చోటుచేసుకోవడమే కాక చేయిచేసుకునే స్థాయికి వెళ్లింది వ్యవహారం.  అయితే మోహాలీ పోలీసులు ఐపిసి 323, 341 సెక్షన్ల కింద  కేసు నమోదు చేశారు. ఇవి రెండూ బెయలబుల్ నేరాలే.  ఇప్పటి వరకైతే ఎలాంటి అరెస్టు జరుగలేదు. కానీ సిఐఎస్ఎఫ్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదయింది.

ఎస్కెఎం(రాజకీయేతర) నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్, కిసాన్ మజ్టూదూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి) గౌరవ్ యాదవ్ ను శుక్రవారం కలిసి దర్యాప్తు సక్రమంగా నిర్వహించాలని కోరారు. ‘కుల్వీందర్ కౌర్ కు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని కోరడమే కాక, దర్యాప్తు నిష్ఫక్షపాతంగా జరపాలని కోరాము’ అని దల్లెవాల్ తెలిపారు.

‘ ఇదివరలో కంగనా రనౌత్ ఢిల్లీలో నిరసన తెలిపిన రైతుల గురించి తప్పుగా మాట్లాడింది. వారందరికీ రూ. 100, రూ.200 ఇచ్చి ఢిల్లీకి తెచ్చారని అన్నది. ఆ నిరసనకారులలో నా తల్లి కూడా ఉంది’’ అని కుల్వీందర్ కౌర్ తన వివరణ ఇచ్చింది.

‘‘ నా చెల్లెలు కుల్వీందర్ కౌర్ 15 ఏళ్లుగా కేరళ, చెన్నై, అమృత్ సర్ వంటి ప్రాంతాలలో పనిచేసింది. మేము కుటుంబంలో ఆరుగురం.’’ అని కుల్వీందర్ సోదరుడు షేర్ సింగ్ మహివాల్ తెలిపారు. ‘ఒకవేళ కుల్వీందర్ కౌర్ నటి కంగనా చెంప పగుల కొట్టినట్టయితే అందుకు రుజువుగా వీడియో ఉండాలి కదా’ అని ఆమె సోదరుడు ప్రశ్నించాడు. ‘ కంగనా రనౌత్ ఏదో వాగి రెచ్చగొట్టి ఉండకపోతే నా కూతురు ఎందుకు కొడుతుంది’ అని కుల్వీందర్ కౌర్ తల్లి వీర్ కౌర్ ప్రశ్నించింది.

గత ట్రాక్ రికార్డు ప్రకారం కంగనా రనౌత్  ఏదో అని ఉంటుందని తెలుస్తోంది. చర్య తీసుకోవాలసి వస్తే కంగనా మీదే చర్య తీసుకోవాలని కూడా దల్లెవాల్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News