Sunday, October 6, 2024

ఎపి అసెంబ్లీలో గల్లీ లొల్లి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం చరిత్రలో నిలిచిపోయే దారుణమైన సన్నివేశాలు నమోదయ్యాయి. ఎల్లప్పుడూ ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితమయ్యే ఎమ్మెలేలు సోమవారం నిండు శాసనసభలో కొట్లాడు కోవడం, బాహాబాహీకి దిగడం, బూతులు తిట్టుకోవడం, నెట్టుకోవడం, తోపులాటలతో గందరగోళం సృష్టించారు. అరుపులు, కేకలు, నినాదాలతో సభ హోరెత్తింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ప్లకార్డులను వైఎస్‌ఆర్‌సిపి గుంజుకోవడం, రాయడానికి వీల్లేని విధంగా బూతులు తిట్టుకొంటూ, పరస్పరం దూషించుకొంటూ వైఎస్‌ఆర్‌సిపి, తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించారు. స్పీకర్ పోడియం వద్ద ప్లకార్డులు చూపిస్తూ నినాదాలు చేసిన టిడిపి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయస్వామిపై వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అడ్డుకునే ప్రయత్నాల్లో తోపులాటలు జరిగాయి. ఈ తోపులాటలో టిడిపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయస్వామి పోడియంలోనే కిందపడిపోయారు. టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే సుధాకర్‌బాబులు నెట్టుకొన్నారు. బూతులు తిట్టుకొంటూ కొట్లాడకున్నారు.

వీరిద్దరి మద్య తోపులాటలు జరిగాయి. అంతేగాక సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రదర్శించిన ప్లకార్డును మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లాక్కొని నెట్టివేయడంతో గొడవ తీవ్రరూపం దాల్చింది. దీంతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంలోనే కింద కూర్చొని నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తొలుత జీవో నెంబర్‌ః1పై చర్చించాలని టిడిపి ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుబట్టారు. టిడిపి నేతల తీరుపై వైసిపి ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే సమయంలో టిడిపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయస్వామి, వైసిపి ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్‌బాబులు పరస్పరం దాడులు చేసుకొన్నారు. తర్వాత అసెంబ్లీలో జరిగిన కొట్లాటలపై తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌లో తెలుగుదేశం సభ్యులు కేసుపెట్టారు.

అసెంబ్లీలో జరిగిన కొట్లాటకు సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజీని బహిర్గతం చేయాలని, బాధితులైన తెలుగుదేశం ఎమ్మెల్యేలకు న్యాయం చేయాలని, తగిన రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. శాసనసభ సభ్యులు చేసే చట్టాలను అమలు చేయాల్సిన పోలీస్‌శాఖనే తమకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన అరుదైన ఘటన సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకోవడం ఒక రికార్డని మరికొందరు ఎమ్మెల్యేలు వివరించారు. అసెంబ్లీలో జరిగిన ప్రోసీడింగ్స్, గొడవలు, ఆరోపణలు, ప్రత్యారోపణలన్నీ సభకే పరిమితంగా ఉండేవని, గడచిన 40 ఏళ్ళల్లో ఎన్నడూ ఇలా అసెంబ్లీలో జరిగిన ఘటనలు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళలేదని అంటున్నారు.

టిడిపి సభ్యులపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సెషన్‌లో టిడిపి సభ్యుల ప్రవర్తన ఆక్షేపణీయంగా, హేయం, గర్హనీయమని స్పీకర్ అన్నారు. ఇవాళ మరీ మితిమీరారని, ప్లకార్డులు తన మొహంపై పెట్టారని, చైర్ మీదకు వచ్చారని స్పీకర్ తెలిపారు. టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు తొలిరోజు నుంచీ దూషణలు చేస్తూ వచ్చారని, అయినా భరించానని, కానీ చైర్‌ను అవమానించారని, అందుకే రూలింగ్‌ను రివోక్ చేస్తున్నానని, గీత దాటితే వేటే..నని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. ముఖ్యంగా టిడిపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ప్రతి రోజూ తీవ్రస్థాయిలో దూషిస్తున్నారని స్పీకర్ అన్నారు. మాట్లాడితే సీనియర్లు అంటారేగానీ వారి ప్రవర్తన ఏ మాత్రం సరిగ్గాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించాలని, అనుమతించకపోతే మా ఇష్టం వచ్చినట్లుగా దౌర్జన్యాలు చేస్తామని అనడం ఏ మాత్రం సరికాదని స్పీకర్ ఆవేదన వ్యక్తంచేశారు.

ఇక వీరాంజనేయులు అయితే చైర్‌ను నెట్టారని, ప్లకార్డులు మొహానపెట్టారని అన్నారు. అసెంబ్లీలో జరిగిన గొడవపై వైసిపి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. వైసిపి ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, నారాయణస్వామి, ఎలిజాలు సీఎంను కలిసి అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేల బారి నుంచి స్పీకర్‌కు రక్షణగా నిలిచామని వివరించారు. టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం పైకి దూసుకెళ్ళడం, ప్లకార్డులను స్పీకర్ ముఖంపై పెట్టడం, చేయివేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఎమ్మెల్యేలు సీఎంకు వివరించారు. ఇదిలావుండగా డోలా బాల వీరాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ తనపై వైసిపి ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, ఎలీజాలు దాడిచేశారని, వారిపై స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమపై దాడి చేసిందిగాక మళ్ళీ తమపైనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎక్కడా కట్ చేయకుండా సభలో జరిగిన వ్యవహారం మొత్తం వీడియోను బయటపెట్టాలని టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి డిమాండ్ చేశారు. తాను ఇచ్చిన వాయిదా తీర్మానం కోసం పట్టుబడితే దాడి చేస్తారా..అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

అగౌరవ పరిస్తే సస్పెండే…రూలింగ్ ఇచ్చిన స్పీకర్

సభ్యులు ఎవ్వరైనా సరే సభాపతి పోడియం వద్దకు వచ్చి, అగౌరవ పరిచే విధంగా వ్యవహరిస్తే ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయినట్లేనని స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం అసెంబ్లీలో రూలింగ్ ఇచ్చారు. ఆ రూలింగ్‌ను రివోక్ చేస్తున్నానని, దీన్ని ఆమోదించాలని స్పీకర్ సభను కోరారు. ఈ గౌరవం తనకు వ్యక్తిగతం కాదని, పదవిది అని అన్నారు. “నేను బిసినే అయినా, బలవంతుడు అనే కదా నాకు ఈ పదవి ఇచ్చారు, అంతేగానీ బలహీనుణ్ణి అని కాదు కదా..?”, అందుకే నాకు ఇచ్చిన ఈ గుర్తింపును నిలబెట్టుకుంటాను, మళ్ళీ ప్రజాక్షేత్రంలో నిలబడతాను..” అని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News