Tuesday, April 23, 2024

ఎస్‌హెచ్‌జిల ఖాతాల్లో రూ.217కోట్లు జమ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి రూ.217 కోట్లు జమ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,03,535 సంఘాల నుంచి రూ.217.61 కోట్ల మేర బ్యాంకులు అధికంగా వడ్డీని వసూలు చేశారని తేలడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని ఆయా సంఘాల ఖాతాల్లోకి సోమవారం జమ చేశారు. బ్యాంకులు తిరిగి చెల్లించడంతో రెండు లక్షల సంఘాలకు లబ్ధి చేకూరింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు గతేడాది డిసెంబర్ 23న స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్.ఎల్.బి.సి) 35వ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారమే స్వయం సహాయక సంఘాల రుణాలకు వడ్డీ రేటు అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, అధికంగా వసూలు చేసిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని స్పష్టం చేశారు. మహిళా సంఘాల రుణాలపై ఎంత వడ్డీ వసూలు చేయాలో 2022 జూలై 20న ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. రూ.3 లక్షల వరకు రుణంపై గరిష్ఠంగా 7 శాతం, రూ.3 నుంచి 5 లక్షల వరకు రుణంపై 10 శాతం వసూలు చేయాలని లేదా ఒక సంవత్సరం ఎంసిఎల్‌ఆర్ ఎది తక్కువైతే దానిని వసూలు చేయాలని సూచించింది. కొన్ని బ్యాంకులు ఈ నిబంధనను పట్టించుకోకుండా ఎక్కువ వడ్డీని వసూలు చేశాయని, ఒకే బ్యాంకు పరిధిలోని ఒక్కొ బ్రాంచిలో ఒక్కో విధంగా వడ్డిని వసూలు చేస్తున్నాయని మంత్రి హరీశ్ రావు దృష్టికి వచ్చింది. దీంతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు అధిక వడ్డీ చెల్లించి నష్టపోతున్నారని ఆయన గుర్తించారు. అధికంగా వడ్డీని వసూలు చేస్తే తిరిగి ఆ మొత్తాన్ని జమ చేయాలని బ్యాంకులను మంత్రి ఆదేశించారు.ఈ మేరకు అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని ఆయా సంఘాల ఖాతాల్లోకి బ్యాంకులు జమ చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News