Friday, July 12, 2024

కాంగ్రెస్ గొడ్డలికి బలవుతారా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: ధరణిని బం గాళాఖాతంలో కలపాలని కాంగ్రెస్ గొడ్డలి భుజాన ధరించి చూస్తోందని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మొదలు కొని రాహుల్ గాంధీ వరకు ధరణిపట్ల వ్యతిరేకంగా ఉన్నారని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రికె.చంద్రశేఖర్‌రావుహెచ్చరించారు. ధరణిని తొలగించి రైతులను అష్టకష్టాల పాటు చేసి, అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ తి ప్పాల ని, కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నదని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణలోని రైతుల కష్టాలు తీర్చేందుకు మూడేండ్లు మేధో మధనం చేసి ధరణి పోర్టల్‌ను రూపొందించామని, ధరణి వల్ల భూమిపై సర్వ హక్కులు రైతుల బొటన వ్రేలుకే బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని, ఏ అధికారికి గాని, చివరి కి ముఖ్యమంత్రికి గాని రైతుల బయోమెట్రిక్ లే కుండా భూముల రికార్డులు మార్చే అవకాశం లేదని, ధరణి పోర్టల్ వల్లే పల్లెల్లో ప్రశాంతత నెలకొందని కెసిఆర్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల లో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ మాట్లాడారు. ధరణిని రూపొందించక పోతే అనేక కొట్లాటలు, హత్యలు వెలుగు చూసేవని కెసిఆర్ అన్నారు. 98 శాతం మంది రైతులకు మంచి చేసిన ధరణిలో ఒకటి రెండు పొరపాట్లుంటే సరి చేసుకుందామని అన్నారు. గత తొమ్మిదన్నరేళ్లలో అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలించిందన్నారు.

తలసరి ఆదాయంలో నెంబర్ వన్‌గాను, విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్‌గాను, ఇంటింటికి నల్లా లు ఇచ్చి నీరు సరఫరా చేయడంలోనూ సాగునీరు, తాగునీరు ఇలా అన్ని రంగా ల్లో నెంబర్ వన్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. కాంగ్రెస్ రైతులకు మూడు గంటల కరెంట్ చాలని అంటోందని మూడు గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పాలన కావాలా, 24 గంటల కరెంట్ ఇచ్చే బిఆర్‌ఎస్ పాలన కావాలా రైతులు గ్రామాల్లో చర్చలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సభకు హాజరైన పలువురు 24 గంటల క రెంట్ కావాలని నినాదాలు చేయడం గమనార్హం. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు వర్ణణాతీతంగా ఉండేవని, కరెంట్ కోతల దుస్థితివల్ల రైతులు పాము కా టుకు, తేలు కాటుకు గురై మరణాల పాలయ్యారన్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో కూడా 24 గంటల ఉచిత కరెంట్ లేదని, గుజరాత్‌లో కంటే తెలంగాణలోనే కరెంట్ సరఫరా అత్యుత్తమంగా ఉందన్నారు. తెలంగాణలో బావుల కాడ కరెంట్ మీటర్ పెట్టకుంటే రూ.లు 30 వేలు కట్ చేస్తానని బెదిరించినా తాను భయపడలేదని ఏం చేసుకుంటావో చేసుకోమని రైతుల పక్షాన నిలిచానని, ప్రధాని బెదిరింపులకు కూడా భయపడలేదన్నారు. గత తొమ్మిదేళ్లుగా తెలంగాణలో హిందూ, ముస్లింల గొడవలు లేవని, హిందు, ముస్లింల మధ్య గొడవలు పెట్టేవారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలంగాణలో గంగా జమున తెహజీబ్ సంస్కృతి ఉందని, భారత దేశానికే తెలంగాణ హిందుముస్లింల సఖ్యతలో సంస్కార వంతంగా దేశానికే ఆదర్శంగా ఉందన్నారు.

ఇటీవల తెలంగాణలో ముస్లింల పండుగ మిలాద్ ఉన్ నబీ, హిందువుల గణేష్ నిమజ్జనం ఒక రోజే వస్తే ముస్లింలు సంస్కార వంతంగా ఆలోచించి తమ పండుగను వాయిదా వేసుకుని తమ సంస్కారాన్ని ప్రదర్శించారన్నారు. సిరిసిల్ల ఒకప్పుడు ఆత్మహత్యలకు నిలయంగా ఉండేదని, ఒకే రోజు ఏడుగురు నేతన్నలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తనను ఎంతగానో కలిచి వేసిందన్నారు. అప్పట్లో సిరిసిల్ల గోడలపైన ఆత్మహత్యలు చేసుకోవద్దని, సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని , రాతలు చూసి కలత చెందానని తమ పార్టీ అప్పట్లో ఉద్యమ పార్టీగానే ఉన్నదని అయినా సామాజిక బాధ్యతతో తమ నేతన్నలను కడుపులో పెట్టి కాపాడుకోవాలనే ఆవేదనతో రూ.లు 50 లక్షలు పార్టీ నుండి అందించి నేతన్నలు చావకండి మిమ్మల్ని కడుపులో పెట్టి కాపాడుకుంటామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ఒక రోజు మధ్యరాత్రి ప్రొ.జయశంకర్, నేను ఒక మీటింగ్ ముగించుకొని సిరిసిల్లా గుండా వెళుతుంటే కార్ల హెడ్ లైట్లలో గోడలమీద ‘ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. చావులు పరిష్కారం కాదు..చావకండి’ అనే రాతలు మేమిద్దరం కండ్లకు నీళ్లు తీసుకున్నామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎన్నో బాధలు అనుభవించామని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు. హెలికాప్టర్‌లో వస్తుంటే అప్పర్ మానేరు నుంచి సిరిసిల్ల వరకు ఒక సజీవ ధారలాగా మారిందన్నారు. కెటిఆర్ సిరిసిల్ల ఎంఎల్‌ఎ కావడం సిరిసిల్ల ప్రజల అదృష్టం. చేనేత మంత్రిగా కూడా కేటీఆర్ ఉండటంతో అనేక మీటింగ్‌లలో నాతో కొట్లాడి, అనేక రకాల పో రాటాలు చేసి చేనేత కార్మికులకు కావాల్సిన మరమగ్గాలు ఏర్పాటు, వా టి ఆధునీకరణకు డబ్బులు తెచ్చి చేనేత కార్మికుల పరిస్థితులు మార్చారని చేనేత కార్మికులను ఆత్మహత్యల పరిస్థితి నుంచి చల్లగ బతికేందుకు కృషి చేసినందుకు కేటీఆర్‌ను కూడా అభినందిస్తున్నానని కెసిఆర్ అన్నారు.

రామారావు గుణగణాలు ఏందో నాకంటే మీకే ఎక్కువ తెలుసునని మీరూ, ఆయన కలిసి పనిచేస్తున్నరు కాబట్టి నేను రామారావును పొగిడే అవసరం లేదన్నారు. మంచి నాయకుడు, మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు కేటీఆర్ మీ దగ్గరే ఉన్నారని కేటీఆర్‌ను దీవించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. షోలాపూర్ ఏ విధంగా ఉందో సిరిసిల్లను కూడా అట్లాగే చేయాలని చేనేత వర్గానికే చెందిన ఎమ్మెల్సీ ఎల్.రమణ అడిగినట్లుగా మళ్లీ అధికారంలోకి రాగానే తప్పకుండా నేను, ప్రభుత్వం మీవెంట ఉంటుందని హృదయపూర్వకంగా హామీనిస్తున్నానని కెసిఆర్ తెలిపారు. ప్రతి విషయాన్ని నీచాతి నీచంగా రాజకీయాలు చేసే చిల్లరగాళ్లు, కొందరు దుర్మార్గులు ఉంటారని వాళ్లున్నారని చిన్నబోవద్దన్నారు. చేనేత కార్మికులు బతకాలని, చేనేత కార్మికులకు పని కల్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకొని బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు కానుకలుగా రాష్ట్రంలోని కోటి మంది పేదలకు కొత్త చీరలు, కొత్త బట్టలను అందస్తుందని తెలిపారు. మూడు, నాలుగు వందల కోట్ల రూపాయలతో సిరిసిల్లలో చేనేత కార్మికులకు పనిదొరకడమే గాకుండా పేదలకు కొత్త బట్టలు కూడా అందుతున్నారని ఇది మంచి పరిణామన్నారు. బతుకమ్మ చీరెల తయారీ పథకం నేతన్నల కన్నీళ్లు తుడిచే మానవత్వ పథకమని అక్కడక్కడ కొందరు దుర్మార్గులు బతుకమ్మ చీరెలను కాలుస్తున్నారని ఇది నీచాతి నీచమైన చర్య అన్నారు. బతుకమ్మ చీరెలు ఇష్టం లేకపోతే తీసుకోకండి, కట్టుకోకండి తీసుకోమని ఎవరు జబర్దస్త్ చేస్తలేరని, బతుకమ్మ చీరలని ఎందుకు కాలుస్తున్నారన్నారు. బతుకమ్మ చీరెలు చేనేత బిడ్డల కష్టాలు తీర్చే మానవత్వ పథకమని, ఏటా మూడు, నాలుగు వందల కోట్లు ఖర్చు చేసి నేతన్నల కన్నీల్లు తుడిచేందుకు చేసే ప్రయత్నమన్నారు. సిరిసిల్ల ప్రాంతం ఒకప్పుడు మానేటి నీటి ధారలతో ఉన్నా సమైక్య పాలకుల కుట్రల వల్ల మానేరు నిర్జీవంగా తయారైందని, స్వరాష్ట్రం కోసం ఉద్యమించినప్పుడు ఎగువ మానేరు ప్రాజెక్టు నర్మాలలో సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. కాళేశ్వరం కట్టుకుని గోదావరి జలాలను తరలించడం వల్ల నేడు ఎగువ మానేరు ప్రాజెక్టు నుండి సిరిసిల్ల మధ్యమానేరు ప్రాజెక్టు వరకు సజీవ జలధారగా మారిందన్నారు. సజీవ జలధారగా మానేరు తీరం మారడం తనకు ఎంతో తృప్తి కలిగిస్తోందన్నారు. ఇటీవలే బిఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రకటించామని అందులో అడ్డగోలు అబద్ధ్దాలేవి చెప్పలేదన్నారు. మొదట్లో ఆడబిడ్డల పెళ్లి కోసం కళ్యాణలక్ష్మిని ప్రారంభించి నప్పుడు కేవలం రూ.లు 50 వేలు ఇచ్చామని ప్రస్తుతం వాటిని లక్షా పదహరు వేలకు చేశామన్నారు. పెన్షన్లు వెయ్యి నుండి క్రమంగా 5 వేలకు పెంచుతామని ప్రకటించామన్నారు. మొదట మూడు వేలు ఇచ్చి తరువా ఏటా 500 పెంచుతామన్నారు. రైతు బంధు అమలు చేస్తున్నామన్నారు. దేశానికి అన్నంపెట్టే స్థితికి తెలంగాణ చేరుకుందన్నారు.
ఏటా 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయ్
ఏటా తెలంగాణలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయన్నారు.గతంలో ఎక్కడా చూసినా కరువు పరిస్థితులు ఉండగా నేడు పచ్చ ని పంటలు కనిపిస్తున్నాయన్నారు. నిరుపేదలకు కూడా సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించి రేషన్ దారులకు ఇకపై సూపర్ ఫైన్ బియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు కొందరు ఆపద మొక్కులు మొక్కడానికి వస్తారని వారిని నమ్మవద్దన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ సూది పోయిన కథ చెప్పి ఆపద మొక్కులు మొక్కి పని తీరాక దేవుడు అడుగుతాడా అనే ధోరణి మోసపు ఆలోచనలో ఉంటారని అందువల్ల అటువంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ కలలో కూడా, కల్పనలోకూడా చేయలేనంత అభివృధ్ది, సంక్షేమ పథకాలు సిరిసిల్లలో సిఎం కెసిఆర్ సహకారంతో అమలు చేశామన్నారు. ఎర్రటి ఎండల్లో ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి దుంకుతోందన్నారు. కాళేశ్వ రం గోదావరి జలాలతో సిరిసిల్ల ప్రాంతం సశ్యశ్యామలం అయ్యిందన్నారు. నెత్తురు, నెర్రెలు బారిన నేలలో ఇప్పు డు నీళ్లు పారుతున్నాయన్నారు. ఒకప్పుడు కన్నీళ్లు కారిన నేలలో నేడు సాగునీరు,త్రాగు నీరు కనిపిస్తోందన్నారు. సిరిసిల్ల ఉరిశాలగా మారిన రోజుల్లో సిఎం కెసిఆర్ నేతన్నల జీవితాల్లో మార్పులు తెచ్చే పథకాలు అమలు పర్చారన్నారు. బిఆర్‌ఎస్‌ది చేతల, చేనేతల ప్రభుత్వమన్నారు. సిరిసిల్లలో మెడికల్ కాలేజి, ఇంజనీరింగ్ కాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాల, కెజి టు పిజి క ళాశాల ఏర్పాటు చేశారన్నారు, విద్యావైద్యం, సంక్షేమం, అభివృధ్ధిలో కొరత లేకుండా చేసుకున్నామన్నారు. సిరిసిల్ల మానేరు నదిలో నీరు సజీవ జలదృశ్యంలా ఉంటుందన్నారు. ఆరున్నర మీటర్ల ఎత్తుకు నీరు ఉబికి రావడం గురించి ఐఏఎస్‌లకు శిక్షణ ఇచ్చే ముస్సోరిలోని లాల్ బహద్దూర్ అకాడమీలో చర్చ సాగుతోందన్నారు.

రానున్న ఎన్నికల్లో గులాబీ జండా ఎగురవేస్తామని, సిఎం కెసిఆర్‌ను హట్రిక్ సిఎం చేస్తామన్నారు. సిరిసిల్ల ప్రజల ప్రేమ ఆశీర్వాదం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాలు మంత్రి కె టిఆర్‌కు మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్, మాజీ శాసన సభాపతి, ఎంఎల్‌సి మధుసూధనాచారి, ఎంఎల్‌సిలు ఎల్ రమణ, దా మోదర్ రావు, శాసన సభ్యులు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, పవర్‌లూమ్ టెక్స్‌టైల్ కార్పోరేషన్ చైర్మన్ గూడూ రి ప్రవీణ్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి,సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సిరిసిల్ల పట్టణ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News