Sunday, April 28, 2024

బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ ఖాయం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం…
95 నుంచి 105 స్థానాల్లో గెలుపు పక్కా
కావాల్సింది మిగిలే వుంది…జరగాల్సింది చాలా వుంది
సాధించిన దానికే సంతృప్తిని చెంది నిమ్మలపడొద్దు
శ్రేష్ఠత కోసం తపించడం అనేది నిరంతర ప్రక్రియ
తెలంగాణ అభివృద్ధి ఆగవద్దంటే మళ్లీ బిఆర్‌ఎస్ గెలిస్తెనే సాధ్యం..
గజ్వేల్‌ను మరింత అభివృద్ధి చేసుకుందాం..
నెలకు ఒకరోజు మొత్తం గజ్వేల్ ప్రజలతో గడుపుతా
నేను గజ్వేల్‌ను వదిలి వెళ్లడం లేదు..
ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు
భూములు పోయిన భాధ చాలా పెద్దదని…
కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కింద
భూములు కోల్పోయిన రైతులకు చేతులెక్కి మొక్కుతాను
వారందరికీ తెలంగాణ యావత్ రైతాంగం ఋణపడి ఉంటుంది
గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలుపు ఖాయమని, గెలుపుపై తనకు ఏమాత్రం అనుమానం లేదని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 95 నుండి 105 స్థానాల్లో గెలుస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలకోర్చి త్యాగాలు చేస్తూ సాధించుకున్న ప్రగతి ప్రస్థానం కీలకదశకు చేరుకున్నదని చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమం, అభివృద్ధి ఆగిపోవద్దంటే మళ్లీ బీఆర్‌ఎస్ గెలువాలని వ్యాఖ్యానించారు. ఈ దిశగా ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులై బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలని సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

శుక్రవారం శామీర్‌పేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ గజ్వెల్ కార్యకర్తల ప్రత్యేక సమావేశానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, మాజీ స్పీకర్ మదుసూదనా చారి, బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… మీ అందరి పుణ్యంతో గజ్వేల్ ఎంఎల్‌ఎను అయ్యాను అని గజ్వేల్ ప్రజలను ఉద్దేశించి సిఎం అన్నారు. తాను ఈసారి కామారెడ్డిలో పోటీ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని వివరించారు. తాను గజ్వేల్‌ను వదిలి వెళ్లడం లేదని….ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరూ వెయ్యేళ్లు బతకరని, మనం పదవిలో ఉన్నప్పుడు చేసిన పనులే చిరకాలం గుర్తుండిపోతాయని చెప్పారు.

కొంతమందితో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం
24 ఏండ్ల క్రితం తాను ఒక్కడినే బయలుదేరి ఉద్యమంలోకి వెళ్ళానని సిఎం కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. ఆనాడు నిస్పృహ, నిస్సహాయత ఉండేదని, కానీ ఎం చేయాలో తెల్వని పరిస్థితి ఉండేదని వెల్లడించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జాడలు లేక, ఎక్కడ చూసినా చిమ్మని చీకటి, ఎవరిని కదిలించినా మనోవేదనే ఉండేదని నాటి ఉమ్మడి రాష్ట్రంలోని మెదక్ జిల్లా తెలంగాణ పరిస్థితులను సిఎం గుర్తుకుచేసుకున్నారు. ఉమ్మడి పాలనలో మంజీర నది ఎండిపోయి 800 ఫీట్ల లోతుకు బోర్ వేసినా నీళ్లు రాకపోయేవని, అప్పుడు ట్రాన్స్‌ఫార్మర్స్ కాలిపోతే ఒక్కో బాయికి రూ. రెండు వేలు, రూ.మూడు వేలు వేసుకొని బాగుచేయించే పరిస్థితి ఉండేదని సిఎం కెసిఆర్ చెప్పారు.

కరెంటు బిల్లులు పెంచం అని చెప్పి ఆనాడు చంద్రబాబు మోసం చేశారని, ఇక లాభం లేదని, చూస్తూ చూస్తూ ఊరుకునేది లేదని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టానని కెసిఆర్ గుర్తు చేశారు. కొంతమందితో కలిసి ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి పోరాడి చివరకు తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. తెచ్చుకున్న తెలంగాణను ఎన్ని అడ్డంకులు సృష్టించినా పట్టుదలతో అభివృద్ధి చేసుకున్నామని, సాధించిన దానికే సంతృప్తిని చెంది ఆగిపోవద్దని పేర్కొన్నారు. శ్రేష్టత కోసం తపన పడడం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగిన నాడే గుణాత్మక జీవన విధానం ప్రజలకు అందించగలమని తెలిపారు. ఈ పదేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో మనందరం గమనించాల్సింది అదేనని సిఎం వివరించారు.

గజ్వేల్‌లో ఇంకా అభివృద్ధి జరగాలి

గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి చాలా జరిగిందని, ఇంకా కావాల్సింది చాలా ఉందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. లీడర్లు..జరిగిన అభివృద్ధి చాలు అని ఉరుకోవద్దని, ఇంకా తమ కృషి కొనసాగించాలని స్పష్టం చేశారు. తాను సిద్దిపేట ఎంఎల్‌ఎగా ఉన్నప్పుడు సిద్దిపేటలో భయంకరమైన కరువు ఉండేదని, అప్పుడు ఆలోచన చేసి మిడ్ మానేరు నుండి ఎత్తయిన గుట్టపైకి నీళ్లు సప్లై చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చామని అన్నారు. ఇదే స్ఫూర్తిగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఆనాడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఖాళీ బిందెలతో ప్రదర్శనలు ఉండేదని, ఇప్పుడు ఎక్కడా అలాంటి పరిస్థితి లేదని సిఎం స్పష్టం చేవారు.

తెలంగాణ వచ్చిన రోజున బతుకు దెరువు కోసం వలసలు వెళ్లి …చెట్టుకొక్కరు గుట్టకు ఒక్కరు అయ్యామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌తోపాటు మెదక్ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ నేడు వలసలు మాయమై మన రాష్ట్రానికే వలసలు వచ్చే పరిస్థితి వచ్చిందని సిఎం అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ ద్వారా ఇది సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అద్భుతంగా పురోగమించిందని పేర్కొన్నారు. ఎంతో మంది ఆర్థిక, వ్యవసాయ రంగం నిపుణులతో మాట్లాడి అనేక సంస్కరణలు చేపట్టి పథకాలు అందుబాటులోకి తేవడంతో వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని వెల్లడించారు. అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సిఎం సంతోషం వ్యక్తం చేశారు.

నెలకు ఒకరోజు గజ్వేల్ నియోజకవర్గం ప్రజలతో గడుపుతా

గజ్వేల్ బిడ్డలు తనను కడుపులో పెట్టుకొని రెండు సార్లు గెలిపించారని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. తనకు అవకాశమిచ్చాక అభివృద్ధి చేశానని, గజ్వేల్‌కు ఇంకా చేయాల్సి ఉందని చెప్పారు. నోట్ల రద్దు, కరోనా…ఈ రెండింటి వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగించి అనుకున్నంత చేసుకోలేకపోయామని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు రావడంతో రాష్ట్రంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదించాయని తెలిపారు. భూములు పోయిన భాధ చాలా పెద్దదని… కొండపోచమ్మ సాగర్,మల్లన్న సాగర్ కింద భూములు కోల్పోయిన రైతులకు చేతులెక్కి మొక్కుతానని చెప్పారు. వారందరికీ తెలంగాణ యావత్ రైతాంగం ఋణపడి ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని చెప్పారు. తాను పేరుకే గజ్వేల్ ఎంఎల్‌ఎను అని, కానీ ఎక్కడా కనబడనని పేర్కొన్నారు. కానీ ఈసారి ఎన్నికల తరువాత నెలకు ఒకరోజు మొత్తం గజ్వెల్ నియోజకవర్గం ప్రజలతో గడుపుతానని స్పష్టం చేశారు.

ఇండియాలోని అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతే తెలంగాణలో మాత్రం భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌తోనే సాధ్యమైందని వెల్లడించారు. మొదటి దశలో ప్రాజెక్టు కట్టుకున్నామని, కాంగ్రెస్ వాళ్లు, మరికొందరు వీటిని అడ్డుకున్నారని విమర్శించారు. రెండో దశలో మరింత అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని, రెండో దశలో ప్రతి గ్రామానికి నీళ్లు ఇచ్చుకుందామని సిఎం కెసిఆర్ అన్నారు. గజ్వెల్‌లో 65 టిఎంసిల నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నామని, ఉజ్వల భవిష్యత్తుకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. గజ్వేల్‌లో మనం గెలువడం కాకుండా పక్కన ఉన్న మూడు నియోజకవర్గాలను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. అభివృద్ధి అగవద్దు అంటే మళ్ళీ బిఆర్‌ఎస్సే గెలవాలనే అవగాహన ప్రజల్లో ఉందని.. ప్రజల ఆశీర్వాదంతో బిఆర్‌ఎస్ గెలుస్తుందని సిఎం అని సిఎం కెసిఆర్ అన్నారు.

జీవితంలో ఒక్కసారి ఓడించబడ్డ.. ఓడిపోలేదు

తన రాజకీయ జీవితంలో ఒక్కటే ఒక్కసారి ఓడిపోయానని సిఎం కెసిఆర్ అన్నారు. వాస్తవానికి గెలిచి ఓడిపోయాను అని పేర్కొన్నారు. అప్పుడు తన వయసు 25 సంవత్సరాలు అని, ఆ సమయంలో బ్యాలెట్ పద్దతి ఉంటుండే… ఎలక్ట్రానిక్ మేషిన్లు లేకుండే అని అన్నారు. తనకు వచ్చిన ఓ ఐదారు వేల ఓట్లు మిగతా వారికి దాంట్లో కలిపేసి 700 ఓట్లతో తాను ఓడిపోయినట్లు డిక్లేర్ చేశారని గుర్తు చేసుకున్నారు. రీ కౌంటింగ్‌కు అవకాశం ఇవ్వలేదని, ఈ విషయంపై హైకోర్టులో కూడా కేసు వేశామని చెప్పారు. ఆ ఒక్కసారే తాను ఓడించబడ్డానని, ఎప్పుడూ ఓడిపోలేదని అన్నారు. ఆ తర్వాత తాను మళ్లీ వెనక్కి చూడలేదు..రెగ్యులర్‌గా గెలిచినానని అన్నారు. ఈ తెలంగాణ గడ్డ ఎంతో గొప్పదని పేర్కొంటూ తెలంగాణ గడ్డ గొప్పతనాన్ని కెసిఆర్ తెలియజేశారు.

తెలంగాణ వస్తది.. కెసిఆర్ మొండి తనమే తెస్తదని జయశంకర్ చెప్పారని గుర్తు చేసుకున్నారు. అనేక బాధలు పడ్డానని, పాలమూరు జిల్లాను మీ కండ్లతోటి చూడాలి… మహబూబ్‌నగర్ ఎంపిగా నిలబడాలని జయశంకర్ చెప్పారని పేర్కొన్నారు. కరీంనగర్‌లో భారీ మెజార్టీతో గెలిపించారని,మహబూబ్‌నగర్‌లో కూడా గెలిపించారని తెలిపారు. తాను మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, చరిత్రలో పాలమూరుకు కీర్తి ఉంటదని వ్యాఖ్యానించారు. మీ అందరి పుణ్యంతో గజ్వేల్ ఎంఎల్‌ఎను అయ్యాను అని గజ్వేల్ ప్రజలను ఉద్దేశించి సిఎం అన్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చాయని, తాను గజ్వేల్‌లో పోటీ చేస్తున్నానని, అందరూ కలిసి గజ్వేల్‌లో తనను గెలిపించారని సిఎం కెసిఆర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News