Tuesday, May 21, 2024

కెసిఆర్.. దమ్ముంటే కాళేశ్వరంపై చర్చకు రా: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీకి రాకుండా టివి ఛానల్‌లో కూర్చొని మాట్లాడటం సిగ్గు చేటు
వచ్చే పంద్రాగస్టున రుణమాఫీతో రైతులకు ఆర్థిక స్వాతంత్య్రం తెస్తాం 
హరీశ్ … రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని తిరుగు 
మోడీ, కెసిఆర్ ఇద్దరూ తోడు దొంగలే 
దేవుడు పేరుతో రాజకీయాలు చేస్తే సహించం 
వరంగల్‌కు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువస్తాం 
కడియం అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటాం 
మడికొండ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గర్జన

మన తెలంగాణ /వరంగల్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదంటున్న మాజీ సిఎం కెసిఆర్ .. ఆ ప్రాజెక్టు వద్దనే మేధావులు, నిపుణులతో చర్చా వేదిక ఏర్పాటు చేస్తామని.. దమ్ముంటే పాల్గొనాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని మడికొండలో బుధవారం వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ఎన్నికల జన జాతర బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ సిఎం పదేండ్ల పాలనలో లక్ష కోట్ల ప్రజల సొమ్మును కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ మునిగిపోయిందని, అన్నారం ఆగమైందని, సుందిళ్ల సున్నమైందని, ఫలితంగా రూ. లక్ష కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని, కేవలం మూడు పిల్లర్లు కుంగడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదని ఒక చానల్లో కూర్చొని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పదేళ్లు పరిపాల చేసిన ముఖ్యమంత్రి అసెంబ్లీకి రాకుండా సలహాలు, సూచనలు ఇవ్వకుండా పారిపోయారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష హోదాలో ఉండి నేడు ఎన్నికలు వచ్చాయని దొంగ చాటుగా ఛానల్ డిబేట్లో పాల్గొనడం సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని నిరూపించగలవా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులో అవినీతి జరిగిందా.. లేదా ప్రాజెక్టు పనికి వస్తుందా లేదా అనే దానిపై మేధావులు, నిపుణులతో అక్కడే చర్చా వేదిక ఏర్పాటు చేస్తానని అన్నారు.

దమ్ముంటే ఆ చర్చ వేదికలో పాల్గొనాలని మరోసారి సవాల్ విసిరారు. కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలలో కట్టిన ప్రాజెక్టులు ఎక్కడా కూడా కూలిపోవడం, కుంగిపోవడం జరగలేదన్నారు. కడియం శ్రీహరి నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు ఎక్కడైనా కుంగి పోయిందా, వాటికి తేడా తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. సచ్చిన పామును ఇంకా చంపడం సరికాదని ఇక కెసిఆర్ గురించి మాట్లాడటం దండగ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ అవినీతిని ఎండగట్టి చిత్తుచిత్తుగా ఓడించిన ప్రజలు మళ్లీ ఈ ఎన్నికల్లో అతని కుటుంబం, వారి ఊసే లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. మామా అల్లుళ్లు గోడ మీది బల్లిలా ఎగిరి పడుతున్నారని మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీపై రాద్ధాంతం చేస్తున్న హరీష్ రావు దమ్ముంటే తాను విసిరిన సవాల్‌కు సిద్ధంగా ఉండాలని అన్నారు. పంద్రాగస్టులోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తే ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖను సిద్ధం చేసుకోవాలని సవాల్ విసిరారు. పంద్రాగస్టు రోజు దేశానికి స్వాతంత్యం వస్తే అదే రోజు తెలంగాణ రైతులకు ఆర్థిక స్వాతంత్య్ర వస్తుందని అన్నారు. మోడి, కెసిఆర్ ఇద్దరూ తోడుదొంగలేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన కెసిఆర్, మోడి తెలంగాణకు చేసింది ఏమీ లేదన్నారు.

విభజన హామీల చట్టంలో ప్రధానమంత్రి మోడీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. యువజన హామీలో ఉన్న బయ్యారం ఉక్కు పరిశ్రమను ఎందుకు నిర్మించలేదన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రలోని లాతూర్‌కు ఎందుకు తరలించి ఇక్కడి ప్రజలకు మోసం చేశారో చెప్పాలన్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్న బిజెపికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలని, అలా కాకుండా దేవుడి పేరుతో రాజకీయం చేస్తే ఎవరినైనా క్షమించేది లేదన్నారు. వరంగల్ జిల్లా ఎంతో చారిత్రాత్మకమైన జిల్లా అని, పదేండ్ల పాలెంలో కెసిఆర్, మోడి నిర్లక్ష్యానికి గురిచేశారన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా అభివృద్ధి చెందాల్సిన వరంగల్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇక్కడ ఉన్న టెక్స్‌టైల్ పార్కుకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా అభివృద్ధి చేసి పద్మశాలీ సోదరులకు బాసటగా నిలుస్తామన్నారు.

వరంగల్‌కు అండర్ డ్రైనేజీ నిర్మాణంతోపాటు వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని చెత్తను సేకరించి విద్యుత్తు ఉత్పత్తి చేసే పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ నుండి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌తోపాటు వరంగల్‌ను విద్య, వైద్య ఐటి హబ్ గా మారుస్తామన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీకి కట్టుబడిన నాయకులు అవసరమన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి అనుభవాన్ని సద్వినియోగం చేసుకొని వరంగల్ అభివృద్ధికి ఉపయోగించుకుంటామని అన్నారు. కడియం శ్రీహరి లాంటి నాయకుడి కూతురుకి టికెట్ ఇచ్చి గెలిపిస్తే ప్రజలకు అండగా ఉండడమే కాకుండా నిజాయితీ కలిగిన రాజకీయాలను చేస్తారని ఆశిస్తున్నామన్నారు. కడియం కావ్య కావాలో.. కబ్జాకోరు ఆరూరి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ సీతక్క, శ్రీధర్ బాబు, ఎంఎల్‌ఎలు శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, యశస్విని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News