Tuesday, April 30, 2024

పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో: రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు మాట ఇస్తున్నా.. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికల జనజాతర బహిరంగ సభ జరిగింది. ఈ సభ నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ఆయన పూరించారు. ఈ సందర్భంగా సిఎం బిజెపి, బిఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే వరి పంటకు రూ. 500 బోనస్ ఇస్తామని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని సిఎం భరోసా ఇచ్చారు. ప్రతి వరి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.

‘లిక్కర్ స్కాంలో జైల్లో ఉన్న బిడ్డ కోసమే కెసిఆర్ బిఆర్‌ఎస్ పార్టీని బిజెపి వద్ద తాకట్టు పెట్టారు.. 14 పార్లమెంట్ సీట్లలో పాలమూరు, జహీరాబాద్, భువనగిరి, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపి సీట్లను కాంగ్రెస్ గ్యారెంటీగా గెలుస్తుందని కుట్ర లో భాగంగానే బిఆర్‌ఎస్‌ను కెసిఆర్ బిజెపికి తాక ట్టు పెట్టిండు..నరేంద్ర మోడీకి సుఫారీ ఇచ్చి లొంగిపోయారు’ అని ఆరోపించారు. ‘కెసిఆర్… నా పై కోపం ఉంటే.. దమ్ముంటే నాతో కొట్లాడు .. వంద రోజుల్లో నన్ను గద్దె దిగమంటున్నావు.. మరి కేంద్రంలో పదేళ్లు పాలన చేసిన నరేంద్ర మోడీని ఎందుకు గద్దె దిగమని అడగడం లేదు.. అంటే నీ బిఆర్‌ఎస్ పార్టీ, బిజెపి ఒక్కటే అయినందుకే కదా నన్ను గద్దె దిగమంటున్నావు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

‘నా కూతురు లగ్నం జరిగిన రోజే కెసిఆర్ నన్ను జైల్లో పెట్టించాడు..అయినా నేను బెదరలేదు.. ఇప్పడు తన కూతురు జైల్లో పడితే బైలు కోసం బిజెపి వద్ద కెసిఆర్ బిఆర్‌ఎస్‌ను తాకట్టు పెట్టయినా బిజెపిని గెలిపిస్తానని హామీ తీసుకున్నారని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి చెబుతు …ఈ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత పాలమూరు బిడ్డగా రైతు బిడ్డగా ముఖ్యమంత్రిని అయ్యాను. నేను ముఖ్యమంత్రిని కావడం కెసిఆర్‌కు ఇష్టం లేదు.. పాలమూరు బిడ్డలు ముఖ్యమంత్రులు కాకూడదా? ఎప్పుడూ నీవు, నీ కుమారుడు, నీ మనవడే సిఎంలు కావాలా? పాలమూరు బిడ్డలు ఎప్పుడూ కష్టపడాల్నా? నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకోకూడదా’ అని కెసిఆర్‌ను నిలదీశారు.

ఆరు గ్యారెంటీలు అమలు చేసినందుకు దిగాల్నా?
‘వంద రోజుల్లో 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత ఆర్‌టిసి ప్రయాణం చేశారు. హాయిగా దేవాలయాలకు, పిల్లల చదువుల కోసం, కూలీల మహిళలు ఎందరో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు నేను గద్దె దిగాల్నా?’ అని ప్రశ్నించారు. ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మాదిరిగానే 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, పేదల ఆరోగ్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షలతో ఉచిత వైద్యం అందిస్తున్నందుకా? కట్టెల పొయ్యితో క్యాన్సర్, ఇతర ప్రమాద మరణాలు జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఆడబిడ్డలకు రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్‌ను బిజెపి ప్రభుత్వం 1200 సిలిండర్‌ను పెంచింది.. మా ప్రభుత్వం మాట ఇచ్చినట్లుగా గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తున్నాం అందుకా ఇవన్నీ చేస్తున్నందుకు నన్ను గద్దె దిగమంటున్నారా’? అంటూ బిజెపి, బిఆర్‌ఎస్ నేతలకు సిఎం సవాల్ చేశారు.

గతంలో వైఎస్‌ఆర్ హయాంలో కాంగ్రెస్ 25 లక్షలు ఇళ్లు మంజూరు చేస్తే కెసిఆర్ వచ్చిన తర్వాత డబుల్ బెడ్ రూంల పేరుతో డబ్బా ఇళ్లును ఊరవతల కట్టించారని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేసి ఉచితంగా రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సిఎం చెప్పారు. కెసిఆర్ పదేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగ నియామాకాలు చేయలేదు. కేవలం ఆయన ఇంటిలోని నలుగురికి మంత్రి పదవులు ఇప్పించుకున్నారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 30 వేల మందికి ఉద్యోగ నియమాకాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బిసి కులాలకు న్యాయం చేయాలని, నిధులు సమానంగా అందాలనే నిర్ణయంతో బిసి గణనపై అసెంబ్లీలో తీర్మానం చేశామని సిఎం చెప్పారు.

సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం
అన్ని కులాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని రేవంత్ రెడ్డి చెప్పారు. బిసిలు, ఎస్‌సి, ఎస్‌టిలు, మైనార్టీలకు సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ కృషి చేసిందన్నారు. సోనియా, రాహుల్, ఖర్గేలు బిసి కుల గణన జరుగుతుందని ప్రకటించారని సిఎం చెప్పారు. కుల గణన జరిగితే బిసిలకు న్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్‌లకు, యాదవులకు, రజకులకు ఎంఎల్‌ఎలుగా సీట్లను ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పారు. మక్తల్‌లో ముదిరాజ్ శ్రీహరికి, షాద్‌నగర్‌లో రజకుడు వీరంపల్లి శంకర్‌కు ఎంఎల్‌ఎల సీట్లు ఇచ్చి గెలిపించుకున్నామని అన్నారు. అలాగే లక్షల ఖర్చుపెడితే కూడా దక్కని రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్‌కు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎంపిని చేసింది కాంగ్రెస్సేనని సిఎం చెప్పారు. ఎస్‌ఇ సామాజిక వర్గానికి చెందిన దామోదర్ నర్సింహకు మంత్రి పదవి ఇచ్చామన్నారు. ఇంకా అనేక మందికి భవిష్యత్‌లో పార్టీలో సముచిత న్యాయం జరుగుతుందన్నారు. తన పేషీలో కూడా ఐఎఎస్‌లు దళితులే ఉన్నారన్నారని సిఎం స్పష్టం చేశారు.

కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎబిసిడి వర్గీకరణ
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మాదిగల న్యాయమైన డిమాండ్ ఎబిసిడి వర్గీకరణ చట్టం తెస్తామని సిఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఎబిసిడి వర్గీకరణ కేసు సుప్రీం కోర్టులో ఉండగా కెసిఆర్ గత పదేళ్లలో అడ్వకేట్‌ను పెట్టకుండా చేశారని అన్నారు..తాను సిఎం అయిన వెంటనే ఎనిమిది మంది ఎంఎల్‌ఎలను ఢిల్ల్లీకి పంపించి సుప్రీంకోర్టులో వాదించేందుకు ప్రభుత్వం నుంచి అడ్వకేట్‌ను పెట్టామని గుర్తు చేశారు. ఇప్పడు ఆయన పేరు ఎత్తను.. గతంలో కెసిఆర్ ఆయనను జైల్లో పెడితే తాను జైలుకు వెళ్లి పరామర్శించి బెయిలు కోసం కృషి చేశానని వ్యాఖ్యానించారు. ‘ఎబిసిడి వర్గీకరణ కోసం ధర్మయుద్ధం సభ పెడితే వచ్చాను. ఎబిసిడి వర్గీకరణ కోసం అసెంబ్లీలో పోరాడితే నన్ను మార్షల్‌తో బయటికి పంపారు. ఇప్పుడు మీరు మోడీ వద్ద మాదిగలను తాకట్టు పెడుతున్నారు… ఆ పార్టీ మాదిగ సామాజిక వర్గ ప్రజలకు మోసం చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.

డికె అరుణ డైరైక్షన్‌లో గద్వాలలో మామా, అల్లుడు ఏకమై బిసి బిడ్డను ఓడించారు
గద్వాల్లో కురుబ, యాదవ బిడ్డ అయిన సరితకు టికెట్ ఇచ్చామని అన్నారు..‘ఇక్కడ డికె అరుణ డైరెక్షన్‌లో మామా అల్లుడు ఏకమై బిఆర్‌ఎస్‌ను గెలిపించారని, మక్తల్‌లో బిసి బిడ్డ ముదిరాజ్ శ్రీహరి ఓడించేందుకు బిఆర్‌ఎస్‌తో డికె అరుణ కుమ్మక్కు కావడం నిజం కాదా? డికె అరుణ ఏనాడైనా పాలమూరు కోసం మోడీ వద్ద నుంచి నయా పైసా తీసుకొచ్చిందా? కొత్త రైల్వే లైన్ కోసం కొ ట్లాడినవా? పాలమూరు రంగారెడ్డి కోసం మోడీని అడిగావా? కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం నిలదీశా వా?’ అంటూ డికె అరుణను నిలదీశారు. బిసిలకు వెన్ను పోటు పొడిచిన నీకు మద్దతు ఇవ్వాల అని నిలదీశారు. ముదిరాజ్‌ల న్యాయమైన డిమాండ్ బిసి డి నుంచి బిసి ఎకు మార్చుతామని హామీ ఇచ్చారు. అలాగే 14 సీట్లు ఎంపి సీట్లు గెలిపిస్తే ఆగస్టు 15 తర్వాత ముదిరాజ్‌లకు మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు. పాలమూరు బిడ్డ లోక్ సభకు పోటీ చేస్తున్న వంశీచందర్ రెడ్డిని ఆదరించి ఆశీర్వదించాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. నారాయణపేటకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కొత్త రైల్వే లైన్ తీసుకొస్తానని సిఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి కార్యదర్శి సంపత్‌కుమార్, ఢిల్లీలో పార్టీ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, ఎంఎల్‌ఎలు యన్నం శ్రీనివాస్ రెడ్డి, ఫర్నికా రెడ్డి, శ్రీహరి, జిఎంఆర్, అనిరుధ్ రెడ్డి, వీరంపల్లి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News