Sunday, May 5, 2024

రిజర్వేషన్ల రద్దుకు కమలం కంకణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను బిజెపి అమలు చేసిందని సిఎం రేవంత్ విమర్శించారు. భారత రాజ్యాంగంపై బిజెపి ఆఖరి యుద్ధం ప్రకటించిందని, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి రిజర్వేషన్ల రద్దుకు ఆ పార్టీ కుట్ర చేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దు కోసం కమలం పార్టీకి 400 సీట్లు కావాలని అందుకే ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రిజర్వేషన్ల రద్దుకు కంకణం కట్టుకుందని సిఎం రేవంత్ దుయ్యబట్టారు. రిజర్వేషన్లు ఉండాలా? వద్దా? అనే దానిపై ఈ పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమని, రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని సిఎం రేవంత్ కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఓబిసి కులగణన చేపడితే రిజర్వేషన్లు 70 నుంచి 75 శాతానికి పెరిగే అవకాశంఉందన్నారు. అందుకే ఈ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న కుట్ర జరుగుతోందన్నారు.

కాంగ్రెస్‌పై విష ప్రచారం చేసి ఎలాగైనా బిజెపి గెలవాలని చూస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ క్రమంలోనే బిజెపికి మద్ధతిస్తే నూరు శాతం రిజర్వేషన్ల రద్దుకు దారి తీస్తుందని, రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని సిఎం రేవంత్ కోరారు. గాంధీభవన్‌లో గురువారం బిజెపిపై ఛార్జ్‌షీట్ విడుదల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బిజెపి నయవంచన పేరు తో, పదేళ్లలో బిజెపి మోసం – వందేళ్ల విధ్వంసం ట్యాగ్‌లైన్‌తో సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఛార్జ్‌షీట్ విడుదల చేశారు.

ప్రతి ఒక్కరి ఖాతాలో రూ 15 పైసలు వేయలేదు..?
ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ పదేళ్ల ఎన్డీఏ పాలన వైఫల్యంపై ఛార్జ్‌షీట్ విడుదల చేశామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల తర్వాత బిజెపి కుట్రలపై ప్రజలకు వివరించాల్సి ఉందన్నారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని ఆ హామీ ప్రకారం పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. కానీ, బిజెపి హయాంలో 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ సర్కార్ మోసం చేసిందన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని.. రూ.15 పైసలు కూడా వేయలేదని సిఎం రేవంత్ సెటైర్లు వేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోడీ సర్కార్, మూడు నల్ల చట్టాలను తెచ్చి అన్నదాతలను బానిసలుగా చేసేందుకు ప్రయత్నించిందని సిఎం రేవంత్ దుయ్యబట్టారు. కార్పొరేట్ కంపెనీలకు ఎన్డీఏ ప్రభుత్వం లొంగిపోయిందని సిఎం ఆరోపించారు. ప్రధాని మోడీ చేనేత నుంచి కుటీర పరిశ్రమల వరకు జీఎస్టీని విధించి దోపిడీ చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

రూ.168 లక్షల కోట్ల అప్పుల ఊబిలో దేశం
దేశాన్ని రూ.168 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచారని, గత ప్రధానులందరూ కలిసి రూ.54 లక్షల కోట్లు అప్పులు చేస్తే, పదేళ్లలో మోడీ ప్రభుత్వం రూ.113 లక్షల కోట్లు అప్పులు చేసిందని సిఎం రేవంత్ ఆరోపించారు. తమకు మెజారిటీ వస్తే రిజర్వేషన్లు తీసేయడం సులభమని మోడీ అనుకుంటున్నారని, ప్రధాని దేశాన్ని మోసం చేశారని సిఎం రేవంత్ దుయ్యబట్టారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని మోడీ అని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ఏ వ్యవస్థను లెక్కపెట్టే వ్యక్తి కాదని, 370 ఆర్టికల్ రద్దు, యూనిఫాం సివిల్ కోడ్, జీఎస్టీ, నోట్ల రద్దు తదితర వాటిని చూశామన్నారు. మోడీ చేయాలనుకుంటే ఎంత దురాగతానికైనా పాల్పడతారన్నారు. మోడీ పాలనలో పదేళ్ల మోసం- వందేండ్ల విధ్వంసం జరిగిందని ఆయన ధ్వజమెత్తారు. నయా భారతాన్ని అప్పుల ఊబిలోకి ప్రధాని మోడీ నెట్టారని సిఎం రేవంత్ మండిపడ్డారు. ఎల్‌ఐసీ సహా ప్రతి ప్రభుత్వ సంస్థను కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని అమ్మేస్తున్నారన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రకటించిందన్నారు.

అల్లకల్లోలం సృష్టించి, అధికారం ఛేజిక్కించుకోవాలని: డిప్యూటీ సిఎం
అల్లకల్లోలం సృష్టించి అధికారం ఛేజిక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ యత్నిస్తోందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. పదేళ్లుగా మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేస్తోందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క విమర్శించారు. మోసపూరిత హామీలతో బిజెపి అమాయక ప్రజలను మోసగిస్తోందని ఆయన అన్నారు. ఆ మోసపూరిత హామీలపైనే నేడు ఛార్జ్‌షీట్ విడుదల చేశామని డిప్యూటీ సిఎం తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ నేతృత్వంలో పోరాటం చేస్తున్నామని ఆయన తెలిపారు. సంపదను కొన్ని కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు మోడీ యత్నిస్తున్నారన్నారు. దేశ సంపద ప్రజలకు చెందేలా చేసేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌లు జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్ గౌడ్, పిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News