Tuesday, May 21, 2024

గణితానికే గమ్యం చూపిన శ్రీనివాస రామానుజన్

- Advertisement -
- Advertisement -

శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ భారత దేశానికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. పది సంవత్సరాల వయసులోనే గణిత శాస్త్రంతో అనుబంధం ఏర్పరుచుకొని గణితం పట్ల ఆశక్తిని పెంచుకొని త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను చదివి పూర్తిగా అవగాహన చేసుకొని, పదమూడు సంవత్సరాలు నిండే సరికల్లా ఆ పుస్తకాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని, సొంతంగా సిద్ధాంతాలు కూడా తయారు చేయడం ప్రారంభించే స్థాయికి ఎదిగిన ప్రజ్ఞావంతుడు రామానుజన్.

రామానుజన్ డిసెంబర్ 22, 1887 నాడు తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ పట్టణంలో జన్మించారు. రామానుజన్ తండ్రి కె శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణం లో గుమాస్తాగా, తల్లి కోమలటమ్మాళ్ గృహిణిగా ఉండేవారు. వీరు కుంభకోణం పట్టణంలోని ఒక పెంకుటింట్లో నివసించేవారు. 1892 అక్టోబరులో రామానుజన్ ఊళ్ళో ఉన్న చిన్న పాఠశాలలో చదవడం ప్రారంభించాడు. రామానుజన్ తాత కాంచీపురం న్యాయస్థానంలోని ఉద్యోగం కోల్పోవడంతో, రామానుజన్ తల్లితో సహా కుంభకోణం చేరుకుని అక్కడ కంగయాన్ ప్రాథమిక పాఠశాలలో చేరాడు. ఆ తర్వాత మద్రాస్ మారినా చదువు పట్ల శ్రద్ధ కనబరచలేదు. తల్లి నుంచి రామానుజన్ సంస్కృతి సంప్రదాయాల గురించి, ఆచార వ్యవహారాల గురించి, పురాణాల గురించి తెలుసుకుని అనతి కాలంలోనే ఆంగ్లం, తమిళం, భూగోళ శాస్త్రం, గణితంలో పట్టు సంపాదిస్తూ ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. మంచి మార్కుల తో జిల్లాలో అందరికన్నా ప్రథముడిగా నిలిచి 1898లో హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేరాడు.

ఈ పాఠశాలలోనే మొట్టమొదటి సారిగా గణితశాస్త్రంతో పరిచయం ఏర్పడి కాలక్రమంలో ప్రపంచం మెచ్చే వ్యక్తిని చేసింది. 15 ఏళ్ళకే రామానుజన్‌లోని తెలివితేటలను ప్రపంచానికి చాటడానికి దోహదం చేసిన గ్రంథం జార్జ్ స్కూచ్ సిడ్జ్‌కార్ రాసిన ‘సినాప్సిస్’. అందులో ఆల్‌జీబ్రా, అనలిటికల్ జామెట్రీ వంటి విషయాల మీద దాదాపు 6165 సిద్ధాంతాలున్నాయి. వీటి నిరూపణలు చాలా కష్టంగా ఉండేవి. పెద్దపెద్ద ప్రొఫెసర్‌లు సైతం అర్థం చేసుకోలేకపోయిన ఈ సిద్ధాంతాలను, సూత్రాలకు రామానుజన్ ఎటువంటి పుస్తకాలను తిరగేయకుండా వాటి సాధనలను అలవోకగా కనుక్కునేవారు. అప్పటికే అందులో చాలా సమస్యలు నిరూపించబడ్డాయన్న విషయం ఆయనకు తెలియకపోవడం చేత వాటిని తన పద్ధతితో సాధించి చూపారు. 1909, జులై 14వ తేదీన రామానుజన్‌కు జానకీ అమ్మాళ్ అనే తొమ్మిదేళ్ళ బాలికతో వివాహమైంది.

లెక్కల వల్ల కొడుకుకి పిచ్చిపడుతుందేమోనని భయపడిన రామానుజం తండ్రి ఆయనకు పెళ్ళి చేశారు. సంసారం గడవటం కోసం 25 రూపాయల వేతనం మీద రామానుజన్ గుమాస్తాగా చేరారు. గణితంలో ఆయన ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను చూచి ఏ డిగ్రీ లేకపోయినా మద్రాసు విశ్వవిద్యాలయం నెలకు 75 రూపాయల ఫెలోషిప్ మంజూరు చేసింది. అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని కలిసి తనకొక చిన్న ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. తాను తీరిక వేళలో గణితం మీద రాసుకున్న నోటు బుక్కులను చూపించాడు. వాటిని చూసిన అయ్యర్ చాలా ఆశ్చర్యపోయి రామానుజన్ ప్రతిభ చాలా గొప్పదని గుర్తించాడు.

తన వద్ద చిరుద్యోగిగా చేరడం బాగుండదని భావించి మద్రాస్‌లో తనకు పరిచయం ఉన్న గణిత శాస్త్రవేత్తల దగ్గరకు తన సిఫారసు లేఖతో పంపించాడు. రామానుజన్ రాసుకున్న పుస్తకాలను చూసిన కొద్ది మందిలో ఒకరైన జిల్లా కలెక్టరుగా పని చేస్తున్న రామచంద్రరావు, భారతీయ గణిత శాస్త్ర సమాజంలోని బృందానికి రామానుజన్ ప్రతిభ అమోఘం అని అర్థమైంది. రామానుజన్ ప్రతిభను గుర్తించిన నారాయణ అయ్యర్, రామచంద్ర రావు, ఇడబ్లు మిడిల్‌మాస్ట్ మొదలైన వారు రామానుజన్ పరిశోధనలను ఆంగ్ల గణిత శాస్త్రవేత్తలకు చూపించడానికి ప్రయత్నించారు. లండన్ యూనివర్శిటీ కాలేజీకి చెందిన ఎంజెఎం హిల్ అనే గణితజ్ఞుడు రామానుజన్ పరిశోధనలను చదివి అందులోని తప్పులను సవరించడానికి తగిన సలహాలు అందించి ప్రోత్సహించాడు.

1913లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్‌కు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ హకర్ రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయి రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను ఆ కాలంలో ప్రసిద్ధుడైన కేంబ్రిడ్జి ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్ హార్డికి పంపారు. ఉన్నత స్థాయి గణితజ్ఞుడు రాయగల ఆ ఫలితాలను చూసి వెంటనే రామానుజన్‌ను జిహెచ్ హార్డీ కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. రామానుజన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 1919 మార్చిలో ఇంగ్లాండ్ నుండి భారత దేశానికి తిరిగి వచ్చారు. వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడో అలాకాక పాలిపోయిన ముఖంతో ఏమాత్రం బలం లేని శరీరంతో అస్థిపంజరంవలే తిరిగి రావడం చూసి అక్కడి వారందరూ చలించిపోయారు. అనేక రకాల వైద్యం చేయించినా ఆయన కోలుకోలేకపోయారు. దాంతో ఆయన 1920, ఏప్రిల్ 26న పరమపదించారు. అతి చిన్న వయసులో ప్రపంచం ఆశ్చర్యపోయే మేధా సంపత్తిని కలిగిన ఒక గొప్ప గణిత శాస్త్రజ్ఞుడిని కోల్పోవలసి వచ్చింది. ఫిబ్రవరి 28, 1918లో ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయునిగా, 1918 అక్టోబరులో ‘ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజీ’ గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా రామానుజన్ చరిత్రకెక్కారు.

గడప రఘుపతిరావు
99634 99282

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News