Thursday, May 2, 2024

పాలకులుగా కాదు, ప్రజా సేవకులుగా పనిచేస్తాం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

పోరాటాలు, త్యాగాల పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాలుగు కోట్ల మంది తెలంగాణా ప్రజల ఆకాంక్షలను, ఆలోచనలను ప్రతిఫలించేలా, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించేందుకు కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి తోడ్పడతామన్నారు. రాష్ట్రప్రభుత్వంలో ప్రజలు కూడా భాగస్వాములేననీ, తాము పాలకులుగా కాకుండా ప్రజా సేవకులుగా పనిచేస్తామన్నారు.

గురువారం లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ మాట్లాడుతూ ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుపకంచెలను పగలగొట్టామని, రేపటినుంచి అది జ్యోతీరావు పూలే ప్రజాభవన్ గా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రజాభవన్ లో జరిగే ప్రజా దర్బార్ కు అందరూ రావాలని ఆయన ఆహ్వానించారు. ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రజాభవన్ కు వచ్చి తమ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవచ్చునని పిలుపునిచ్చారు.

తెలంగాణకు పట్టిన చీడ, పీడ పోయాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేసిన కార్యకర్తల కష్టాన్ని మరచిపోబోమన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతతో, గౌరవంగా చేపడతామని చెప్పారు. నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. జై సోనియమ్మ జై కాంగ్రెస్ అని నినదిస్తూ ప్రసంగం మొదలుపెట్టిన రేవంత్ అవే నినాదాలతో ప్రసంగాన్ని ముగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News