Sunday, October 6, 2024

ఫాంహౌస్ లలో జిల్లేళ్లు మొలిపిస్తా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :రాహుల్‌గాంధీలది త్యా గాల కుటుంబమని, ప్రాణత్యాగం అంటే ఇందిరాగాం ధీ, రాజీవ్‌గాంధీలదేనని సిఎం రేవంత్ అన్నారు. పదవీ త్యాగం అంటే సోనియా, రాహుల్ గాంధీలదేనని ఆయ న పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిట్ జవహర్ లాల్ నెహ్రూదని, సర్వం కోల్పోయిన కుటుంబం వారిదని, 563 సంస్థానాలను దేశంలో విలీనం చేయించి దేశ సమగ్రతను కాపాడిన ఘనత నె హ్రూదని సిఎం రేవంత్ గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ పెడతామనగానే బిఆర్‌ఎస్ పార్టీ వారికి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఎందుకు గుర్తుకొచ్చిందని సిఎం ప్రశ్నించారు.

ఇక్కడి నుంచి రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటూ కొందరు సన్నాసులు మా ట్లాడుతున్నారని, ఎవరొస్తారొ డేట్ ఫిక్స్ చేసి చెప్పాలని, కాంగ్రెస్ కార్యకర్తలు వారి సంగతి చూసుకుంటారని సి ఎం రేవంత్ హెచ్చరించారు. ఈ పదేండ్ల కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న సోయి కూడా లేదా అని సిఎం రేవంత్ బిఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించారు. వా రికి ఆ సోయి లేదు కాబట్టే తెలంగాణ పరిపాలనకు గుం డెకాయగా ఉండే సచివాలయంలో తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరిస్తామని, రాష్ట్ర ప్రజలకు మాట ఇస్తున్నానని ఆయన అన్నా రు. సోమవారం రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

ఫాంహౌజ్‌లో, గడీల్లో జిల్లేళ్లు మొలిపిస్తా
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ పదేళ్లు రాష్ట్ర సంపదను దోచుకొని, పదవులు అనుభవించి, వేలాది ఎకరాల భూముల్ని ఆక్రమించిన బిఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు కుటుంబ పాలన అంటూ కాంగ్రెస్‌పై కామెంట్లు చేయడాన్ని సిఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. కెసిఆర్ కుటుంబ సభ్యుల ఫాంహౌస్‌లు, గడీల్లో జిల్లేళ్లు మొలిపిస్తానని ఆయన హెచ్చరించారు. గడీల్లో గడ్డి మొలవాల్సిందేనంటూ ఆనాడే చాకలి ఐలమ్మ చెప్పారని, ఇప్పుడు ఆ స్ఫూర్తితో రాజీవ్‌గాంధీ విగ్రహం సాక్షిగా చెబుతున్నానని ఫాంహౌస్‌ల్లో జిల్లేళ్లు మొలవాల్సిందేనని అప్పటివరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరని ఆయన తెలిపారు. ఏ ఫాంహౌస్‌లు వారిని కాపాడలేవని సిఎం రేవంత్ హెచ్చరించారు.

మిడతల దండు ఊళ్ల మీదకు రాబోతుంది…
తెలంగాణ ప్రజలారా అప్రమత్తం కావాలని, ఈ మిడతల దండును తెలంగాణ పొలిమేరలకు తరమాలని సిఎం రేవంత్ సూచించారు. కెసిఆర్ కుటుంబ సభ్యులంతా ఫాంహౌజ్‌లు కట్టుకున్నారని, ఒకరికి వెయ్యి ఎకరాల్లో ఫాంహౌజ్, ఇంకొకరికి వంద ఎకరాల్లో, ఇంకొకరికి పది ఎకరాల్లో ప్రగతి భవన్, వాస్తు సక్రమంగా లేదని కొత్త సచివాలయం కట్టుకున్నారని, లక్ష కోట్లు దిగమింగి కాళేశ్వరం కట్టారని, ఇవన్నీ కెసిఆర్ కుటుంబ చరిత్ర అని సిఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తలను బిఆర్‌ఎస్ లీడర్లు ఎవరైనా ఏమన్నా అంటే తాను చూసుకుంటానని ఆయన అన్నారు. అధికారం పోయినా వారికి మదం తగ్గలేదన్నారు. కొంతమంది చిల్లరగాళ్లను మనపైకి ఉసిగొల్పుతున్నారని, కాలకేయ ముఠా మిడతల దండుగా మారి తెలంగాణను మింగేసేందుకు మళ్లీ ఊళ్ల మీదకు రాబోతుందన్నారు.

కొండా లక్ష్మణ్ చివరిచూపుకు కూడా వెళ్లలేదు
దేశం కోసం ప్రాణాలిచ్చిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడమే సముచితమన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ అవసరాల కోసం ఆశ్రయం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కనీసం ఆయన చివరి చూపుకు కూడా వెళ్లలేదని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, తాము మాత్రం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నామని, మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించామని సిఎం రేవంత్ గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సందర్భంగా ఇక్కడ రాజకీయాలు ప్రస్తావించడం తనకు ఇష్టం లేకపోయినా కొంతమంది చిల్లరగాళ్లు చేసే కామెంట్లకు ఈ వేదిక నుంచే కొన్ని విషయాలను గుర్తుచేయాలన్న భావనతో వీటిని చెప్పాల్సి వస్తుందన్నారు. అడ్డగోలుగా వేల కోట్ల రూపాయల్ని కూడబెట్టుకున్న వాళ్లకు త్యాగం అంటే ఏమిటో గుర్తు చేయదలచుకున్నానని సిఎం రేవంత్ అన్నారు.

నెహ్రూ బ్రతికి ఉండగా ఇందిరాగాంధీ ఏ పదవిని తీసుకోలేదు
మతకల్లోలాలతో దేశంలో రక్తం ఏరులై పారుతుంటే దార్శకనికతను ప్రదర్శించి శాంతిని నెలకొల్పింది సెహ్రూ కాదా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి దేశ భవిష్యత్‌కు పునాదులు వేశారని సిఎం రేవంత్ గుర్తుచేశారు. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ మనకు అందించిన సంపద అని, కొంతమంది సన్నాసులు వారసత్వ రాజకీయల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ బ్రతికి ఉండగా ఇందిరాగాంధీ ఏ పదవిని తీసుకోలేదని, ఇప్పటికీ ఇందిరమ్మను పేదలు దేవతలా పూజిస్తున్నారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. బ్యాంకుల జాతీయకరణ చేసి పేదల అభివృద్ధికి కృషి చేశారని, రాజభరణాలు రద్దు చేశారని, దళిత, గిరిజన, బలహీన వర్గాల ఆత్మగౌరవం పెరిగేలా భూములు పంచి పెట్టారని, పేదోళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి వారికి సొంతింటి కలను నిజం చేశారని, లంబాడాలను ఎస్టీల్లో చేర్చారని, దేశంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారని, దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకూ కృషి చేసిన త్యాగశీలి అని ఆయన పేర్కొన్నారు.

దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధే
దేశానికి నాయకత్వ సమస్య వచ్చినపుడు ప్రజల కోసం రాజీవ్‌గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని, దేశ భవిత యువత చేతుల్లో ఉండాలన్న ఉద్దేశంతో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించి గ్రామ పంచాయతీలకు నిధులు చేరేలా సంస్కరణలు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కిందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి ఆడబిడ్డలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించింది రాజీవ్‌గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు. ఐదేళ్లపాటు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వని సన్నాసులకు మాహిళల ఆత్మ గౌరవం గురించి ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ మరణించినా సోనియాగాంధీ అప్పటి కేంద్ర ప్రభుత్వంలో ఏ పదవి తీసుకోలేదని, 2004- నుంచి 2014ల మధ్యకాలంలో రాహుల్‌గాంధీ కూడా ఏ పదవిని అనుభవించలేదన్నారు.

చివరకు తెలంగాణ బిడ్డ పివి నర్సింహారావును దేశ ప్రధానిని చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ఈ దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ కంప్యూటర్‌ను పరిచయం చేసి ఉండకపోతే కెటిఆర్ గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునే వారని, లేదంటే సిద్దిపేటలో చాయ్ అమ్ముకునే వాడన్నారు. రాజీవ్‌గాంధీ ఆనాడు కంప్యూటర్‌ను పరిచయం చేయకుంటే కెటిఆర్ గత ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేసేవారా?… ట్విట్టర్‌లో మెసేజ్‌లు పెట్టేవారా?.. ఇప్పుడు ఈ స్థాయికి చేరేవారా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ నాయకులకు అధికారం పోయినా మదం దిగలేదన్నారు. అధికారం పోయింది, ప్రజా పాలన వచ్చింది, గడ్డీలు బద్దలైపోయాయి, వారి బతుకులు దివాళా తీశాయన్నది వాస్తవం కాదా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. కెసిఆర్‌కు ఇంకా ఈ విషయం అర్థం కావడం లేదన్నారు. ఆయన ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని అందుకే కెసిఆర్‌కు రెగ్యులర్ గా ఫాంహౌస్‌లో షాక్ ట్రీట్‌మెంట్ నడుస్తోందన్నారు.

దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన నేత రాజీవ్: మంత్రి కోమటిరెడ్డి
దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారని కొందరు అడుగుతున్నారు. అసలు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే అర్హత బిఆర్‌ఎస్‌కు ఉందా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానేత అని మంత్రి కొనియాడారు. దేశంలో యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని ఆయన గుర్తుచేశారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న విషయం కెసిఆర్‌కు గుర్తు రాలేదా? అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9వ తేదీన ఇక్కడే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. రాబోయే పదేళ్లు అధికారం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ నేతలు ఒకటి అంటే తాము రెండు అంటామని ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.

విగ్రహం పెట్టాలన్న ఆలోచన సిఎం రేవంత్‌ది: పిసిసి అధ్యక్షుడు
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు పెట్టాలన్న ఆలోచన ముఖ్యమంత్రిదని టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈ దేశం గాంధీ కలలు కన్న విధంగా నడవాలని ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిధులు పంపించి గ్రామ స్వరాజ్యం రాజీవ్ గాంధీ చూపించారన్నారు. నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు పంపించిన నేత రాజీవ్ గాంధీ అని ఆయన కొనియాడారు. నేడు మనం వాడుతున్న సెల్‌ఫోన్లు 1995, 96లో ఆయన తీసుకున్న సంస్కరణల వల్లే వచ్చాయన్నారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ దశ, దిశను నిర్దేశిస్తాయని ఆయన తెలిపారు. ఈ ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షి, పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, సీతక్క, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News